దేవదానవ సంగ్రామం

సూకరముఖుడి దీనవచనాలువిని అంధకుడు, భయపడకుము నిన్ను తప్పక రక్షిస్తానని మేఘస్వరంతో అభయమిచ్చాడు. అప్పటికే అంధకుడికి తెలుపకనే మహాబలశాలురైన మహిష తారక, బాణరాక్షసపతులు తమతమ బలాలతో భూలోకానికి యుద్ధం చేసేందుకు వెళ్ళారు. స్కందుని గణాలు, భయంకరాకారాలతో తమ గర్జనలతో లోకాలన్నీ కంపింపచేస్తూండే ప్రదేశానికి ఆ రాక్షస నాయకులంతా తమతమ సాయుధబలాలతో వచ్చి చేరారు. నారదా! అలా రక్కసి మూకలు విరుచుకుపడటం చూచి కార్తికేయుని గణాలు నిప్పులు కురిపిస్తూ, మాతృగణాలతోసహా, శత్రువులమీదకు లంఘించారు. వారిలో ముందుభాగాన బలశాలియైన స్థాణువు పెద్ద గుదియ తీసికొని, పశువులను రుద్రుడు సంహరించునట్లుగా పరబలాన్ని చెండాడసాగాడు. ఆ మహాదేవుడు చేసే సంహారకార్యాన్ని చూసి కలశోదరుడు గొడ్డలి తీసుకొని మహారాక్షసు లందరను సంహరించాడు. భయంకరమైన అగ్నిగుండంలాంటి నోరు తెరచుకుని జ్వాలాముఖుడు రెండు చేతులతో రాక్షసులను నోటిలోనికి కుక్కుకొని సంహరించాడు. భయంకరమైన ప్రాస పట్టుకొని దండకుడు కోపంతో పిచ్చివాడివలె విజృంభించి వాహనంతోకూడా ఎత్తి మహా సముద్రంలో, ఆ మహాసురుడిని విసరివేశాడు. ప్రజలను వశపరచుకున్న మంత్రి ప్రాసాయుధంతో రాజు తల ముక్కలు చేసినట్లు శంకుకర్ణుడు రాక్షసులను నాగలితో తనవైపు లాగికొని రోకలి బండతో వాళ్ళ తలలు బద్దలు కొట్టసాగాడు.

గణేశ్వరుడైన పుష్పదంతుడు ఖడ్గండాలు పట్టుకొని రాక్షసులను రెండు మూడు ముక్కలుగా అనేక ఖండాలుగా నరక మొదలుపెట్టాడు. భయంకరమైన దండాన్ని తిప్పుతూ పింగళుడు ఎక్కడకు వెళ్ళితే అక్కడ రాక్షసుల శవాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. గణపతి యనుడు సహస్రవ శూలం త్రిప్పుతూ అశ్వగజరథాలతోసహా రాక్షసవీరులను సంహరించాడు. ఇంద్రుడు పిడుగులు కురిపించి కొండలను పిండిచేసినట్లు భీముడు భయంకరమైన శిలావృష్టితో శత్రువధ గావించాడు. అయిదు జటలుగల శకట చక్రాక్షుడనే కణాధిపతి, తన ముద్గరాన్ని మహావేగంతో త్రిప్పుతూ ఎందరినో యమాలయానికి పంపాడు. ఇక గిరిభేది అనే సార్థకనాముడు తన అరచేతి దెబ్బలతోనే ఏనుగులతో సహా ఆరోహకులను, రథాలతో సహా రథికులను బూడిదగా పొడిపొడి చేశాడు.

ఓ నారదా! ఇక బలశాలి అయిన నాడీజంఘుడు తన పాదాలతో మోకాళ్ళతో వజ్రాల్లాంటి ముష్టిఘాతాలతో ఉక్కు గుదియలతో శత్రునాశం గావించాడు. కూర్మగ్రీవుడు తన మెడతో తలతో పాదాలతో శత్రువులను చీల్చి మృత్యువుకు విందు చేశాడు. యుద్ధోన్మాదులైన ఆ రాక్షసులను పిండారకుడు తన దవడలతోను దంష్ట్రలతోను కొమ్ములతోను చీల్చి చెండాడాడు. ఆవిధంగా తమకు ఎదురులేని రాక్షససైన్యం గణాధిపతుల చేతుల్లో హతమై పోవడంచూచి మహారోషంతో మహిషుడు తారకుడు, ప్రచండ సేనాధిపతులు ముందుకు లంఘించారు. ఆ ఇద్దరు దైత్యనాయకులు శ్రేష్ఠమైన ఆయుధాలతో తమ్ము ప్రహరించడం చూచి ప్రమథులు నలువైపుల నుండి వారిని ముట్టడించి యుద్ధం చేయసాగగా, హంసాస్యుడు మహిషుణ్ణి పట్టిశంతో చావమోదాడు. షోడశాక్షుడు త్రిశూలంతో శతశీర్షుడు వాడికరవాలంతో శ్రుతాయుధుడు గదతో విశోకుడు రోకలిబండతో బంధుదత్తుడు శూలంతో ఒక్కపెట్టున వాడి మాడుమీద ప్రహరించారు. ఇంకా అనేకులు పార్షదులుకూడ శూలాలు శక్తులు పట్టిసాలతో ఆ మహిషుని ప్రహరించినప్పటికీ మైనాక పర్వతంలాగా ఆవీరుడు ఏమాత్రం చలింపలేదు. భద్రకాళి, ఉలూఖలుడు ఏకచూడుడు వాడియైన ఆయుధాలతో తారకుణ్ణి పొడవసాగారు. ఆవిధంగా ప్రమథులు మాతృగణాలు ప్రహరిస్తున్నా ఆమహాసురులు ఏమాత్రం బాధకులోనుగాక పైపెచ్చు ఆ దేవ గణాలను హింసింప సాగారు. మహిషుడు ప్రచండగదాయుధంతో ప్రమథులను ప్రహరించి ఓడించి కార్తికేయుడున్న వైపు పరుగుతీశాడు. అలా మీదకు లంఘిస్తున్న మహిషుని చూచి సుచక్రాక్షుడు మహాకోపంతో చక్రాయుధంతో వాడికి అడ్డుతగిలాడు. ఓ బ్రహ్మర్షీ! అలా మహారధులైన గణాధ్యక్షులు రాక్షసాధి పతులు, గదలు చక్రాయుధాలు చేబట్టి పరస్పరం ప్రహరించు కుంటూ సముఉజ్జీలుగా భయంకరంగా అలవోకగా యుద్ధం చేశారు. మహిషుడు గదను విసిరితే సుచక్రాక్షుడు చక్రాన్ని వాడిమీద ప్రయోగించాడు. భయంకరమైన అంచులుగల ఆ చక్రం గదను పొడిపొడిగావించి మహిషుడి మీదికి వచ్చింది. అదిచూచి దైత్యులంతా అయ్యో! మహిషుడు చచ్చాడుగదా! అని ఆక్రోశం చేశారు. అదివిని బాణుడు ప్రాసంతీసుకొని ఎర్రని కండ్లతో అయిదువందల ముష్ఠిఘాతాలతో చక్రాన్ని ఎదుర్కొన్నాడు. మరొక అయిదువందల బాహువులతో సుచక్రాక్షుణ్ణి బంధించగా, అతడు బలవంతుడయిన బాణునిముందు ఏమీచేయలేక పోయాడు.

సుచక్రాక్షుణ్ణి చక్రంతోసహా బాణుడు బంధించడం చూచి మహాబలుడైన మకరాక్షుడు గదాపాణియై బాణుడిపై దూకి గదతో వాని నెత్తిమీద మోదాడు. ఆ దెబ్బకు తాళలేక బాణుడు సుచక్రాక్షుణ్ణి వదలిపెట్టాడు. దానితో సిగ్గుతో తలవంచుకుని సుచక్రాక్షుడు యుద్ధభూమి వదలి సాలిగ్రామానికి వెళ్లిపోయాడు. మకరాక్షునిచేత చావుదెబ్బతిన్న బాణుడు కూడ కాలికి బుద్ధి చెప్పాడు. ఓ దేవరీ! రాక్షస సైన్యమంతా భగ్నమైపోవడం చూచి మహాబలియైన తారకాసురుడు మండిపడి ఖడ్గం తీసికొని ఆ గణాధిపతులందరను వెంబడించి తరిమికొట్టాడు. అలా వాడిచేతుల్లో దెబ్బలుతిని హంసాస్యుడు మొదలయిన గణపతులు మాతృకాగణాలు పారిపోయి స్కందునిచేరి మొరపెట్టుకున్నారు. బెదరిపోయిన తనగణాలను కత్తితో మృత్యువులాగా వారిని తరిమికొడు తున్న తారకుణ్ణిచూచి స్కందుడు తన భయంకరమైన శక్తితో వాడి వక్షస్థలాన్ని చీల్చివేశాడు. దానితో వాడు విగతజీవుడై నేలవ్రాలాడు. అలా తన సోదరుడు నేలగూలడంచూచి మహిషుడి పొగరంతా నీరుగారి పోయింది. భయంతో గడగడవణుకుతూ ఆ దుర్మార్గుడు యుద్ధభూమిని వదలి హిమాచలంలోని కైలాస శిఖరానికి పారిపోయాడు. తారకుడు స్కంధుని శక్తికి బలిగావడం, మహిషుడు హిమగిరికి పారిపోవడం రాక్షసబలాన్ని గణాలు చీల్చిచెండాడం చూచి బ్రతుకుజీవుడా! అంటూ బాణాసురుడుకూడా పారిపోయి సముద్రజలాల్లో అదృశ్యుడయ్యాడు. అలా తారకుని తనశక్తి కెరగావించి పారిపోతున్న మహిషుణ్ణిచూచి కార్తికేయుడు మయూరం మీద ఎక్కి మహావేగంతో ఆ దుష్టుని వెంబడించాడు. ఆ మహిషుడు వెనుకకు తిరిగి చూడగా మయూరధ్వజుడు శక్తితో తనను వెంబడించడం గమనించి కైలాసాన్ని వదలి క్రౌంచగిరి గుహలో దూరి దాగు కున్నాడు. అలా క్రౌంచగుహలో దూరిన మహిషుణ్ణి చంపకుండా స్కందుడు నిలబడిపోయి, స్వంత సోదరుణ్ణి ఎలా చంపడమా అని ఆలోచనలో బడినాడు. వెంటనే బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడువచ్చి క్రౌంచ పర్వతంతోసహా ఆ మహిషుణ్ణి శక్తితో భేదించమని కుమారునితో తొందర పెట్టారు. అప్పుడే దేవకార్యం సిద్ధిస్తుందన్నారు. అందుకా గుహుడు చిరునవ్వుతో మీరు చెప్పింది బాగుగానే వుంది. కాని నా మాతామహుని మనుమని, నా మేనమామ కుమారుని, నా సోదరునే ఎలా చంపగలను? గోబ్రాహ్మణ, వృద్ధులను, అప్త వాక్యము పలుకువానిని, బాలురను స్వంత సోదరులను, పతివ్రతయైన భార్యను, ఆచార్యవరులను, గురువులను, అపరాధులైనను సరే వధించరాదనే వేదములు శాసిస్తున్నాయి. దానిని వేదవేత్తలు మహర్షులు ఉత్తమ వ్రతంగా పాలిస్తూ ఉన్నారు. అతిపాపులు సైతం ఆనీతిని పాటించి స్వర్గార్హులౌతున్నారు. ఈ శ్రేష్ఠ ధర్మాన్ని తెలిసికూడా, ఓ మహానుభావులారా! నేను నా మేనమామకొడుకును, మాతులేయ భ్రాతను సంహరింపలేను, ఆ దైత్యు డా గుహనుండి బయటకు వచ్చినవెంటనే వధిస్తానని చెప్పాడు. నారదా! కుమారుడు చెప్పినది విని, ఆలోచించి దేవేంద్రు అతనితో యిలా అన్నాడు. కుమారా! నీవు నాకన్న తెలిసినవాడవు కావు. ఎందుకిలా వాదిస్తావు? భగవంతుడు శ్రీహరి స్వయంగా చెప్పిన ధర్మసూక్తివిను. ఒకనికోసం అనేకులను చంప కూడదు. అట్లే ఎక్కువ మందిని రక్షించుటకు ఒక్కని చంపడం పాపం కానేరదు.

ఆ ధర్మం వినియే నేను పూర్వం, ఓ అగ్నిపుత్రా! యుద్ధంలో నా సోదరుడు తమ్ముడూనైన నముచిదైత్యుని సంహరించాను. కాబట్టి ఎందరో దేవతల రక్షణకోసం క్రౌంచంతో బాటుగ మహిషుణ్ణి వధించుము. అగ్నిదత్తమైన శక్తిని తీసికొని పరాక్రమించుము. “ఇంద్రుని మాటలువిని కనులెర్రజేసి కదలిపోతూ స్కందుడు “ఓవృత్రహంతా! నీవు మహామూర్ఖుడవు! నన్నిలా ఆక్షేపణ చేస్తున్నావు. నీవెంత నీబలమెంత? నిజంగా నీకు బుద్ధిలేదు” అన్నాడు. అందుకు ఇంద్రుడు ఓ గుహా! నీకంటే నేనే బలశాలిని అన్నాడు. అయితే రమ్ము! ఎవరు బలవంతులో యుద్ధంలో తేల్చుకుందామని అంటున్న కుమారునితో ఇంద్రుడు అందుకు ద్వంద్వయుద్ధం అవసరం లేదు. ఈ క్రౌంచపర్వతాన్ని ఎవరు ముందుగా చుట్టివస్తారో వారే బలవంతులని చెప్పగా స్కందుడు వెంటనే నెమలిమీదనుంచి క్రిందకుదిగి పాదచారియై త్వరత్వరగా అగిరి ప్రదక్షిణం చేసి వచ్చాడు. ఇంద్రుడుమాత్రం ఐరావతాన్ని దిగి ప్రదక్షిణం చేసి, గుహుడు వచ్చుసరికి నిలబడి యున్నాడు. ఓయి మూర్ఖా! ఇలా నిలబడినావేమని తన్నడిగిన గుహునితో ఇంద్రుడు నా ప్రదక్షిణం నీకన్నా ముందే పూర్తయిందన్నాడు. గుహుడు కాదు, నీకన్నా ముందు నేను చేశానన్నాడు. అలా నేను ముందు చేశానంటే నేను ముందుచేశానని తగవులాడుకుంటూ వారిద్దరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తీర్పు చెప్పమన్నారు. అప్పుడు విష్ణువు, ఎవరో చెప్పుట ఎందులకు? క్రౌంచగిరినే అడగండి అతడే చెప్పుతాడనగా, గుహుడు క్రౌంచుని ముందుగా ఎవరు ప్రదక్షిణించారో చెప్పమని కోరాడు. అంతట క్రౌంచుడు, మహామతియైన నగభేది (ఇంద్రుడే)యే ముందుగా నాకు ప్రదక్షిణం చేశాడన్నాడు. దాంతో అగ్నిపుత్రుడి కళ్లెర్ర బడ్డాయి! పెదవులు అదిరాయి! కోపంపట్టలేక ఆ కుటిలా తనయుడు భయంకరమైన తనశక్తితో ఆక్రౌంచుని లోపలఉన్న మహిషునీ చీల్చి సంహరించాడు.

            ఓ నారదా! అలా తన కుమారుడు క్రౌంచుడు చచ్చుట చూచి, నగాధిరాజు కుమారుడైన సునాభుడు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అటు మహిషాసురుడు వధింపబడటంతో బ్రహ్మేంద్రరుద్ర మరుదశ్వినీవస్వాది దేవతలు ఆనందంతో కేరింతలు కొడుతూ స్వర్గానికి వెళ్ళి పోయారు. అలా వచ్చిన తన మేనమామను చూచి కార్తికేయుడు తన శక్తిని పెరికి సునాభుని కూడ వధించుటకు సిద్ధమయ్యాడు, అంతట శ్రీహరి వెంటనే అతనిని ఆలింగనం చేసుకొని సునాభుడు నీకు పూజ్యుడు బాబూ అంటూ వారించాడు. హిమవంతుడు కూడ వచ్చి పుత్రుడు సునాభుని చేయిపట్టుకొని వేరొక చోటికి తీసికెళ్ళాడు. అంతట గరుడారూఢుడైన హరి వెంటనే మయూరంతో సహా కార్తికేయుణ్ణి తనవెంట స్వర్గానికి గొనిపోయాడు. అక్కడ స్కంధుడు శ్రీహరిని చూచి శోకంతో, అజ్ఞానంవల్ల మూర్ఖుడనై నామాతులేయ సోదరుణ్ణే వధించాను. ఆ పాపానికి పరిహారంగా శరీరత్యాగం చేసుకుంటాననగా ఆవిష్ణువు, అంతకన్న ఘోరమైన పాపాలు కూడ పోగొట్టేది పృథూదకము అనే మహాతీర్థం ఉంది. అందులో స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు పోయి సూర్య ప్రభతో వెలిగిపోతావు. కాబట్టి అక్కడకు వెళ్ళుమని ఆదేశించాడు. శ్రీహరి మాట ప్రకారం కుమారుడు పృథూదక క్షేత్రానికి వెళ్ళి స్నానంచేసి భక్తితో శంకర దర్శనం గావించి విధ్యుక్తంగా దేవతల నందరను అర్చించాడు. తర్వాత శివుడు నివసించే శైలానికి వెళ్ళాడు. యుద్ధభూమి నుండి వెళ్ళిన సుచక్రాక్షుడా పర్వతం మీదనే వాయు భక్షణం చేస్తూ వృషభధ్వజుని గూర్చి కఠోర తపస్సు చేయగా శివుడనుగ్రహించి వరం కోరుకొనుమన్నాడు. అందుల కాతడు “ఓ పరమేశ్వరా! నన్నవమానించిన బాణాసురుని బాహువులను ఖండించగల అద్భుతమైన చక్రాయుధాన్ని అనుగ్రహించుము అని వేడుకున్నాడు. అందుకు హరుడు తథాస్తు! నీవు కోరినట్లే, రోజురోజుకూ వృద్ధిగతమగుచున్న బాణాసురుని బాహు సహస్రాన్ని ఖండించే చక్రాన్ని యిస్తున్నాను తీసుకో. ఈ ఆయుధ శ్రేష్ఠానికి ఎదురుండదు. సందేహంలేద”ని చక్రప్రదానం చేశాడు. అలా శంకరుని వలన వరం పొంది గణాధ్యక్షుడైన సుచక్రాక్షుడు స్కందుని వద్దకు వెళ్ళి నమస్కరించి, సంతోషంతో హరుడు తనకు ఇచ్చిన వరం విషయమంతా చెప్పాడు. ఓ మహర్షీ! ఫాలాక్షుని పుత్రుడు కుమారుడు, దివ్యమైన శక్తి ఆయుధంతో గావించిన మహిషాసుర వధ క్రౌంచ భేదనము, శరణాగతుని రక్షించుటకు ఆ పర్వతం కావించిన ప్రాణత్యాగం వివరంగా నీకు వినిపించాను. పవిత్రమైన ఈ కథ పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పెంపొందింప జేస్తుంది.