శంకరుడు కపాలి అయిన కథ

నారదుడు: బ్రహ్మర్షీ! దేవశ్రేష్ఠుడు, శూలపాణి, త్రినేత్రుడునగు శంకరు డే కారణమున కపాలిఆయెను? అని తిరిగి ప్రశ్నించాడు. అందుకు పులస్త్యుడు, నారదా! అవ్యక్త బ్రహ్మ ఆదిపురాణంలో చెప్పిన ఈ ప్రాచీన గాథను శ్రద్ధగా వినుము. తొల్లి స్థావర జంగమాత్మక మైన విశ్వమంతయు ఏకార్ణవమై సూర్య చంద్ర నక్షత్ర అగ్నివాయువులు నశించిపోయినవి. చెట్లు, పర్వతాదులను ముంచివేసి ఊహకూ తర్కానికీ అందక ఏ మాత్రము తెలియరాని అంధతమస్సు సర్వత్రా వ్యాపించింది.

అందులో భగవంతుడు వెయ్యేండ్ల కాలము నిద్రతో ఉండి ఆ నిశాంతాన రాజన రూపం ధరించి లోకాలను సృష్టించెను. ఆ జగత్తు నుండి రజోగుణ ప్రధానుడై పంచముఖాలతో వేద వేదాంగ పారగుడుగు చరాచర సృష్టికర్త ఉద్భవించెను. అట్లే తమోగుణమయుడు త్రిలోచనుడు శూలపాణి జటాధారియగు రుద్రుడు రుద్రాక్షమాలతో బయటకు వచ్చెను. అంతట భగవంతుడు భయంకరమైన అహంకారమును సృష్టించగా అది బ్రహ్మరుద్రులను ఆవహించెను. అహంకారావృతుడై శంకరుడు బ్రహ్మతో "నీ వెవడవు నిన్నెవరు సృజించి పంపిరో నాకెరిగించు" మనెను. అహంకారమునకు లోనై పితామహుడు కూడ అదే విధముగా "నీ వెవడవు? నీ తలిదండ్రులెవరని” శంకరుని ప్రశ్నించెను. నారదా! ఈ విధంగా ప్రాచీన కాలాన బ్రహ్మకు రుద్రునకు వివాద మేర్పడినది. నీవా సమయమున ఉద్భవించితివి. పుట్టిన వెంటనే అసదృశమైన వీణపై ఆనంద ధ్వని చేయుచు నీవు ఆకసమున కెగిరితివి. అభిమాని యగు బ్రహ్మచే నిర్జింపబడి శంకరుడు దీనవదనంతో రాహుగ్రస్తుడైన చంద్రునకు వలె అధోముఖుడై నిలచెను. అవమానభారంతో, క్రోధంతో, నల్లనైన ముఖంతో నిలచిన రుద్రుని, బ్రహ్మయొక్క పంచమ ముఖమిట్లు గద్దించి "శంకరా! తమోమూర్తివైన నీవు దిగంబరుడవై త్రినేత్రాలతో ఎద్దుపై నెక్కిలోక సంహారం చేస్తుంటావని నాకు బాగా తెలియును. ఇదే నీ నిర్వాకము.” అని హేళనచేయుచు పలికెను. అంతట క్రోధంతో ఎర్రబడిన కన్నులతో శంకరుడు, ఆ బ్రహ్మ ముఖమును భస్మం చేయుటకై, ఆగ్నేయ దృష్టులతో తిలకించెను. వెంటనే శివునకు శ్వేతారుణ స్వర్ణ నీల పింగళ వర్ణములతో అయిదు మనోహరములు పవిత్రములునైన ముఖము లేర్పడెను. సూర్య కాంతితో ప్రకాశించే ఆ ముఖాలను చూచి బ్రహ్మ ముఖము హేళనగా "వానకారు నీళ్ళలో లేచే బుడగలకు నీ ముఖాలకు భేదమేమి? ఇదియు ఒక పరాక్రమమేనా?” అని పలుకగా ఆ మాట వినిన వెంటనే శంకరుడు క్రోధోన్మత్తుడై, అట్లు ప్రేలుచున్న బ్రహ్మ ఐదవ ముఖమును కొనగోట నవలీలగ త్రుంచి వైచెను. ఆ విధముగ తెగిన ముఖము వెంటనే శివుని ఎడమ అరచేతి కంటుకొనిపోయి ఎంత ప్రయత్నించినను ఊడిపడదయ్యెను. అద్భుత శక్తిగల బ్రహ్మ అందులకు కోపించి కవచకుండలశరాలంకృతుడైన బుద్ధిమంతుడగు పురుషు నొకని సృష్టించెను. అతడాజాను చతుర్భాహువు అవ్యయుడు. నాలుగు చేతులలో ధనుర్బాణములు శక్తి గొప్పదగు అంబులపొది ధరించి సూర్యునివలె వెలుగుచుండెను. ఆ దివ్యపురుషుడు శంకరునితో "దుర్బుద్ధీ! శంకరా! నీవు పాపిష్ఠుడవు. నిన్ను నేను సంహరింపను. పాపి నెవడు వధింపనెంచును అని పలికెను. ఆ మహాపురుషుని మాటకు సిగ్గుపడి ఖిన్నుడై శంకరుడా ప్రదేశము వదలి బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమము నర నారాయణుల తపోభూమి. హిమగిరి ప్రదేశము. పరమ పవిత్రమైన సరస్వతీనది అట ప్రవహించుచుండును. అక్కడకు వెళ్ళి నారాయణుని చూచి శంకరుడు "ప్రభో! మహా కాపాలికుడను, బిక్షార్థినై వచ్చితి”ననెను. అప్పుడు ధర్మపుత్రుడగు నారాయణుడు శంకరుని జూచి మహేశ్వరా! నీ త్రిశూలముతో నా ఎడమ భుజాన్ని కొట్టుమనెను. వెంటనే శంకరుడు తన త్రిశూలముతో నారాయణుని ఎడమ భుజమును గట్టిగా ప్రహరించెను. త్రిశూలము యొక్క దెబ్బ సోకిన చోటు నుండి మూడు ధారలు నిర్గమించి అందొకటి ఆకాశ మార్గమున స్థిరపడి నక్షత్రములచే అలంకరించబడెను. భూమిపై దొర్లిన రెండవ ధారను తపోధనుడగు అత్రిముని గ్రహించెను. అందుండి శివాంశతో దూర్వాసముని ఉద్భవించెను. మూడవ ధార భయంకరమైన కపాలం మీదపడి అందుండి ఒక శిశువు ఉద్భవించెను. అతడు పుట్టుకతోనే శ్యామ మనోహర కాంతితో ధనుర్బాణాలు ధరించి యువకుడై మేఘ గంభీర ధ్వనితో "తాళవృక్షం నుండి తాళఫలాలకు వలె నేనెవరి తలలు పడగొట్టవలెనో చెప్పుడు అని శంకరుని ప్రశ్నించెను. నారాయణబాహువు నుండి జన్మించిన ఆ యువకునితో ఓ నరుడా! వంద సూర్యుల కాంతితో వెలుగుతు దుష్టవాక్యాలు ప్రేలుచున్న బ్రహ్మ పుత్రుడైన ఈ దుష్టుని పరిమార్చుము. అని శంకరుడు పలికెను. శంకరుని ఆదేశమువిని ఆ వీరుడు అజగవమను ప్రసిద్ధ ధనుస్సు, అక్షయ తూణీరాన్ని తీసికొని యుద్ధమునకు తలపడెను. అప్పుడు శివ బ్రహ్మలకు సంభవించిన ఆ అద్భుత వీరులకు వేయి దివ్య వర్షములు ఘోరమైన యుద్ధము జరిగెను. అంతట హరుడు బ్రహ్మతో నిట్లనెను: “పితామహా! చూడుము! అద్భుత బలశాలియగు ఒక నరుని బాణముల తాకిడికి పరాజితుడైనాడు. ఇది దశ దిక్కులలోను పరమాశ్చర్య కరమైన ఘటన అని పలుకగా! అంతట బ్రహ్మ శివునితో "శంకరా! ఒక సాధారణ మానవునిచే ఓడింపబడిన మహాత్ముడగు నా పురుషుడు ఈ లోకమున జన్మించినవాడు కాడు. నిజానికి సాధారణుడైన ఈ నరుడే ఓడిపోవలసి ఉండెను" అనెను. వెంటనే శంకరుడు ఓడిపోయిన బ్రహ్మ పుత్రుని సూర్యునిలోనికి విజేత అయిన నారాయణ బాహుజన్ముని నారాయణుని దేహములోనికి విసరివైచెను.