వామన మహా పురాణము
పూర్వమన్వంతరాలలోని మరుద్గణాలు
నారదుడు ప్రశ్నించాడు, మహర్షీ! దితిపుత్రులు మరుత్తులైనారని నీవు చెప్పి ఉన్నావు గదా. అయితే వారలు వాయుమార్గాన చరించుటకు కారణమేమి? వారలకు పూర్వపు మన్వంతరాలలో మరుత్తులుగా నున్న వారెవరు? ఈ వివరం నాకు తెలియ జేయుము. అందులకు పులస్త్యుడిలా చెప్పసాగెను. నారదా! స్వాయంభువ మనువు నుండి వర్తమాన కాలపు మనువు వరకు గల మన్వంతరాలలో మరుత్తులెవరెవ రుండిరో వివరంగా చెబుతున్నా వినుము. స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడను మనువు. అతని పుత్రుడు త్రిలోక పూజితుడు సవనుడు. ఆ సవనుడు అపుత్రకుడుగా మరణించగా నాతని భార్య సుదేవ శోకంతో బాధపడుతూ భర్త శరీరాన్ని దహనం చేయనివ్వకుండా ఆలింగనం చేసుకుని కూర్చున్నది నాధా! నాధా అంటూ ఆ పతి పరాయణ విలపిస్తూండగా అంతరిక్షాన్నుంచి ఒక అశరీర వాణి వినిపించి “ ఓ కల్యాణీ! ఏడువకుము. నీ పతి భక్తి నిజమైనదైనచో నీ భర్తతో పాటు అగ్నిలో పడిపొమ్ము” అని అదే శించింది. ఆ అశరీరవాణి వైపునకు తిరిగి ఆ రాజపుత్రి సుదేవ, నేను నా కోసం విలపించడం లేదు. నా భర్త పుత్రహీనుడై నందులకే శోకిస్తున్నా నన్నది. అందులకా నభోవాణి, ఓ విశాలాక్షీ! ఏడువకుము. వెంటనే చితి నెక్కుము. నీకు నీ భర్తవలన ఏడుగురు పుత్రులు కలుగుతారు. ఇది సత్యం. నా మాట మీద నమ్మక ముంచి వెంటనే అగ్ని రారోహించుమని మరల బలికినది. అది విన్నంతనే ఆ బాలిక తన భర్త పవిత్ర శరీరాన్ని చితిమీద పెట్టి భర్తనే ధ్యానిస్తూ దాని మీద కూర్చొని తగులబడి పోయింది. అనంతరం ముహూర్త కాలంలో ఆ రాజు భార్యతోకూడ లేచి అకాశాని కెగిరిపోయాడు. అక్కడ కామగమనంతో ఆ సునాభ కుమార్తె అయిన సుదేవతో తిరుగుతుండగా నామె ఋతుమతి (బహిష్టు) అయింది. అంత తన దివ్య శక్తి వల్ల భార్యా సహితుడై ఆ నృపతి అకాశంలోనే అయిదు దినాలుండిపోయాడు. అరవనాడు ఋతుస్నానం చేసిన తర్వాత ఆ ఋతుస్రావం వ్యర్థం కాగూడదని తెలిసికొన్న ఆ రాజు ఆ సుందరితో యధేచ్ఛగా సమాగమం కావించాడు. ఫలితంగా నాతనికి వీర్య స్ఖలనమై ఆ శుక్రం భూమి మీద పడిపోయింది. ఓ తపోధనా! శుక్రం అలా జారి పడి పోగానే ఆ రాజు సపత్నీకుడై దివ్య గమనంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
అలా ఆకాశం నుండి జారిన అకాశ వర్ణపు శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు కోరికతో దర్శించారు. అది ఒక పద్మంలో పడి ఉండగా దానిని అమృతమని భ్రమించారు. ఓ తపోధనా! ఆ ఋషిపత్నులు ఎల్లప్పుడూ జవ్వనులుగా ఉండాలనే కోరికతో అమృతమని భ్రమపడి ఆ రాజ శుక్రాన్ని త్రాగవలెనని నిశ్చయించుకున్నారు. ఆ విషయం వారలు తమ భర్తలతో చెప్పి వారి అనుమతితో యధావిధిగా స్నానాలు చేసి భర్తలను పూజించి కమలంలోని ఆ శుక్రాన్ని ఏడుగురూ త్రాగారు. పార్థివేంద్రుని ఆ శుక్రాన్ని త్రాగినంతనే ఆ తపస్వుల భార్యలు తమ బ్రహ్మతేజాన్ని కోల్పోయారు. ఆ విధంగా దూషిత శీలలైన తమ భార్యలను వారేడుగురు వదలివేశారు. ఆ ముని పత్నులేడుగురు కుమారులను కన్నారు. అఏడుగురు శిశువులు భయంకరంగా రోదించారు. వారి ఏడుపు ధ్వనులతో జగత్తంతా నిండిపోయింది. అంతట అచ్చటకు లోకపితామహుడు బ్రహ్మ వచ్చి రోదించుచున్న ఆ బాలురతో ఓ మహాబలులారా! ఏడువకుడు ఏడవకుడు. మీరు మరుత్తులనే పేరుతో ఆకాశములౌతారు అనిచెప్పి వారలను తనతో గొనిపోయి మరుత్తులుగా ప్రకటించాడు. నారదా! వారలు స్వాయంభువ మన్వంతరాన వెలసిన ఆది మరుత్తులు. ఇక స్వారోచిష మన్వంతరంలోని మరుత్తుల కథ వినుము. స్వారోచిష మనుపుత్రుడు శ్రీమంతుడగు క్రతుధ్వజుడు. అతనికి అగ్ని సమానులైన కుమారు ఏడుగురు కలిగారు. వారలు తపస్సు గావించుటకై మహామేరుగిరికి వెళ్ళారు. ఇంద్రపదవిని కాంక్షించి వారు బ్రహ్మను గూర్చి తపించుట ఎరిగి సహస్రాక్షుడు ఇంద్రుడు భయపడి అప్సరసల్లో శ్రేష్ఠురాలైన పూతనను చూచి ఓ సుందరీ! పూతనా! నీవు వెంటనే మహామేరు శైలానికి వెళ్లుము. అక్కడ క్రతుధ్వజుని కుమారులు కఠోర తపస్సు చేస్తున్నారు. నీకు తోచిన యుక్తులన్నీ ప్రయోగించి వారలకు తపోవిఘ్నం కలిగించి రమ్ము. నీకు సిద్ధి కలుగుగాక! అన్నాడు. ఇంద్రుని ఆదేశాన్ని తలదాల్చి ఆ రూపశాలిని అయిన పూతన త్వరగా నా రాజకుమారులు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళినది. వారల ఆశ్రమానికి దగ్గరగా నొక నది మెల్లగా ప్రవహిస్తోంది.
ఆ ఏడుగురు సోదరులూ స్నానార్థం నదికి వెళ్లగా అదే వేళకు చక్కని అంగ సౌష్టవంతో అలరారే ఆ అప్సర కూడా నీళ్లలో దిగి స్నానం మొదలుపెట్టింది. ఆవిడ స్నాన సౌందర్యాన్ని చూడగానే ఆ రాకుమారులందర మనస్సులు వికారానికి లోనై వారల వీర్యం స్ఖలనమై నీటిలో పడిపోయింది. దానిని ఆ నీటిలో నివసిస్తున్న మహాశంఖుడనే మకరి (మొసలి) భార్య శంఖిని మ్రింగివేసింది. అంతట వారు తపోభ్రష్టులై తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. ఆ పూతన ఇంద్రుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి వెళ్లిపోయింది. తర్వాత బహుదినాలకు ఆశంఖరూపంలో ఉన్న ఆడ మొసలి జాలరి వాండ్ల పెద్ద వలలో చిక్కిపోయింది. వారా విలక్షణమైన మొసలిని బయట పడవేసి ఆ విషయం క్రతుధ్వజుని కుమారులకు నివేదించారు. యోగులైన ఆ మహాత్ములందరూ ఆలోచించుకొని దానిని తమ గృహావరణంలోని బావిలోనికి వదిలారు. తర్వాత క్రమంగా ఆ శంఖిని ఏడుగురు శిశువులను కని వెంటనే దేహత్యాగం కావించింది. తల్లిదండ్రులు లేక స్తన్యపానం కోసం బావిలో బిగ్గరగా రోదిస్తున్న ఆ బాలుర వద్దకు పితామహుడు వచ్చి, పుత్రులారా! ఏడవకండి. మీ రిప్పటినుంచీ మరుత్తులనే పేరుతో వాయుస్కంధాల మీద సంచరిస్తూ దేవతలు అవుతారు అని చెప్పి వారలను తనతో కొనిపోయి వాయు మార్గాన వదలి తన లోకానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా స్వారోచిష మన్వంతరంలో మరుత్తులు వెలిశారు. ఓతపోధనా! ఇక ఉత్తముడు మనువుగా నున్న కాలంలోని మరుత్తుల జన్మ విధానం చెబుతున్నా వినుము. ఉత్తమ మన్వంతరంలో నిషధ దేశాధిపతి వపుష్మానుడను వాడు సూర్యకాంతితో రాజ్య మేలేవాడు. అతనికి గుణవంతుడూ ధార్మికుడునైన పుత్రుడు “జ్యోతిష్మంతు”డను వాడు కలడు. అతడు పుత్రులకొరకై మందాకినీ నదీ తీరాన తపస్సు చేస్తూండగా అతని భార్య, దేవ గురువు పుత్రికయైన సుందరి కూడా భర్తకు పరిచర్యచేస్తూ తపోజీవనం గడపసాగింది. ఫల పుష్ప సమిధలు సమకూర్చుతూ అతిథి సత్కారాలు చేస్తూ అరణ్యవాసం వల్ల నామె కృశించి శల్యమై పోయింది. తపస్తేజంతో వెలిగిపోతూ వనంలో తిరుగుతూ ఉన్న ఆమె నొకపరి సప్తర్షులు చూచి, ఈ కాననంలో ఇలా కఠోర తపస్సు చేయుటకు కారణమేమని ప్రశ్నించారు. అందులకా ఇల్లాలు తానూ తన భర్త తనయుల కొరకై తపో దీక్షలో ఉన్నామని చెప్పగా వారలు కరుణించి అమ్మా! మీరింటికి వెళ్లిపోండి. మీకు ఏడుగురు కుమారులు కలిగెదరు. మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరిక నెరవేరుతుంది. సందియము లేదని వరమిచ్చి వెళ్లిపోయారు.
అంతట ఆ రాజర్షి భార్యతో నగరానికి తిరిగి వెళ్లిపోయాడు. తదుపరి చాలా దినాలకు ఆరాజు భార్య భర్త వలన గర్భంధరించింది. ఆవిడ గర్భిణిగా ఉండగానే ఆ రాజు మృతుడైనాడు. ఆ పతివ్రత అమాత్యులు వలదని ఎంత బ్రతిమాలినా అంగీకరించక భర్త దేహాన్ని చితిపై ఉంచి తాను గూడ చితాగ్నిలో దుమికింది. ఓ మహర్షీ! అంతట నామె గర్భంలో నుండి ఒక మాంస ఖండం ఎగిరి వచ్చి బయట నీళ్లలోపడి ఆ శైతల్యానికి ఏడు భాగాలుగా విడిపోయింది. అందులో నుంచి ఉత్తముని మన్వంతరంలో మరుత్తులు ఉద్భవించారు. ఆ ఉత్తముని భ్రాత తామసుని మన్వంతరంలో మరుత్తులుగా జన్మించిన గాథ ఓ నారదా! శ్రద్ధగా వినుము. “ఋతుధ్వజు”డను పేర విఖ్యాతుడైన తామస మనువు కుమారుడు తనయుల కోసమై యజ్ఞం మొదలుపెట్టి అగ్నితో తన రక్తమాంస అస్థి రోమకేశ స్నాయువులు మజ్జాయకృత్తూ చక్కన అగు శుక్రం అన్నీ హెూమం చేశాడు. వీర్యం అగ్నిలో బడుతూండగా “వద్దు వద్దు శుక్రం వ్రేల్చ వద్ద”నే శబ్దం బయలువెడలి వెంటనే ఆరాజు మృతుడై పోయాడు. అంతట ఆహవ్య వాహనుడి నుండి ఆయన లాంటి తేజస్సుతో వెలుగుతూ ఏడుగురు శిశువులు రోదిస్తూ బయటపడ్డారు. వారల ఏడుపు విని పద్మభవుడు వచ్చి, ఏడ్పు మాన్పించి వారలను “మరుత్తు”లను గావించాడు. ఆ విధంగా తామస మన్వంతరంలో మరుద్దేవ గణాలు వెలిశారు.
ఇక రైవత మన్వంతరంలోని మరుత్తుల జన్మ ప్రకారం వినుము. రైవతుని వంశంలో శత్రు భయంకరుడగు రిపుజిత్తనే రాజుగలడు. అతనికి పుత్రులు కలుగకపోగా తేజోనిధి అయిన భాస్కరుని ఉపాసించి “సురతి” అను పుత్రకను పొంది ఇంటికి గొనిపోయెను. తండ్రి యింటిలో ఆ బాలిక పెరుగుతుండగా నా రిపుజిత్తు మరణించెను. పితృయోగం సహించలేక ఆ బాలిక దేహత్యాగానికి ఉద్యుక్తురాలైంది. అంత బ్రహ్మ మానస పుత్రులైన సప్తర్షులామెను నివారించిరి. ఇతర తపస్వులు గూడ ఆమెపై ఎంతయో వాత్సల్యం కలిగియుండిరి. అయిననూ ఆమె ఆ దుఃఖ సాగరం భరించలేక చితి పేర్చుకొని అందులో దగ్ధమైపోయింది. ఆ దృశ్యం చూచి, ఆమెను అభిమానించిన ఋషు లందరూ అయ్యో! ఎంతకష్టం! ఎంతకష్టం! అని ఆక్రోశించారు. తగులబడుతున్న ఆమె శరీరాగ్ని నుండి ఏడుగురు బాలకు లుద్భవించారు. తల్లిని కోల్పోయి ఏడ్చుచున్న వారలను విరించి లోకపతి అయిన బ్రహ్మ మరుద్గణాలనుగా నియమించాడు. ఓ నారదా! వారే రైవత మన్వంతరంలోని మరుత్తులు. ఇక చాక్షుష మన్వంత రంలోని మరుత్తుల వృత్తాంతము వినుము. ఆ కాలంలో సప్త సారస్వత తీర్థంలో సత్యవాది, శుచివ్రతుడు అయిన మంకి అను తపోధనుడు ఘోర తపస్సులో ఉండగా దానికి విఘ్నం కలిగించుటకై తుషిత దేవతలు “వపు”వు అనే సుందరిని నియోగించారు. ఆ భామిని నదీ తీరాన చేరి ఆయనకు మనోవికారం కలుగ జేయగా అయన శుక్రం జారి సప్త సారస్వత జలాల్లో పడిపోయింది. అందుల కాగ్రహోదగ్రుడై ఆ మంకణకుడు ఆ వపును చూచి గర్జిస్తూ ఓసీ! మూర్ఖురాలా! నీ పాపానికి ఫలం తప్పక అనుభవించుము. పో పో! నిన్ను యజ్ఞ సభా వేదిక వద్ద నుండగా ఒక గుర్రం నాశనం చేస్తుంది అని శపించాడు. అనంతర మా ఋషి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ సప్తసారస్వతీ జలంలో నుంచి ఏడుగురు మరుత్తులు జన్మించారు. ఓ నారదా! ఈ విధంగా పూర్వమన్వంతరాలలో ఆకాశ వ్యాపకులైన మరుత్తులు ఎలా జన్మించినదీ నీకు విపులంగా వివరించాను. వీరల జన్మ గాథా శ్రవణం పాప పరిహారం కలిగించి ధర్మాభ్యుదయం చేకూర్చగలదు.