సూతికాదుల లక్షణాలు

ఋషులు అతనితో, బ్రాహ్మణుని భ్రష్టుని గావించిన బ్రాహ్మణ స్త్రీ, ఇద్దరూ సూతికులనబడతారు. వారల చేతితిండి తినరాదు. సకాలంలో స్నానజప సంధ్యావంద నాదులు, హోమాది కర్మలు, దేవపితృ కార్యాలు దాన ధర్మాదులు చేయనివాడు షండుడు. డాంబికంగా జపం, తపం, యజ్ఞాదులు చేస్తూ పరలోక చింతన లేనివారు మార్జారులు. సంపద కలిగి ఉండి కూడా దానహోమాదులు చేయకుండా తామే అనుభవించేవారు మూషికులు. వారల అన్నం తినరాదు. కృచ్ఛ్రాదులు చేస్తేనే ఆ పాపం పోతుంది. ఎల్లపుడూ పరులను సూటిపోటు మాటలతో వేధిస్తూ పరులలోని సద్గుణాలను ద్వేషించేవానిని శునకుండంటారు. సభలోనున్న సభ్యులపట్ల పక్షపాత బుద్ధితో బాహాటంగా వ్యవహరించేవాడు కుక్కుటుడు. అటువంటి వాడొసగిన అన్నం తినరాదు. ఎలాంటి ఆపద కలగనప్పటికీ స్వధర్మాన్ని వదలి పరధర్మాన్ని ఆశ్రయించేవాడు పతితుడు. వానిచేతి అన్నం తినగూడదు. దేవపితృకార్యాలు వదలి గురువులపట్ల భక్తిలేక, గోవులను బ్రాహ్మణులను స్త్రీలను వధించు దుష్టుడు అపవిద్ధుడు. ఎవడి ఇంట్లో ఎప్పుడూ కూడ ఎలాంటి వ్రతాలుగాని వేదాధ్యయన శాస్త్ర చర్చలు గాని జరగవో వాడు నగ్నుడు (దిగంబరుడు). వాడొసగు భోజనం గర్హించదగినది. ఇతరులకు ఆశ గొలిపి దానిని పూర్తిచేయనివాడు, దానం చేసేవాడిని అడ్డగించేవాడు. తన్నాశ్రయించు వానిని నట్టేట ముంచువాడు చండాలుడు, అధముడు, బంధు పరిత్యక్తుడు, సాధువులు బ్రాహ్మణులచే విడువ బడినవాడు, దుశ్శీలునిచే తిండితినే వాడి ఇంట భుజించినచో చాంద్రాయణం చేస్తేనే శుద్ధి. నిత్యనైమిత్తిక కర్మలు వదలిన వానింట భుజిస్తే మూడు రాత్రులు ఉపవాసం చేయాలి. గణకుడు (జ్యోతిషి), వ్యాధుడు, వేశ్య, వైద్యుడు, లోభి. వీరలొసగిన అన్నం భుజిస్తే ప్రాయశ్చిత్తంగా మూడు రాత్రులు ఉపవసించాలి. జాతాశౌచ, మృతాశౌచములు కలిగినప్పుడు నిత్య విధులు మానుకోవచ్చు, కాని ఎట్టి పరిస్థితులలోను నైమిత్తిక కర్మలు వదులుకోరాదు.

పుత్రజన్మ కలుగగానే సచేల స్నానం తండ్రి చేయాలి. కుటుంబంలోని వారెవరైనను మరణించినచో బంధువు లందరు స్నానం చేయాలని భృగువచనం. మరణించిన వానిని ఇంటి బయట దూరంగా దహనం చేయాలి. సగోత్రీయులు జలతర్పణం వదలాలి. మొదటినాడుగాని నాలుగవ లేక ఏడవ దినాన అస్థి సంచయనం చేయాలి. అస్థి సంచయనా నంతరం సోదరులందరు తమ అంగస్పర్శ చేసుకోవలె. సపిండీకులు శుద్ధి అనంతరం శ్రాద్ధకర్మ చేయాలి. విషప్రయోగం వల్ల, ఉరి, శస్త్రాలద్వారా, అగ్నివల్ల, నీళ్ళలో మునిగి నందున, పైనుండి క్రిందపడినందున మృతి కలిగినప్పుడు, బాలురు సన్యాసులు మరణించి నప్పుడు దేశాంతరగతుడు చనిపోయినను ఈ పరిస్థితులలో నాలుగు రకాలయిన సద్యః శుద్ధి (వెంటనే శుద్ధి) చెప్పబడింది. గర్భస్రావం జరిగినప్పుడు కూడా ఇంతే. ఇతరులకు మాత్రం శౌచకాల పరిసమాప్తినందే శుద్ధి-బ్రాహ్మణులు కొకరోజు, క్షత్రియులకు మూడురోజులు, వైశ్యులకు అరురోజులు, శూద్రులకు పండ్రెండు రోజులు అశుచి. ఈ అన్ని జాతుల వారును వారివారి ఆచారాల ననుసరించి వరుసగా పది, పండ్రెండు పదిహేను రోజులకు శ్రాద్ధములు చేసుకోవాలి. విధి విధానంగా చనిపోయిన వారికి ఏకోద్దిష్ట కర్మ జరపాలి. సంవత్సరాంతంలో సపిండీ కరణం చేయాలి. ప్రేతత్వ విముక్తి కలిగిన పితృత్వం కలిగి తర్వాత వేదవిహితంగా ధర్మపూర్ణ కర్మలు నిర్వర్తించి వారికి తర్పణం చేయాలి. ఓ రాక్షసేశ్వరా! పితరులకు ఉత్తరోత్తర సద్గతులు గలుగుటకు భూగో హిరణ్య దానాదులు చేయాలి.

పితరులకు వారి జీవిత కాలంలో ఏయేవస్తువులు ఇష్టతమాలో ఆయావస్తువును దానం చేసినచో వారలకు అక్షయ లోకములు గలుగును. విద్వాంసుడు ప్రతిదినం వేదాధ్యయనం చేయవలెను, ధర్మం తప్పకుండా ధనార్జనం చేసి తన శక్త్యానుసారం యజ్ఞాదులు చేయాలి. తన అంతరాత్మకు జుగుప్సావహములు కాని పనులు, పెద్దలయెడ దాచనవసరం లేని పనులు గృహస్థుడైనవాడు సంకోచం లేకుండా ఆచరించాలి. భార్యా బిడ్డలతో కూడి ఉండియూ, ఈ విధంగా సదాచరణం చేయు మానవుడు ధర్మార్థ కామములు సమకూర్చుకొని ఈ లోకంలోను అనంతరం పరలోకంలోను, సుఖాలు పొందుతాడు. ఇంతవరకు ఉత్తమ గృహస్థధర్మాలు చెప్పితిమి. ఇక వానప్రస్థుని విధులు వివరించుచున్నాను జాగ్రత్తగా వినుము.