వామన మహా పురాణము
కశ్యపకృత విష్ణు పరమస్తవం
కశ్యపుడిలా స్తోత్రం చేశాడు! ఓదేవా, ఏకశృంగా, వృషార్చీ, సింధుపతే, వృషాకపీ, సురశ్రేష్ఠ, అనాది, సంభవా, రుద్రా, కపిలా, విష్వక్సేనా, సర్వభూతపతీ, ధ్రువా, ధర్మాధర్మా, వైకుంఠా, వృషావర్తా అనాది మధ్యనిధనా ధనంజయా, శుచిశ్రవా (సత్కీర్తీ), పృశ్ని తేజా నిజజయా నీకు నమస్కారము. అమృతేశయా సనాతనా, త్రిధామా, తుషితా, మహాతత్వా, లోకనాథా, పద్మనాభా, విరించీ, బహురూపా, అక్షయా, అక్షరా, హవ్యభోజీ, ఖండపరశూ, శక్రా, ముంజకేశా, హంసా, మహా దక్షిణా, హృషీకేశా, సూక్ష్మా, సుహానియమధరా, విరజా, లోకప్రతిష్ఠా, ఆరూపా, అగ్రజా, ధర్మజా ధర్మనాభా నీకు ప్రణామాలు, గభస్తినాభా శతక్రతునాభా చంద్రరథా సూర్యతేజా, సముద్ర వసనా, అజా, సహస్రశీర్షా, సహస్రచరణా, అధోముఖా మహాపురుషా, పురుషోత్తమా, సహస్రబాహూ, సహస్రరూపా, సహస్రముఖా, సహస్రసంభవా, సహస్రసత్త్వా, నిన్ను ఈ విధంగా వర్ణిస్తారు. ఓ పుష్పహాసా, చరమా, వౌషట వషట్కారాలు నీవే. నిన్ను మొదటివాడవనీ, సహస్ర ధారివనీ భూర్భువః సువర్లోక రూపుడవని, వేదవేద్యుడవు మహాశయుడవు బ్రాహ్మణ ప్రియుడవనీ అంటారు. అంతరిక్షం, వాయువు ధర్మానివీ నీవే. హోతవు, పురోహితుడవు నీవే, మంత్రానివి నీవే. నేతవు హోమహేతువు నీవే నీవే అగ్ర్యుడవు విశ్వధాముడవు. దిక్కులు నీవు. సుభాండము, యజింపబడదగినవాడవు, చక్కని మేధస్వరూపివి నీవే. సమిధలు, మతిగతి, దాతవు నీవే మోక్షం నీవు యోగం నీవు స్రష్టవు నీవు. దాతవు, పరమయజ్ఞానివి, సోమరసానివి, దీక్షితుడవు, యజ్ఞదక్షిణవు, విశ్వానివీ నీవే. స్థవిరుడవు, హిరణ్యనాభుడవు, నారాయణుడవు, త్రినేత్రుడవు, అదిత్య వర్ణుడవు ఆదిత్య తేజస్వియగు మహా పురుషుడవు, పురుషోత్తముడవు అది దేవుడవు సువిక్రముడవు ప్రభాకరుడవు, శంకరుడవు, స్వయంభువు నీవే. సమస్త భూత జాలానికీ ఆదివి, మహా భూతానివి, విశ్వభూతానివి, విశ్వానివి, విశ్వరక్షకుడవు నీవే. నీవు పవిత్రుడవు. విశ్వ భవుడవు, ఊర్ధ్వ కర్మవు, అమృతానివి, దివస్పతివి, వాచస్పతివి, ఘృతార్చివి, వంశానివి, ప్రాగ్వంశానివి (అన్ని వంశాలకు మూలం), విశ్వరక్షకుడవు నీవే, అర్థులకు కామ్యాలువర్షించే వరదుడవగు నీకు నమస్కారం. నిన్ను నాలుగు మరి నాలుగు, రెండు మరియు అయిదు మరల రెండు హోమాలతో అర్చిస్తారు. అట్టి హోత్రాత్మ (యజ్ఞరూపి) వగు నీకు ప్రభో! నమస్సులు!