వామన మహా పురాణము
శివుడు వివరించిన హరిహరాద్వైతతత్త్వం
నందీశ్వరుని మాటలు విని ఆ భూతభావనుడైన హరుడు భావాభావ విచక్షుణులైన ఆ సర్వగణాలతో యిలా అన్నాడు. “మీరందరూ భక్తిభావంతో హరుని పూజించినా అహంకార విమూఢులై విష్ణు పదకమలాలను నిందిస్తారు. మీలోని ఆ అజ్ఞానంవల్ల మిమ్ములను నిరాకరించడం సంభవించింది. నేనా భగవంతుడగు విష్ణువునే! ఆ విష్ణువే అవ్యయుడనైన నా స్వరూపం. మాకు భేదంలేదు. ఒకే తత్వం రెండు రూపాల్లో ఉన్నాము. ఈ రహస్యాన్ని ఈ పురుష శార్దూలాలు గుర్తించినట్లుగా మీ ఇతర గణాల వారందరూ తెలిసికొనలేకపోయారు. శివభక్తులుగా చలామణి అయ్యే మీలాంటి మూర్ఖుల కారణంగా నేను నిందలకు గురిఅవుతున్నాను. ఆ భేదబుద్ధివల్ల మీలోని జ్ఞానం నశించినందున నేను మిమ్ములను ఆలింగనం చేసుకోలేదు.” ఇలా మహేశ్వరుడు అనగా ఆ గణాధిపతులు మరల ఇలా అడిగారు. “ప్రభూ! మీరూ జనార్దనుడూ ఒక్కరే ఎలా కాగలరు? మీరో శుద్ధ, శాంత, నిర్మల, శుక్ల, నిరంజన స్వరూపులు కాగా ఆ విష్ణువు కాలాంజన (కాటుక) సన్నిభుడు! ఆయన మీతో కలియడం ఎలా సంభవం? అర్థయుక్తాలైన వారల మాటలనువిని ఆజీమూతవాహనుడు (హరుడు) మేఘగంభీర స్వరంతో నవ్వి ఇలా చెప్పసాగాడు. అయితే అందరూ వినండి. నాకీర్తి ప్రతిష్ఠలను యినుమడింపజేసే విషయాలుచెబుతాను. మీరు ఉన్నత జ్ఞానానికి అర్హులుగారు. అపవాదానికి వెరచిమీకు ఆరహస్యాన్ని వెల్లడిస్తున్నా మీ చిత్రాలన్నీ నాయందే లగ్నమైయున్నవి. ప్రయత్నించి మీ శరీరాలను ఏకరూపంగా చేసుకొని వినండి.
“మీరు నాకు గావించే క్షీర హవిస్సుల అభిషేకాలుగానీ ఏకాగ్ర చిత్తంతో చేసే చందనలేపాది అర్చనలుగాని నాకు సంతోషం కలిగించవు. మీరొక రంపంతో నా దేహాన్ని రెండుగా చీల్చండి. నరకగాములైన శివభక్తులను రక్షించుకోడాని కిలా చెబుతున్నాను. ఎందుకనగా శివభక్తులంతా నరకానికి అర్హులు అనే అపనింద ఈ లోకం నాకు అంటగడుతుంది. తపస్సంపన్నులగు హరభక్తులు గూడ నరకానికి పోతారనే అపవాదుకు పాత్రులయ్యేవారు ఘోర నరకాల్లో పడకుండా చేసేందుకే నేను ఇలాచేస్తున్నాను. శివమయుడూ కమలపత్రాక్షుడైన ఏ జగన్నాథు (విష్ణువు) నైతే మీరలు నిందిస్తున్నారో, ఆయన నేనే-మరెవరోకాదు. ఆయన సర్వవ్యాపియైన శర్వుడే. సర్వగణాధిపుడే ఆయన శ్వేతపీత రక్తవర్ణాలు గలవాడు. అలాంటి ప్రభువు చరాచర జగత్తులో మరొకడు లేడు. ఆయనను మించిన ధర్మం లోకంలోలేదు. ఆ సర్వ పూజ్యుడు భగవంతుడు నగు సదాశివుడే సాత్విక, రాజసిక, తామసిక, మిశ్రగుణాశ్రయుడు సుమా!” శంకరుడు చెప్పిన ఆ అద్భుత వచనాలు విని శైవాదులైన ప్రమథోత్తములు విస్మయంతో ప్రభో ఆ సదా శివుని మహిమా విశేషాలెట్టివో అనుగ్రహించుడని ప్రార్థించగా నా ప్రమథులకాహరుడు సదానిరంజనమైన ఆ శైవ రూపాన్ని చూపించాడు. అంతట నా గణాలు ఆ ఈశ్వరుని సహస్ర రూపాల్లో. సహస్ర ముఖాలు కరచరణాలతో దండపాణియై సర్వవ్యాపియైన విశ్వమూర్తిగా అవలోకించారు. ఆ తేజస్సును చక్కగా చూడలేకపోయారు. ఆ ప్రభువు చేతిలోని దండా న్నాశ్రయించుకొని సర్వదేవతల ఆయుధాలూ కనిపించాయి. మరుక్షణాన ఆ గణాలకు ఆప్రభువు శంకరుడు, ఏక ముఖంతో శరీరం నిండా వేలాది శైవ వైష్ణవ చిహ్నాలతో దర్శనమిచ్చాడు. ఆ హరుని విగ్రహంలో సగభాగం విష్ణువు సగభాగం శివుడు. గరుడధ్వజం ధరించి వృషభం మీద కూర్చొని ఒకపరీ, వృషభధ్వజం పట్టుకొని ఖగవాహనుడై మరొకపరి కనిపించాడు. సర్వ గణాగ్రేసరుడైన ఆ త్రినేత్రుడలా అనంతరూపాలు దర్శిస్తుండగా మహాపాశుపత గణాల వారు అసంఖ్యాకంగా వస్తూ ఉన్నారు. అంతట నా బహురూపి ఏకరూపి అయ్యాడు. ద్విరూప ధరుడయ్యాడు, రూపరహితుడై కూడ ఆ మహాయోగి ఒక రూపం ధరించాడు. క్షణకాలం తెల్లగా ఉంటే మరుక్షణంలోనే ఎరుపుగా, పచ్చగా, నల్లగా క్షణాల మీద మార్పుచెందాడు. మరుక్షణాన ఆ రుద్రేంద్రుడు మిశ్రవర్ణంలో కనిపిస్తే అ మరుక్షణాల్లో వర్ణరహితుడయ్యాడు. మహాపాశుపతు డయ్యాడు, ఇంద్రుడయ్యాడు, ప్రభాకరుడయ్యాడు, అనంతరం క్షణార్ధంలో విష్ణువుగా మారాడు, పితామహాబ్రహ్మరూపం ధరించాడు. ఆ అద్భుతానికి వెరగుపడి చూచే ఆ శైవ గణాలకు బ్రహ్మ విష్ణు శివ భాస్కరుల ఏకరూపత బాగా అవగతమైనది. సదాశివుని దేవదేవుడుగా గుర్తించినంతనే ఆ పార్షదులందరూ పాపరహితులయ్యారు. అలా ధూతపాపులైన తన గణాలను చూచి ఆనందించి హరిహరుడైన ఆ శివుడు-శివకేశవాభిన్న దృష్టి పొందిన మీరందరు ధన్యులు. మీవ్రతాలు ఫలించాయి. నాకానందం కలిగింది. మీరు కావలసిన వరం కోరుకొనుడనగా వారిలో దేవా, ఇంతవరకు భిన్న దృష్టితో వ్యవహరించి మేము మూట గట్టుకొన్న పాపాలు నశించునట్లను గ్రహించండని వేడుకున్నారు. ఓ నారదా! అంతట శంభుడు మంచిదని వారందరకు పాపనాశం కలిగించాడు. వారలను గూడ కౌగలించుకొని ఆనంద పరచాడు. ప్రణతార్తి హరుడు వృషభ మేఘవాహనుడునగు ప్రభువు చెప్పిన మాటలువిని ఆ గణాధిపతులందరు వేదోక్తమైన క్రమంలో ఆ మందరగిరిని ఆక్రమించి నిలచారు. అలా శివుని పాదాలను నలువైపులా పరివేష్టించి నీలమేఘకాంతితో నిలబడిన అసంఖ్య గణాలతో శ్వేతమహాపర్వతం సుందరం నల్లని చర్మంతో కప్పబడి శరత్కాల మేఘంలాగా వెలిగే హరుని వృషభరాజం లాగా విరాజిల్లింది.