వామన మహా పురాణము
అంధకకృత హరస్తుతి
ప్రభో! భీమరూపివగు ఓ భైరవా! నీకు నమస్కారము! త్రిలోక రక్షకా! శిత శూలపాణీ! నాగేంద్రహారా! దశభుజధారీ! త్రినయనా! దుర్బుద్ధినైన నన్ను కాపాడుము! సర్వేశ్వరా! విశ్వరూపా! నీకు జయమగుగాక! సురాసుర వందితచరణా, ముల్లోకాలకూ తల్లీతండ్రీ అయిన వృషకేతనా! నేను భయంతో నీ అండ జేరితిని. నాకు శరణొసంగుము ప్రభో! నిన్ను దేవతలు శివుడని కీర్తిస్తారు. సిద్ధులు హరుడవనీ, మహర్షులు స్థాణుడవనీ, యక్షులు భీముడవనీ, మానవులు మహేశ్వరుడవనీ భజిస్తారు. భూతగణాలు భూతనాథుడవనీ, నిశాచరులు ఉగ్రుడవనీ, పుణ్యులు పితరులూ భవుడవంటూ నీకు ప్రణతులౌతారు. హరా! నా పాపాలు హరించు! నీకు దాసుడను ఓ లోకేశ్వరా నన్ను రక్షించుము! త్రిదేవులు, త్రియుగాలు, త్రిధర్మాలు, త్రిపుష్కరాలు (కమలాలు) త్రివేదాలు, త్రయ్యారుణి - ఇలా త్రిస్వరూపుడవగు త్రినేత్రుడవు నీవే! ఓ అవ్యయా! నన్ను పవిత్రుని గావించి రక్షింపుము. మూడు విధాలా నా చికేతాగ్నివి నీవు. త్రిపదప్రతిష్ఠ గాంచిన వాడవు. వేదాంగవేత్తవు. విషయాలకు అతీతుడవు. ముల్లోకాధిపతివి కల్యాణరూపివి, నీకు శరణాగతుడ నైనాను. నా భయం పోగొట్టి నన్ను రక్షించుము. ఓ మంగళాకరా! ఘోర శత్రుడైన కామునకు లొంగిపోయి నేను భయంకరమైన అపరాధం చేశాను. ఓ సర్వ భూతాధీశ్వరా! గిరీశా! నీకు శిరసావందనం చేస్తున్నాను. నా యెడల ప్రసన్నుడవు కమ్ము! నేను పాపిని, కరుడు గట్టిన పాపాన్ని, పాపంలోనుంచి పుట్టాను. నా ఆత్మ పాప పంకిలమైంది. అలాంటి నన్ను సర్వపాప హరుడవైన భవా! ఈశానా! రక్షింపుము! ప్రభూ! నీవే సర్వకారణుడవు. నన్నీ విధంగా పుట్టించావు కనుక తండ్రీ! నా మీద కోపింపవద్దు. పాపాచారులుగా సృష్టించావు. నా పట్ల కరుణించుము. ప్రసన్నుడవుకమ్ము! నీవే కర్తవు, దాతవు, జయానివి, మహాజయానివి! శుభానివి నీవు ప్రణవ ఓంకారం నీవు ధ్రువమై క్షయంలేని తత్వానివి సర్వనియంతవు, బ్రహ్మవు నీవు, పాలించే విష్ణువు నీవు; ఈశ్వరుడవు ఇంద్రుడవు వషట్కారానివి ధర్మానివి సర్వమూ దేవదేవుడవైన నీవే! సూక్ష్మాన్ని వ్యక్తానివి అవ్యక్తానివి అన్నీ నీవే. స్థావర జంగమాత్మకమైన విశ్వాన్నంతా ఆవరించియున్న ఈశ్వరుడవు నీవే, నీవు విజయుడవు సహస్రనేత్రుడు, మహాభుజుడవు, అనంతుడవు సర్వవ్యాప్తివి ప్రాణస్వరూపివైన హంసవు. నీకు చ్యుతిలేదు. గీర్వాణుల నేతవు నీవు శాంతుడవు రుద్రుడవు, పశుపతివి. శివుడవు, త్రయీ (వేదాలు) వేద్యుడవు, త్రయీమయుడవు, క్రోధాన్ని జయించావు. ఇంద్రియ విజేతవు. అరిషడ్వర్గాన్ని జయించావు. ఓ జయరూపా త్రిశూలధరా! శరణుజొచ్చిన నన్ను రక్షించుము.”
ఇంకా దేవఋషితో పులస్త్యుడిలా చెప్పాడు, ఓ నారదా! ఆ విధంగా దైత్యాధిపతి చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ పింగళాక్షుడా హిరణ్యాక్ష పుత్రునితో ఇలా అన్నాడు. “అంధకా! రాక్షసాధిపా! నీవు సిద్ధుడవైనావు. నేను సంతోషించాను. అంబిక దక్క మరేదైనా వరమడుగుము. ఇచ్చెదను నీకు భద్రమగుగాక!” అది విని అంధకుడు, “ప్రభో! నేటినుండీ అంబిక నాకు తల్లి, త్రినేత్రుడే తండ్రి. ఆమాతృశ్రీ చరణారవిందాలకివే వందనశతాలు! ఓ ఈశ్వరా! వరదా! నేనింత వరకు మనసా వాచాచేసిన దుష్టాలోచనలు, దుర్భాషలు, శరీరంతో చేసిన దుష్కృత్యాలు అన్నీ విలయమై పోవునట్లను గ్రహించుము. జన్మతః నాకు సంక్రమించిన దానవభావం నశింపజేసి నీ పాదపద్మాలపట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు తండ్రీ!” అని ప్రార్థించాడు. అందులకు పరమ శివుడు ప్రీతుడై అట్లే అగుగాక! నీ పాపమంతా నశించిపోతుంది. నీలోని దైత్యబుద్ధి వదలింది. నేటి నుండీ నీవు భృంగి అనుపేర గణాధిపతి వయ్యావని వరమిచ్చి త్రిశూలాగ్రాన్నుంచి క్రిందకు దించాడు. వాని శరీరంలోని వ్రణాలన్నింటినీ తన చేతితో నిమిరి మాన్పి, ఆరోగ్యవంతుని చేశాడు. అంతవరకు తన శరీరంలో దాచుకొన్న బ్రహ్మాది దేవతల నందరను బయటకు రమ్మని పిలువగా ఆ మహనీయులందరూ బయటకు వచ్చి ఆయనకు నమస్కరించారు. అంతట ఆ త్రిలోచనుడు నందితో సహా గణాలనందరనూ సమావేశపరచి వారలకు భృంగిని చూపి ఇతడు గణాధిపతి. వెనుకటి అంధకుడు కాడని కంఠోక్తి గావించాడు. గణాధిపత్యం సంపాదించి రక్తమాంస హీనుడై ఎండియున్న ఆ దానవేశ్వరుని చూచి అందరు నా వృషభద్వజుని ప్రశంసించారు. అంతట నా గౌరీవల్లభుడా దేవతల నందరను ఆలింగనం చేసికొని “మీమీ నెలవులకు వెళ్లి సుఖభోగాలనుభవించుడు, ఇంద్రుడు మాత్రం శుభం కరమైన మలయగిరికి వెళ్ళి తన కార్యం నిర్వర్తించుకొని ఆ మీద స్వర్గానికి వెళ్ళ గలడని” వారలకు వీడ్కోలు పలికాడు. పిమ్మట పితామహునకు నమస్కరించి జనార్దనుని కౌగిలించు కొని వీడ్కోలిచ్చాడు. వారంతట త్రివిష్టపానికి వెళ్ళిపోయారు. శతక్రతువు మలయగిరిలో తన కార్యం చక్కబెట్టుకొని దివికి వెళ్ళిపోయాడు. అలా ఇంద్రాది దేవతల నందరను పంపివైచి భగవంతుడగు శివుడు ప్రమథ గణాలను అందరను యథోచితంగా గౌరవించి అనుమతించగా వారందరు తమతమ వాహనముల మీద శుభలోకాలకు వెళ్ళారు. నారదా! అక్కడవారు కామధేనువులు, కల్పవృక్షాలు, అమృతనదులు, వెన్నతెట్టెలు గట్టే పాల సరోవరాల మధ్య మహాభోగాను అనుభవించారు. అనంతరం అంధకుడు మాతయైన గౌరికి ప్రమాణపూర్వకంగా నమస్కరించి ఈ విధంగా స్తుతించాడు.