వామన మహా పురాణము
చేయకూడని పనులు
అలా భగవత్స్మరణతో శయ్య నుంచి లేచి, ధర్మార్థ చింతన పూర్వకంగా శ్రీహరి నామం స్మరించి నిత్య విధులకు ఉపక్రమింపవలెను. దేవగోబ్రాహ్మణాగ్ని మార్గాలను, రాజ వీథులను, చతుష్పథాలను, గోశాలలను వదలి తూర్పు పడమర దిక్కులను వదలి మలమూత్రాదులు వదలాలి. మలోత్సర్జనం తర్వాత మట్టితో గుదస్థానాన్ని ముమ్మారు, ఎడమ అరచేతిని ఏడు పర్యాయాలు, తర్వాత ఆ రెండింటినీ పది పర్యాయాలు, లింగాన్ని ఒక పర్యాయం శుభ్రం చేసుకోవాలి. ఓ రాక్షసా! సదాచారం తెలిసినవాడు ఈ మృత్తికను నీళ్ళలో నుంచి కాని, ఎలుక బొరియల నుంచి కాని, పాము పుట్టల నుండి గాని ఒక పర్యాయం ఉపయోగించి వదలినది కాని, లేక ఇంటిలో నుంచి కాని తీసుకోరాదు. తెలిసిన వ్యక్తి తూర్పు ముఖంగా కాని, ఉత్తర ముఖంగా కాని తిరిగి కూర్చొని మొదట రెండుమార్లు ముఖం కడుగుకొని నురుగులేని నీళ్ళతో పుక్కిలించవలెను. అనంతరం చేతితో పంచేంద్రియాలను, శిరస్సును స్పృశించి, దంత ధానవం చేసి, తల దువ్వుకొని అద్దంలో ముఖం చూచుకొని యథావిధిగా సంధ్యా వందనం చేయవలెను. అపైన శిరఃస్నానం గాని, అంగ స్నానంగాని చేసి, దేవ పితృజల తర్పణం విడిచి, హోమం చేసి మంగళ ద్రవ్యం ముట్టుకొని అనంతరం బయటకు వెళ్ళుట ప్రశస్తం. ఈ మంగళ ద్రవ్యములలో దూర్వా (గరిక), పెరుగు, నెయ్యి, జలకుంభం, దూడతో ఉన్న ధేనువు, వృషభం, బంగారం, మృత్తిక, ఆవుపేడ, స్వస్తికం అక్షతలు, పేలాలు, తేనె, బ్రాహ్మణ కన్య, తెల్లని పూలు, అగ్ని, చందనం, సూర్యబింబం, రావిచెట్టు ముఖ్యమైనవి. వీనిలో ఏ ఒక దాని నైనను స్పృశించి యితర పనులు చూచుకోవలెను. దేశ కాలాదుల ననుసరించి తన కులధర్మం గోత్రవిధులు వదలకుండా నిర్వర్తించుకోవలెను. ఆ విధంగా అర్థ సిద్ధిని పొందుతూ, అనవసర విషయాలు, అసత్య వచనాలు, పరుషవచనాలు, వేదశాస్త్ర విరుద్ధ విషయాలు మాటాడకుండా కాలయాపన చేయాలి. లేనిచో సజ్జనుల నిందకు గురికావలసి వచ్చును. సదాచారశీలునకేనాడును ధర్మభంగం చేయడం కాని, దుష్టులతో సహవాసం కాని విహితాలు కావు. ఉభయ సంధ్యలలో గాని పగటివేళ కాని స్త్రీ సంగమం పనికిరాదు. పరస్త్రీలతో అసలే పనికిరాదు. ఓ వీరాగ్రణీ! ప్రయోజనం లేని తిరుగుడు, అర్థంలేని దానం, పశుహింస, అక్రమంగా దారపరిగ్రహణం గృహమేధి చేయరాదు. వృథా పర్యటనం వల్ల నిత్యనైమిత్తిక కర్మలకు అంతరాయం, వ్యర్థపు దానంవల్ల ధన నష్టం సంభవిస్తాయి. ఉబుసుపోకకు పశుహింస చేయువాడు నరకానికి పోతాడు. ఇక అక్రమ దారగ్రహణం వల్ల సంతానహాని అమంగళకరమైన వర్ణసాంకర్య భయం సంభవిస్తాయి.
ఉత్తములగువారు పరధనానికి, పరుల భార్యలకు ఆశపడరు. వానిలో మొదటిది నరక ద్వారమైతే, రెండవది మృత్యువుకు హేతువు. వివస్త్రలుగా ఉన్న పరస్త్రీలను చూడరాదు. చోరులతో సంభాషింపరాదు. ఋతుకాలంలో ఉన్న స్త్రీలను చూడరాదు, తాకరాదు. వారితో సంభాషించ గూడదు. తోబుట్టువులతో గాని, ఇతరుల భార్యలతో గాని, తన తల్లితో కాని వయసు వచ్చిన కూతురుతో గాని ఒకే అసనం మీద కూర్చోకూడదు. దిగంబరంగా పరుండరాదు, స్నానం చేయరాదు, అటునిటు తిరుగరాదు. పగిలిపోయిన ఆసనాల (పీటల)ను గాని, పాత్రను గాని దూరంగా వదలివేయాలి. శుక్ల పాడ్యమి, షష్టి, ఏకాదశి తిథులలో తైలాభ్యంజన మాచరించరాదు. చతుర్థి నవమి చతుర్దశీలలో క్షౌరం చేసుకోకూడదు. శుక్ల పంచమి, దశమి పూర్ణిమలలో స్త్రీ సంగమం పనికిరాదు. అయితే శుక్ల విదియ, సప్తమి, ద్వాదశీ తిథులలో పైవన్నియూ చేయవచ్చు. ఆదివారం, మంగళ వారములలో తలంటిస్నానం, శుక్రవారాల్లో క్షౌరం, శనివారాల్లో మాంసాహారం వర్జించాలి. బుధవారాలలో స్త్రీ సంగమం కూడదు. మిగతా దినాలలో ఏదైన ఎప్పుడైన చేయవచ్చు. చిత్ర, హస్త, శ్రవణ నక్షత్రాల్లో అభ్యంజనం, విశాఖ అభిజిత్తులలో క్షారం, మూల మృగశిర భాద్రపదలలో మాంసభక్షణం, మఖకృత్తిక ఉత్తర నక్షత్రాలలో స్త్రీ సంగమం చేయకూడదు. పశ్చిమ ఉత్తర దిశగా తలపెట్టుకుని ఏనాడూ నిద్రించరాదు. రాక్షసేశ్వరా! దక్షిణ దిశగా గాని పడమట దిక్కుగా గాని కూర్చొని భోజనం చేయరాదు. దేవాలయాలను, దారి ప్రక్కన దారులు కలిసేచోట (చతుష్పథాలు) ఉండే చెట్లను, విద్యాధికులను, గురువులను కుడివైపు నుండి ప్రదక్షిణించకూడదు. తెలిసినవాడు ఇతరులు ఉపయోగించిన పూమాలలను, అన్నపానీయాలను, వస్త్రాలను తాను ఉపయోగించకూడదు. రోజూ శిరఃస్నానం చేయాలి; విశేష కారణం లేకుండా రాత్రివేళలు చేయరాదు. అనగా గ్రహణ పర్వాలలో గాని, బంధువులు మరణించినప్పుడు కాని, జన్మ నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించి నప్పుడు కాని రాత్రుల్లో శిరస్నానం చేయవచ్చు. రాక్షస రాజా! తలంటుకొనిన వానిని తాకకూడదు. తలార స్నానం చేసిన వెంటనే వెండ్రుకలను విదిలించరాదు. వెంటనే విడిచిన గుడ్డతో గాని చేతితో గాని శరీరం తుడుచుకోకూడదు. చక్కని రాజ్యపాలనలో ఉన్న దేశంలో ఐకమత్యంతో కలిసికట్టుగా ఉన్న సమాజంలో, క్రోధనులు న్యాయప్రియులు అయిన జనుల మధ్య కష్టపడి సేద్యముచేయు రైతులు, అనేక విధాల ధాన్యపుపంటలు కలిగి సమృద్ధమైన చోట నివాసమేర్పరచుకోవాలి. అశక్తుడు ప్రజలను దండించే వాడునైన రాజు ఉన్నచోటున పరస్పర వైరంతో, ఆమోద ప్రమోదాల్లో మునిగి తేలే ప్రజానీకం ఉన్నచోట బుద్ధిమంతుడగు వాడుండరాదు. సుకేశీ! ఈ విషయాలు మరువరాదు సుమా! అని ఋషులు తెలిపి ఇంకను