అసూర్య శయన ద్వితీయా వ్రతం

అంతట నారదుడు పులస్తునితో, శివకేశవుల ప్రసన్నులను గావించుకొనుటకు చంద్రుడు గావించిన వ్రతారాధనము లెవ్వియో దయచేసి సెలవియ్యవలయును. అని అడుగగా పులస్త్యు డిట్లనెను. “నారదా! శర్వ కేశవులను ప్రసన్నుల గావించుకొనుటకుగాను కాముకులు ప్రవచించిన పుణ్యవ్రతాలను గురించి వినుము. ఉత్తరాయణం వెళ్లిపోయి ఆషాఢ మాసాగమనంతో దేవాధిదేవుడు లక్ష్మీపతి శేషశయనం మీద నిద్రించును. తమ ప్రభువు నిద్రించినతోడనే దేవ గంధర్వ యక్షులు వారల తల్లులు క్రమంగా గాఢ నిద్రలో మునిగిపోతారు. అషాఢ శుద్ధ ఏకాదశినాడు సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించగా జగన్నాథుడు శయనమునకు ఉపక్రమించును. పీతాంబరధారియై శుచియై ప్రయత్న శీలుడై నరుడు శేషశయనము నేర్పరచి దానిపై కేశవునికి ఉపవీతధారణం కావించి అర్ఘ్యపాద్యాదులతో చక్కగా పూజించి, ద్వాదశినాడు బ్రాహ్మణ పూజచేసి, వారిచేత అనుజ్ఞ పొంది స్వామిని సుఖశయనుని గావింపవలెను. త్రయోదశినాడు కదంబ పుష్పశయ్య మీద మన్మథుడు నిద్రించును. చతుర్దశినాడు యక్షులు, బంగారు కమలాలు పరచిన శీతల శయ్య మీద మంచి తలగడలమర్చుకొని నిద్రింతురు. పౌర్ణమినాడు పరమశివుడు తన జటాజూటాన్ని పులితోలుతో ముడివేసికొని వ్యాఘ్రాజినం మీద శయనించును సూర్యుడు కర్కటరాశిలో ప్రవేశించుటతో దేవతలకు రాత్రి ఆరంభమగును. అదే దక్షిణాయనము. ఓ పవిత్రమునీ! పాడ్యమినాడు నల్ల కలువలశయ్య మీద విరించి శయనించును. ప్రజలకు ఉత్తమమైన మార్గము చూపును. తర్వాత వరుసగా విదియనాడు దేవశిల్పి విశ్వకర్మ,తదియనాడు పార్వతీదేవి, చవితినాడు వినాయకుడు, పంచమి నాడు యమ ధర్మరాజు, షష్ఠినాడు కుమారస్వామి, సప్తమినాడు సూర్యుడు, అష్టమినాడు కాత్యాయని, నవమినాడు మహాలక్ష్మి, దశమినాడు వాయుభుక్కులు పన్నగులు నిద్రింతురు. కృష్ణ ఏకాదశి నాడు సాధ్యులు నిద్రింతురు. ఈ క్రమంలో దేవతలు శ్రావణమాసంలో నిద్రించగా అప్పటి నుండి వర్షాకాలము ప్రారంభమగును.

గ్రద్దలు, కొంగలు, కాకులు, కొండకొమ్ముల మీద చేరుతవి. కాకులు గూళ్ళు కట్టడం మొదలెడతాయి. ఈ ఋతువులో గర్భభారంతో ఉండే ఆడకాకులు వెళ్ళి ఆగూళ్ళలో నిద్రిస్తవి. నారదా! ప్రజాపతి విశ్వకర్మ నిద్రించిన రోజును పవిత్రమైన అశూన్యశయన ద్వితీయ అంటారు. ఆ దినాన శ్రీవత్సాంకుడు చతుర్భుజుడైన మహావిష్ణువును, మహాలక్ష్మితో గూడ శయనం మీద నుంచి గంధ పుష్పాదులతో పూజించి ఆ శయ్య మీద సువాసన గల ఫలాలు ప్రక్షేపించాలి. వానిని నివేదించి ఆ మధుసూదనుని ఇలా ప్రార్థించాలి.-“ఓ త్రివిక్రమా! అనంతా! జగన్నివాసా! నీవే విధంగా క్షణ కాలం కూడా వదలకుండా లక్ష్మితో ఉంటావో అదే విధంగా నీ అనుగ్రహం వల్ల మాశయ్యలు గూడ ఒక క్షణకాలం కూడ శూన్యంగా ఉండకుండు గాక! మేము కూడ అశూన్యశయనుల మగుదుముకాక! ఓ అచ్యుతా! వరదా! లక్ష్మితో కూడి ఎట్లు నీ తల్పం అశూన్యంగా ఉండదో, అదేవిధంగా ఓ అమితవీర్యా! విష్ణూ! మాకు గార్హస్థ్య నష్ట మేనాడును కలుగకుండుగాక:

అని ఈ విధంగా ప్రార్థించి మరల మరల నమస్కారములు గావించి శ్రియః పతిని ప్రసన్నుని గావించుకొని, ఆనాడు రాత్రివేళ మాత్రమే నారదా! నూనె, ఉప్పులేని భోజనం చేయాలి. ఆ మరునాడు ఉత్తమ బ్రాహ్మణునకొక పండును, తన శక్తి కొలది దక్షిణతో కూడ దానం చేయాలి. లక్ష్మీనాథుడు సంతోషించుగాక! అని సంకల్పించుకొని ఆ ఫలదానం చేయాలి. ఈ విధంగా సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించువరకు చాతుర్మాస్య వ్రతాచరణం చేయాలి. అంతట దేవతలొకరొకరుగా నిద్రనుంచి మేలుకుంటారు. మునే! సూర్యుడు తులారాశిలో చేరగానే శ్రీహరి నిద్రనుంచి లేస్తాడు. తర్వాత కాముడు శివుడు మేలుకుంటారు. అంతట విదియనాడు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తల్పం ఆస్తరణతో కూడ తన వైభవానికి తగిన రీతిలో దానం చేయాలి. ఈ విధంగా మొదటి వ్రతాన్ని నీకు తెలిపితిని. దీని నాచరించినవారికి జీవితంలో ఎవరితో వియోగం ఎప్పుడు కలుగదు.