దేవాసురుల సమరం

పులస్త్యుడు ఇట్లనియెను. ఓ కలహప్రియుడవగు నారదా! ఈ కారణాననే బలిదైత్యుని రాజును గావించారు. మంత్రి ప్రహ్లాదుడైనాడు. శుక్రాచార్యుడు పురోహితుడైనాడు. విరోచన పుత్రుడు బలి దైత్యుడు రాజ్యాభిషిక్తుడు గావటం వినగానే మయ దానవునితో సహా రాక్షసులందరు తమ ప్రభువును దర్శించుటకు వచ్చి చేరారు. ఆ వచ్చిన దైత్యులను అందరను యథావిధిగా పూజించి నాకు శ్రేయస్కరమైన కర్తవ్య మేదో చెప్పుడని అర్ధించాడా వినయశీలి యగు బలి రాజేంద్రుడు. అంతట దైత్యులందరు ఆ బలితో యిలా అన్నారు - “సురమర్దనా! సావధానంగా వినుము. నీకూ మాకూ మనవారందరకూ శ్రేయస్కరమైన విషయం చెబుతున్నాము. నీ ప్రపితామహుడు హిరణ్యకశిపుడు సర్వదైత్య పాలకుడై ముల్లోకాలకూ యింద్రుడై యుండగా, సురశ్రేష్ఠుడైన విష్ణుడు సింహరూపంతో వచ్చి అందరూ చూస్తూండగా గోళ్ళతో చీల్చి సంహరించాడు. అంతేకాదు, మహాత్ముడగు అంధకుని రాజ్యాన్ని అపహరించేందుకు త్రిశూలి అయిన శంకరుని చేత కుట్ర పన్ని అతడిని సంహరింపజేశారు. అంతట పోక మీపినతండ్రి జంభుని ఇంద్రుడూ, కుజంభుని విష్ణువు, పశువుల మాదిరిగా వధించారు. మహేంద్రుడు శంభు పాక దైత్యులను నీ సోదరుడు సుదర్శనుని తండ్రియగు విరోచనుని హతమార్చాడు. ఈ అత్యాచారాలన్నీ నీకు జ్ఞాపకం చేస్తున్నాము. “ఆ విధంగా శక్రుని కారణంగా జరిగిన తన వంశ నిర్మూలన వివరాలన్నీ విని, ఆ బలి, రాక్షసులందరనూ కూడదీసుకొని ప్రతీకారానికి ఉద్యమించాడు. వారంతా మహోత్సాహంతో రథాల మీద కొందరు, ఏనుగుల మీద కొందరూ, గుర్రాలెక్కి కొందరూ, పాదచారులై కొందరూ, మహా శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధానికి బయలుదేరారు. దేవతలతో తలపడటానికి బయలుదేరిన ఆ రాక్షస బలాన్ని ముందుండి సేనాపతి భయంకరాకారుడు మయ దానవుడు, మధ్యభాగాన బలి, వెనుక నుండి కాలనేమి, ఎడమ పార్శ్వాన మహావీరుడు శాల్వుడు, కుడి పక్షాన మహా భయంక రుడైన తారకాసురుడు నడిపించారు. నారదా! ఆ దానవ వీరులు వేలు లక్షలు అర్బుదాల సంఖ్యలో భూమ్యాకాశాలు ఆక్రమించి ప్రచండ ఘోషతో బయలుదేరారు.

రాక్షసులు యుద్ధానికి వస్తున్న విషయం విని దేవరాజు యింద్రుడు, మనం కూడ మన సైన్యాలతో వెళ్లి దానవులతో పోరాడుదము లెండని దేవతలను పురికొల్పాడు. వెంటనే అయన మాతలిగొని వచ్చిన ఉత్తమ రథాన్ని అరోహించాడు. ఇంద్రుడు రథా రూఢుడు కాగానే ఇతర దేవతలందరు తమతమ వాహనాల మీద యుద్ధానికి బయలు వెడతారు. ఆదిత్యులు, వసువులు, యక్షులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినులు, విద్యాధర యక్షరాక్షస పన్నగులు రాజర్షులు, సిద్ధులు నానా భూతగణాలు అందరూ గజాల మీద కొందరు, అశ్వాల మీద కొందరు, రథాల నెక్కి కొందరు విమానాలను, పక్షివాహనాల నారోహించి కొందరూ, బయలుదేరి దైత్య సైన్యాల కెదురుగా పయనించారు. నారదా! ఇంతలో నీ విషయం తెలిసికొని వినతాసుతుడైన గరుడుడు, ఆయన మీద ఆసీనుడై దేవశ్రేష్ఠుడు విష్ణువు కూడ వచ్చి కలిశారు. ఆ వచ్చిన త్రిలోకనాధుని చూచి, ఇంద్రుడు దేవతలు అందరితో కలిసి వినమ్ర ప్రణామాలు గావించాడు. దేవ సేనా సమూహానికి ముందు గదాధారియై స్కంధుడు నడిచాడు. మధ్యభాగాన ఇంద్రుడు, జఘన భాగాన విష్ణువు, ఎడమ భాగాన జయంతుడు, కుడివైపు మహాబలశాలి వరుణుడు, సేనా సంచాలనం గావించారు. ఆ విధంగా స్కంద ఇంద్ర విష్ణు వరుణ భాస్కరులు రక్షించుచుండగా యశస్విని అయిన ఆ దేవసేనా వాహిని నానా ఆయుధాలతో ముస్తాబై ఉదయగిరి పార్శ్వాన చెట్టు చేమలు పక్షిమృగాలు లేకుండా సమతలంగా అందంగా ఉన్న శిలా మైదానానికి చేరుకుంది. అంతట ఆ ప్రదేశంలో దేవాసురులు సైన్యాలు రెండు భయంకరంగా నొకదాని నొకటి ఢీకొనగా, ప్రాచీనకాలంలో వానర గజాల మధ్య జరిగిన ఘోర సంగ్రామాన్ని తలపిస్తూ తుముల యుద్ధం సాగింది. ఓ దేవర్షీ! యుద్ధానికి ముందు భాగాన రథాల వేగానికి రేగిన ఎర్రని ధూళి మేఘాలు, సంధ్యాకాలాన పడమటి దిశను కమ్ముకొనే అరుణ మేఘాలను మరపింపజేశాయి. ఆ సంకుల సమరంలో ఏదీసరిగా తెలియ రాలేదు, కనిపించలేదు. కొట్టుడు, చంపుడు, పొడువుడు! అనే భయంకర ధ్వనులు తెరపిలేకుండా నలువైపులా వ్యాపించాయి. రోమ హర్షకమైన ఆ యుద్ధంలో ఇరుపక్షాలలోను హతులైన వారల రుధిర ధారలలో ఆ ధూళిమేఘాలు అణగిపోయాయి. అలా ధూళి తగ్గగానే స్కందుని వెంట దేవ సైన్యాలన్నీ ఒక్కపరిగా రాక్షసుల మీద విరుచుకుపడ్డాయి. దేవసేనాపతి రక్షణలో దేవతలు దానవులను సంహరించగా మయుని అండ చూచుకుని రాక్షసులు సురలను చెండాడసాగారు. అంతవరకూ అమృతపానానికి నోచుకోని దేవతలంతా స్కందునితో సహా రాక్షసుల ధాటికి నిలువలేక ఓటమి పాలయ్యారు. దేవతల ఓటమి చూచి శత్రుహంత అయిన శ్రీహరిశార్‌ఙ్గ చాపాన్ని ఎక్కుబెట్టి బాణవర్షంతో నలు వైపులాగల శతృవులను ఊచకోత కోయసాగాడు. ఉక్కు మొనలతో పిడుగుల్లాగ తాకే ఆ బాణాలకు హతశేషులయిన రక్కసులు వెన్నిచ్చి పారిపోయి మహాదైత్యుడు కాలనేమిని శరణు పొందారు.