వామన మహా పురాణము
పార్వతీ కళ్యాణానికి శివుడు తరలి వెళ్ళుట
పులస్త్య మహర్షి చెప్పమొదలుపెట్టాడు. అక్కడ జేరిన దేవతలను చూచి నంది ఏదో అనగా మహేశ్వరుడు లేచి భక్తితో శ్రీహరిని కౌగిలించుకున్నాడు. అంతట బ్రహ్మకు నమస్కరించి ఇంద్రుని సంభావించి యితర దేవతలనందరను యథోచితంగా పలకరించాడు. వీరభద్ర పురోగాములై శివగణాలు పాశుపతగణాలు జయజయ ధ్వానాలు చేస్తూ మందరగిరి చేరారు. అక్కడ నుండి దేవగణాలతో కూడి మహేశ్వరుడు వైవాహిక విధి నిర్వహణకై కైలాస శిఖరాలకు వెళ్లాడు. ఆ కొండ మీద దేవమాత ఆదితి, సురభి, సురస మొదలగు ముత్తైదువలు అలంకరణ కార్యంలో నిమగ్నులయ్యారు. ముఖాన గోరోచన తిలకం, మహాస్థి మకుటం, సింహచర్మం, తుమ్మెదల్లాంటి నల్లటి సర్పకుండలాలు, నాగమణులు కూర్చిన కంకణ, హారకేయూర నూపురాలు, ఎత్తైన జటాభారం ధరించి వృషభారూఢుడై హరుడు అపూర్వమైన శోభతో కనులకు విందు గావించాడు. ఆయనకు ముందు భాగాన శివగణాలందరూ తమతమ వాహనాల మీద వెళ్లగా వెనుక భాగాన అగ్నిని ముందుంచుకొని దేవతలు నడిచారు. నారాయణుడు లక్ష్మీదేవితో గరుత్మంతుని మీద బయలుదేరాడు. బ్రహ్మ హంసనెక్కి శివుని ప్రక్కగా సాగాడు. శ్వేత వస్త్ర ఛత్రాలు ధరించి ఐరావతంమీద ఇంద్రుడు కలిసి నడిచాడు. సరిచ్ఛిరోమణి యమున శ్వేతచామరం పట్టుకొని తాబేలుమీద బయలుదేరింది. అలాగే సరస్వతి, హంసకుందేందు ధవళమైన చామరంతో గజాన్ని ఆరోహించి పయనమైంది. ఆరు ఋతువులు పంచవన్నెల పరిమళ భరిత కుసుమాలతో హరుని అనుగమించాయి. ఐరావతం వంటి మదపుటేనుగనెక్కి అనుపలేపనం (అలంకరణ) ద్రవ్యాలు తీసికొని పృథూదక తీర్థం బయలుదేరింది. తుంబురు గంధర్వులు కలకంఠాలతో గానం చేస్తున్నారు. కిన్నరులు బాజాలు వాయిస్తున్నారు.
అప్సరసలాడుతుంటే మునులు స్తోత్రాలు చేస్తున్నారు. గంధర్వ గణమంతా శూలపాణి ఫాలాక్షుణ్ణి వెంబడించారు. పదకొండు కోట్ల రుద్రులు, పన్నెండుకోట్ల ఆదిత్యులు, ఎనిమిది కోట్ల వసువులు, అరవై ఏడు కోట్ల గణాలు, ఇరువది నలుగురు ఊర్ధ్వరేతస్కులయిన పరమర్షులు, ఓ నారదా, ఆపరమశివుని వెంట నడిచారు. వీరలుగాక ఆ వివాహయాత్రలో లెక్కకు మిక్కుటమైన యక్ష, కిన్నర, రాక్షసయూథాలు మహాకోలాహలంగా పాల్గొన్నారు. క్షణకాలంలో శివుడు తన వారలతో ఆ పర్వతాధిపతి నగర సమీపానికి చేరాడు. ఆ పెండ్లివారలకు ఎదుర్కోలు చెప్పుటకై పర్వతవీరులు నలువైపుల నుండి ఏనుగులమీద వచ్చినిలచారు. వరుడు కన్యాదాతకు నమస్కరించగా తక్కిన గిరులన్నీ శివునకు సాగిలబడి లేచి నిలచాయి. అందులకు శర్వుడెంతో ఆనందించాడు. అలా తన పార్షదులతో దేవతలతో మహావైభవంగా, నందీశ్వరుడు దారి చూపగానే శైలరాజు పట్టణంలో ప్రవేశించాడు. పెండ్లివారలతో హరుడు నగరంలో ప్రవేశించాడని తెలియగానే పురస్త్రీలంతా తాము చేస్తున్న పనులు ఎక్కడివక్కడ వదలిపెట్టి ఉత్కంఠతో పెండ్లి కొడుకును చూచేందుకు బయలుదేరారు. ఒకసుందరి సగం కూర్చిన పూలమాల ఒక చేత్తో పట్టుకొని రెండవ చేతితో ముడివేసుకుంటున్న కేశపాశాన్ని పట్టుకొని శివుని చూచేందుకు ఎదురుగా వచ్చింది. మరొకవనిత ఒక పాదానికి పారాణి పెట్టుకొని రెండవ పాదానికి పెట్టుకోకుండానే వెళ్ళి చూచింది. మరొక తొందరకత్తె పావడా, మొలనూలు చేతులో పట్టుకొని అవి ధరించకుండానే మొండిమొలతో పరుగెత్తింది. ఉరోజాల బరువుతో త్వరగా నడవలేక బయలుదేరిన ఒకజవ్వని, పెండ్లికొడుకు తనగుమ్మందాటి వెళ్ళాడని తెలియడంతో తన యౌవన భారాన్ని నిందించుకుంది. ఈ విధంగా ఆ నగర రమణీ లోకంలో సంక్షోభాన్ని రేకెత్తిస్తూ ఆ వృషభవాహనుడు మామగారి దివ్యభవనానికి చేరాడు.