వీరభద్ర విహారం

యజ్ఞశాలలో ప్రవేశించిన వీరభద్రుని చూడగానే అందున్న దేవతలందరు-అష్ట వసువులు, నవగ్రహాలూ, ఇంద్రాది ద్వాదశాదిత్యులు ఏకాదశరుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, సిద్ధగంధర్వ కింపురుషులు పన్నగులు యక్షులు, ఖగములు చక్రధరులు మొదలగు వారెల్లరు లేచి నిలబడిరి. వైవస్వత వంశానికి చెందిన లబ్ధ ప్రతిష్ఠుడగు ధర్మకీర్తి, ఉగ్రుడు మహాబాహువు నగు సోమ వంశోద్భవుడు భోజకీర్తి, అక్కడ చేరిన దైత్యులు దానవులు తదితరులెల్లరు తమతమ ఆయుధములతో రుద్రమూర్తియగు వీరభద్రుని ఎదుర్కొనిరి. అంతట వీరభద్రుడు తన తీవ్ర శర పరంపరతో వారలందరను చెల్లాచెదరు కావించెను. వారందరు తమ అసమాన శస్త్రాలను వీరభద్రునిపై కుప్పింపగా నా గణాధిపుడు కూడ తన శ్రేష్ఠమైన ఆయుధాలతో వానినన్నింటిని తుత్తునియలు గావించెను. వీరభద్రుని అస్త్రములచే తీవ్రముగ నొప్పింపబడి చేయునదిలేక నాదేవత లందరు ఆతనికి లొంగి పోయిరి. అంతట వీరభద్రుడు మహర్షుల ఆజ్యాహుతులతో వెలుగుచున్న విశాలమగు యజ్ఞశాలలో ప్రవేశించెను. భయంకరాకారులై వచ్చు నా సింహముఖ గణాలను చూచి నంతనే హడలిపోయి ఋత్విక్కులందరూ తమతమ యజ్ఞ వేదికలు వదలి పారిపోయి నారాయణుని శరణువేడిరి. భయకంపితులగు నామహర్షుల కభయమొసగి విష్ణువు తన ఉత్తమమగు శార్ఙ్గధనువు నెత్తికొని వీరభద్రునిపై అభేద్యకవచములను సైతము చించి చెండాడ గలిగిన అగ్ని బాణములను వర్షించెను. అమోఘాలయిన ఆ బాణాలన్నీ వీరభద్రుని శరీరమును తాకి నాస్తికులను యాచించి విఫల మనోరథులయిన యాచకులవలె వ్యర్థములై నేలబడిపోయెను. తన బాణములు ఆ విధంగా వ్యర్థములగుట చూచి కేశవుడు దివ్యాస్త్రాలతో వీరభద్రుని ముంచి వైచుట కుద్యమించెను. శ్రీహరి ప్రయోగించిన అస్త్రాలన్నింటిని వీరభద్రుడు త్రిశూలంతో గదతో, మార్గణాలతో నివారించెను. తన దివ్యాస్త్రములు వ్యర్థము కాగా మాధవు డాతనిపైకి గదవిసరెను. ఆగదను త్రిశూలముతో భూమిపైబడగొట్టెను. అంతటహరి వీరభద్రునిపై హలము, ముసలము ప్రయోగింపగా వానిని గణేశుడు గదతో నివారిత మొనర్చెను. అంతట మహాక్రోధంతో నారాయణుడు వీరభద్రునిపై చక్రము ప్రయోగించెను. నూరుసూర్యుల కాంతితో వచ్చే ఆ సుదర్శనాన్ని చూచి వీరభద్రుడు తన శూలాన్ని వదలివైచి, మనశరీరం ధరించి ఇంద్రుడు మధురాక్షసుని మ్రింగినట్లుగా, చక్రాన్ని మ్రింగివైచెను. అంతట క్రోధంతో నల్లబడిన సుందర నేత్రాలతో విష్ణువు వీరభద్రుని సమీపించి మెరుపు వేగంతో నతని భూమిపై బడగొట్టి బాహువులతో తీవ్రంగా మర్దించెను. అట్లు భయంకరంగా మర్దింపబడిన వీరభద్రుడు రక్తము కక్కుకొని పడిపోవటంతో అతని శరీరము నుండి చక్రము వెలికివచ్చెను. అంతట తన చక్రాన్ని తాను తీసికొని విష్ణువు వీరభద్రుని వదలి వైచెను. వాసుదేవునికి ఓడిపోయి వీరభద్రుడా విషయము శంకరునకు నివేదించెను. నెత్తుట దోగిన వీరభద్రుని చూచి శివుడు క్రోధోన్మత్తుడై వీరభద్రుని భద్రకాళిని వారినిర్దిష్ట స్థానాల్లో నిలిపి, తాను స్వయంగా త్రిశూలపాణియై దక్షుని యజ్ఞశాలలోనికి జొరబడెను. ఆ విధముగా వచ్చిన త్రిపురాంతకుడగు మహాదేవుని చూచి ఋషులందరు భయ కంపితులు అయినారు.