వామన మహా పురాణము
వామనపురాణం ఎటువంటి పురాణం
వామనపురాణం దాని పేరు సూచిస్తున్నట్లే వైష్ణవులకు సంబంధించినది. దాని ఆరంభం, సమాప్తం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ పురాణం ‘నారాయణం నమస్కృత్య’ అనే ప్రసిద్ధ శ్లోకంతో మొదలవుతుంది. ఈ శ్లోకం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు లభించిన లిఖిత ప్రతులన్నింటిలోనూ కనిపిస్తుంది. భూలర్ అనే లిపి శాస్త్రవేత్త ప్రాచీన భాగవత శాఖకు చెందిన రచనలకు ఇది విలక్షణ చిహ్నమని, వాటి అన్నింటిలోను కనిపిస్తుందని తెలిపాడు. మంగళాచరణ శ్లోకంలో కూడా శ్రీధరునికి విష్ణువుకు నమస్కారం చేయటం ఇందులో కనిపిస్తుంది. తరువాతి రెండు శ్లోకాలు పులస్త్య నారద సంభాషణలకు సంబంధించినవి. వాటిలో నారదుడు
స్వపురుష మభిరీక్ష్య పాశహస్తం
వదతి యమః కిలతస్య కర్గమూలే
పరిహర మధుసూదన ప్రపన్నాన్
ప్రభారహమన్యనృణాం నవైష్ణవానామ్
(వామన, 6.7.30, విష్ణు-3.7.14)
అని విష్ణువైష్ణవ శబ్దాలు ఉపయోగించి మాట్లాడాడు. చివరి అయిదు అధ్యాయాలు వామనచరిత్ర ముగింపు భాగం. విష్ణుభక్తి, విష్ణుభక్తుల ప్రశంస ఇందులో కనిపిస్తుంది. ఈ సందర్భంలోని శ్లోకం విష్ణుపురాణంలో కూడా కనిపిస్తుంది. ఈ పురాణంలోని చివరి అధ్యాయం విష్ణు పూజావిధానాలను వర్ణించి విష్ణు దేవాలయలను కట్టించేవారిని ప్రశంసిస్తుది. విష్ణ్వాలయాలను కట్టించినవాడు తననేకాక తనతోపాటుగా ఎనిమిది తరాలను ఉద్ధరిస్తాడట.
వామన పురాణంలో అనేక వైష్ణవ విషయాలున్నాయి. ఇందులోని శివ స్తోత్రాల కంటే విష్ణుస్తోత్రాలు ఎక్కువ. పదకొండు శివస్తోత్రాలు, పదిహేను విష్ణు స్తోత్రాలు ఇందులో కనిపిస్తాయి. ఈ పదకొండు శివస్తోత్రాలలో అయిదు సరోమాహాత్మ్యంలోనివి. అసలు సరోమాహాత్మ్యం వామనపురాణంలోనిదేనా ? అని కొందరు సందేహం వెలిబుచ్చుతున్నారు. కురుక్షేత్ర స్థాణుతీరంలో చుట్టూగల శివలింగాల మాహాత్మ్యం వంటి శైవవిషయాలు, వేనుడు చేసిన సుదీర్ఘ శివస్తుతి-ఇవి అన్ని ప్రతులలోనూ ముఖ్యంగా దాక్షిణాత్య, బెంగాల్ ప్రతులలో లేవు. ఇది ప్రక్షిప్తాలు కావచ్చు. ఈవేనకృత శివస్తుతి (26.63 -164) మహా భారతశాంతి పర్వం (284.74 -186)లోని దక్షకృత శివస్తుతిని పోలి ఉంది.
ఇంతేకాక మత్స్య (53.45), నారద (1.105, 20-22), స్కంద (7-2-70) పురాణాలు వామనపురాణం ప్రతినివ్రాసి బ్రాహ్మణుకి శరద్విషువంలో దానం చేసినవాడు విష్ణుపరమపదానికి వెళ్తాడని తెలుపుతున్నది. కనుక వామన పురాణం విష్ణు సంబంధమైన పురాణం.