వామన మహా పురాణము
ప్రహ్లాదుని తీర్థయాత్రా క్రమం
అప్పుడు నారదుడు పులస్త్యుని తిరిగి ప్రశ్నించాడు: ఓ ద్విజోత్తమా! ప్రహ్లాదుడు ఏఏ తీర్థాలలో పర్యటించాడు. ఆ వివరాలు సమగ్రంగా చెప్పండి.
అందుకు పులస్త్యుడిలా అన్నాడు. నారదా! వినుము. పాపపంకాన్ని క్షాళనం చేయగలిగిన అప్రహ్లాదుని తీర్థ యాత్రా విశేషాలు చెబుతున్నా. ప్రహ్లాదుడు బంగారు పర్వతం మేరువును వదలి, భూలోకంలో దేవతలచే చుట్టబడి కళ్యాణ ప్రదంగా భావించబడే మానసతీర్థానికి వెళ్ళాడు. ఆ సరస్సులోనే శ్రీహరి మత్స్య శరీరంతో ఉన్నాడు. అచట నా అచ్యుతుని వేదోక్త విధిగా పూజించి ఉపవసించి దేవ ఋషి పితృ మానవులను అర్చించి పాపనాశిని యగు కౌశికీ తటానగల కూర్మ భగవానుని దర్శించుటకు వెళ్ళాడు. ఆ మహానదిలో స్నానం చేసి జగన్నాథుని అర్చించి ఉపవసించి శుచియై విప్రులకు దక్షిణలిచ్చాడు. ఆ కూర్మమూర్తికి మరల ప్రణమిల్లి అక్కడ నుండి కృష్ణుడను పేరుగల హయముఖ విష్ణు దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ పవిత్ర సరస్సులో మునిగి దేవ పితృ తర్పణాలు గావించి హయగ్రీవ మూర్తిని పూజించి అక్కడ నుండి పవిత్ర క్షేత్రం హస్తినాపురికి వెళ్ళాడు. అక్కడ విధ్యుక్తంగా స్నానం చేసి చక్రపాణి గోవిందుని పూజించి తర్పణాదులు వదలి లోకేశ్వరుడగు త్రివిక్రముని దర్శించాడు. అప్పుడు నారదుడిలా ప్రశ్నించాడు.