వామన మహా పురాణము
బలికి వామనుని వరం
బలి ఇలా అన్నాడు, భగవన్, నీ ఆజ్ఞ ప్రకారం పాతాళంలో ఉన్నన్నాళ్ళు నిరంతరం నీ స్మరణచేస్తూ ఉండుటకు అచట నాకు తగిన భోగపదార్థములేవి గలవు? అందులకు భగవంతు ఇలా చెప్పాడు. “ఓ బలిరాజా! బాగా వినుము. విధిపూర్వకంగా చేసిన దానాలు, అవైదికంగా చేసిన శ్రాద్ధకర్మలు, శ్రద్ధలేకుండా చేసిన హోమాలు, వానిఫలం నీవు పొంద గలవు. దక్షిణ ఇవ్వకుండా చేసిన యజ్ఞాలు, విధివిహితాలు కాని క్రియలు, బ్రహ్మచర్య దీక్షలేకుండా చేసిన వేదాధ్యయనాలు, ఉదకం లేకుండా చేసిన పూజలు, దర్భలేకుండా జరిగిన కర్మలు, నేయిలేని హోమాలు నీకు కావలసిన ఫలాన్ని ఇస్తాయి. ఈ ప్రదేశాన చేయబడిన ఎలాంటి కర్మలలోనూ అసురులకు హవిర్భాగాలుండవు. పరమపావనమైన జ్యేష్ఠాశ్రమంలో విష్ణుపద సరోవరంలో, నియమపూర్వకంగా ఏయే శ్రాద్ధము లాచరింపబడునో, విధివిధానంగాగాని, అవిధిపూర్వకంగా గాని చేయబడు సమస్త కర్మలకూ అక్షయ ఫలప్రాప్తి కలుగుతుంది. సందేహంలేదు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశినాడు వామనదర్శనం చేసికొని విష్ణుపద సరోవరంలో స్నానంచేసి తన శక్తికొలది దానంచేయుచో పరమపద ప్రాప్తి లభించగలదు.” అని చెప్పి రోమహర్షణుడు మునులతో ఇలా అన్నాడు. మహర్షులారా! శ్రీహరి ఈ విధంగా బలిరాజేంద్రునకు వరములు, శతక్రతువుకు స్వర్గ రాజ్యాన్ని ఇచ్చి తన విశ్వరూపంతో అంతర్ధానం పొందాడు. ఇంద్రుడెప్పటివలె దర్పంతో ముల్లోకాలను పాలించాడు. గడువు పూర్తి అగునంత వరకు బలిరాజేంద్రుడు పాతాళంలో ఉండిపోయాడు.