జంబూద్వీపం

సుకేశి వచనం: మహర్షులారా! పుష్కర ద్వీపములోని ఘోర పరిస్థితులు మీరు వర్ణించారు. ఇక జంబూ ద్వీప స్థితిగతులు చెప్పండి అని అడుగగా ఋషులన్నారు-రాక్షసపతీ! ఇక నవ విభాగాత్మకమై సువిశాలమై స్వర్గ మోక్షాలను ప్రదానం చేయగల జంబూద్వీప వృత్తాంతం వినుము. ఆది మధ్యలో ఇలా వృతవర్షం, తూర్పున అద్భుతమైన భద్రాశ్వ వర్షం ఈశాన్యాన హిరణ్య వర్షం, ఆగ్నేయాన కింనర వర్షం, దక్షిణాన భారతవర్షం, నైరుతి భాగాన హరివర్షం, పశ్చిమాన కేతుమాల వర్షం, వాయవ్యాన రమ్యక వర్షం, ఉత్తరాన కురువర్షంగా తొమ్మిది వర్షాలలో విభక్తమైనది. ఈ తొమ్మిది భూభాగాలు పవిత్ర మైనవి, రమణీయమైనవీను. వీనిలో కురువర్షం కల్పవృక్షాలతో నిండి ఉంటుంది. భారతవర్షం మినహాయిస్తే ఇలావృతాదులు ఎనిమిది వర్షాల్లో యుగ విభజనం గాని, జరామరణ భయంగాని ఉండవు. అక్కడి వారలకు అప్రయత్నంగానే సుఖంగా సిద్ధి లభిస్తుంది. అది సహజ సిద్ధం. వారిలో ఉత్తమాధమత్వాది వివక్షగాని ఎలాంటి విపర్యయాలుగాని ఉండవు. ఇక భారత వర్షమో తొమ్మిదవది. ఇవన్నీ సముద్రాలచే వేరుచేయబడి పరస్పరం అగమ్యాలుగా ఉన్నాయి.