హరివిరించి కృత హరస్తోత్రం

"ఓ శూలపాణీ! నీకు నమస్కారం! వృషభధ్వజా, నీకు వందనము! జీమూత వాహనా! కవీ! శర్వా! త్ర్యంబకా! శంకరా! నమస్కారము! మహేశ్వరా, మహేశారా, సువర్ణాక్షా, వృషాకపీ, దక్షాధ్వరనాశకా, కాలరూపా, నీకు నమస్సులు! ఈ జగత్తుకు మొదలు, మధ్య, తుది నీవే! పరమేశ్వరా! భగవన్! నీవు సర్వజ్ఞుడవు! నీకు వందనములు!” అని స్తోత్రం చేయమొదలిడిరి.

అ స్తోత్రమునకు సంతసించి ఆ దారుకావనంలో వాక్యవిశారదుడగు ఈశ్వరుడు హరి బ్రహ్మలకు ప్రత్యక్షమై, “ఓ దేవాధిపులారా! కామ సంతప్తుడనై విధి క్రమాలు విసర్జించి, చిత్తశాంతి లేకుండా ఉన్న నన్నెందుకు స్తోత్రము చేయుచున్నారనెను. అందులకా హరి బ్రహ్మ లిట్లనిరి. మహాదేవా! ఇచట భూపతితమైన భవదీయ లింగాన్ని తిరిగి పరిగ్రహించండి. ఇదే మా ప్రార్థనము. అని ప్రార్ధించగా పరమేశ్వరుడు “ఓ దేవోత్తములారా! దేవ తలందరు నాలింగమును పూజించుచో నేను దీనిని తీసికొందును. లేనిచో తీసికొనను అని చెప్పగా, అందులకు కేశవుడంగీకరించగా, బ్రహ్మ స్వయంగా నా బంగారు వికారము గల లింగమును తీసికొనెదను. అనంతరం భగవానుడు నాలుగు వర్ణముల వారిని హరార్చన పరుల నొనర్చెను. అందులకు వలసిన ముఖ్యశాస్త్రముల ప్రవర్తింపజేసెను. వానిలో మొదటిది శైవము, రెండవది పాశుపతము, మూడవది కాలవదనము, నాల్గవది కాపాలికము. వశిష్ఠుని ప్రియపుత్రుడు శక్తి శైవుడు. ఆయన శిష్యుడు గోపాయనుడని తెలియుచున్నది. ఇక భరద్వాజుడు మహాపాశుపతుడు. ఆ తపస్వి శిష్యుడు ఋషభ సోమకేశ్వరుడను నరపతి. తపోధనుడగు ఆపస్తంబుడు కాలాముఖ భక్తుడు. ఆయన శిష్యుడు క్రాథేశ్వరుడను వైశ్యుడు. కుబేరుడు, మహావ్రత దీక్షితుడు. కాగా ఆతని శిష్యుడు మహాతపస్వియగు కర్ణోదరుడను శూద్రుడు. ఈ విధంగా బ్రహ్మ చతుర్వర్ణముల వారిని శిపూజకై నియోగించి తనలోకమునకు తిరిగి పోయెను. బ్రహ్మ వెళ్ళిన తర్వాత శివుడు లింగము నుపసంహరించుకొని సూక్ష్మరూపమున దానిని చిత్ర వనమున ప్రతిష్ఠించి వెడలిపోయెను.