వామన మహా పురాణము
పాలకునికి ప్రహ్లాదుని ఉపదేశం
అలా దైత్యేశ్వరుడైన బలి వివిధ స్వర్గభోగాలు అనుభవించి ఒకనాడు తన పితామహుడు పరమ భాగవతుడు అగు ప్రహ్లాదుని మనసారా స్మరించాడు. మనుమడు స్మరించినంతనే ఆ అసురోత్తముడు పాతాళాన్నుంచి త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. అలా వచ్చిన తాతగారిని చూడగానే బలి సింహాసనం దిగి రెండు చేతులూ జోడించుకుని ఆ మహనీయునకు సాష్టాంగ పడి మ్రొక్కాడు. చరణాలు కడపడియున్న ఆ మహావీరుని ప్రహ్లాదుడు ప్రేమతో లేవనెత్తి కౌగలించుకొని శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నాడు. సుఖోపవిష్టుడైన పితామహుని చూచి బలి యిలా అన్నాడు. “పితామహా! తమ అనుగ్రహం వల్ల నా బలాధిక్యత ప్రదర్శించి యింద్ర రాజ్యాన్ని సంపాదించాను. అలా గెలిచిన ఈ త్రిలోక రాజ్యాన్ని తమ రనుభవించండి. నేను భృత్యుడనై సేవ చేస్తాను. తమ చరణాబ్జ పూజ చేస్తూ తమ ఉచ్ఛిష్టాన్నం భుజిస్తూ జీవించగలిగినచో నా అంతటి భాగ్యశాలి మరొకడుండబోడు. ప్రభో! తమబోటి మహనీయుల సేవలో గల్గు తృప్తి సార్ధకత్వం ఈ రాజ్య పాలనంలో నాకు కలగడం లేదు. “ఓ ద్విజోత్తమా! అలా బలి పలికిన మాటలు విని, ప్రహ్లాదుడు ధర్మ కామార్ధ సాధకాలయిన వాక్యాలు చెప్పాడు. “చిరంజీవి! నేనాడో బంధు మిత్ర పరివారంతో నిష్కంటకంగా సకల విధాలయిన రాజ్యభోగాలు అనుభవించి, సకల గౌరవాలు పొంది, యధేష్టంగా దాన ధర్మాలు చేశాను. పుత్రులను కన్నాను. అ భూలోకాధి పత్యాన్ని వదలి ఇప్పుడు యోగసాధనలో నున్నానయ్యా! నీవు నాకు సమర్పించిన ఈ రాజ్యాన్ని తిరిగి నీకిస్తున్నాను. ఇదేవిధంగా పెద్దలను సేవిస్తూ నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించుము.” అలా అని తన కుడిచేతితో మనుమని చేయిపట్టుకుని తిరిగి అతనిని ఇంద్ర సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నారదా! ఆ బలి మహేంద్రుని సర్వ రత్న భూషితమైన సింహపీఠం మీద కూర్చొని మఘవుని (ఇంద్రు)ని వలె ప్రకాశించాడు. అలా సింహాసనం మీద కూర్చొని చేతులు జోడించి మేఘ గంభీర స్వరంతో తాతగారిని యిలా అడిగాడు. “తాతా! ముల్లోక రాజ్య పరిరక్షణ చేస్తూ, ధర్మార్థ కామ మోక్ష సాథకాలయిన కర్తవ్యాలు ఏ విధంగా నేను అనుష్టించవలెనో దయచేసి ఆదేశించండి” ఆ మాట లందుకుని శుక్రాచార్యుడు గూడ “ఓ మహాభుజా! యోగ్యమైన కర్తవ్యం ఉపదేశించండి” అంటూ ప్రహ్లాదుని అర్థించాడు.
బలి శుక్రుల అభ్యర్థన నాలకించి ఆ భాగవత దైత్యుడు, ధర్మార్థ యుక్తమైన ఉత్తమ ఉపదేశం యిచ్చాడు. “వత్సా! రాజువైన నీవు, భవిష్యత్తులో నిలచి లోకానికి హితం కలుగజేసే కార్యాలు చేయదగుదువు. ధర్మానికి విరుద్ధం కాని విధంగా ధనము నార్జించుము. కామ్యసాధనం ఎల్లరకు అనుకూలంగా యిహపరాల్లో శ్రేయం కలిగే విధంగా ఆచరించుము. ఓ మహామతీ! అడుగడుగున శ్లాఘింపబడునట్టుగా, కీర్తి కలుగునట్లుగా, అపయశస్కరం కాని విధంగా కర్మా చరణము చేయుము. ఉత్తములగువారు, తమ యిండ్లలో వృద్ధులు, మిత్రులు, చుట్టాలు, జ్ఞాతులు, గుణవంతులు, బ్రాహ్మణులు గౌరవింపబడుటకు పేరు ప్రతిష్ఠలు కలుగుటకే సిరిసంపదలను కాంక్షిస్తారు. అర్ధహీనులను ఆదు కొనుటకే అర్ధోపార్జనం చేస్తారు. కాబట్టి పుత్రా! నీ రాజ్యంలో ఉత్తమ కులజులూ, యోగ్యులగు తదితరులూ, నిశ్చింతగా నివసించుటకు తగిన ఉత్తమ కార్యాలు చేస్తూ నీ యశస్సు దశదిశలా వ్యాపించునట్లు నడుచుకొనుము. ఎల్లపుడూ భూమి బ్రాహ్మణులతో నలంకరింపబడి, క్షత్రియులతో పరివృతమైన, సస్యసమృద్ధమై, సేవాభావంగల వారితో కలకలలాడుతూ ఉన్నపుడే దానిని పరిపాలించు రాజులకు అభివృద్ధి. కనుక రాజుకూ, రాజ్యానికీ కల్యాణం కలిగే పవిత్ర యజ్ఞ యాగాదులు, ఉత్తములూ శ్రుతి శాస్త్రవేత్తలూ చేయునట్టుగా, వారు దివ్యమైన క్రతువులూ తపస్సూ చేయునట్టుగా, విపుల కనుకూలమగు వాతావణం నెలకొల్పుము. యజ్ఞాగ్ని ధూమం వల్లనే రాజులకు శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. కనుక ఓ బలీ! నీ రాజ్యంలో నీ అనుజ్ఞతో ఎల్లెడలా తపస్సంపన్నులూ, యజనం యాజనం అధ్యాపనం చేసే విప్రోత్తములు, పూజార్చనలు అందుకొనునట్లుగా యత్నింపుము. శస్త్రోపజీవులగు క్షత్రియులు, వేదాధ్యయనం యజ్ఞాలు చేస్తూ, వదాన్యులై ప్రజాపాలనం చేయునట్లుగ ప్రోత్స హించుము. వాణిజ్య ప్రవీణులగు వైశ్యులు దాతలై యజ్ఞాధ్యయనాలు చేస్తూ వ్యవసాయం పశుపాలనం చక్కగా నిర్వర్తించునట్లు జాగ్రత్త వహించుము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు వారల ధర్మ నిర్వహణంతో సేవా సహకారాలు అందిస్తూ నీ ఆజ్ఞాను కారులై శూద్రులు మెలగునట్లు చూచుకొనుము. చతుర్వర్ణాల వారు తమతమ ధర్మాలు చక్కగా ఆచరించిననాడు ధర్మ వృద్ధి కలుగుతుంది. ధర్మవృద్ధితో రాజులకు అభ్యుదయం చేకూరుతుంది. కనుక నీ రాజ్యంలోని వారంతా స్వధర్మ నిరతులగునట్లు పాటుపడుము. ధర్మహానియే రాజ్యహానికి హేతువని పెద్దల నిర్ణయం. “తన పౌత్రున కిలా హితోపదేశం చేసి ఆ మహనీయుడు ముగించాడు. ఓ నారదా! ఆ బలి చక్రవర్తి, “తమ ఆదేశం తల దాల్చుతున్నా”నని చేతులు జోడించాడు” అని పులస్త్యుడు నారదునికి వివరించాడు.