సనకాదుల సృష్టి

అంతట అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆలోచించగా ఆయన మనస్సు నుండి సనకాది ఋషులు ఉద్భవించారు. ప్రజాసృష్టికాయన మరల సంకల్పించు కోగా సప్తఋషులు ఉత్పన్నమైనారు. వారే ప్రజాపతులు. రజోగుణ మోహితుడై బ్రహ్మ మరల ఆలోచించగా తపఃస్వాధ్యాయ నిరతులైన వాలఖిల్య మునులు జన్మించారు. వారు స్నాన దేవతార్చన ఉపవాస వ్రతాదులలో మునిగి, వానప్రస్థ పద్ధతిలో అగ్ని కర్మలు నెరవేర్చుకుంటూ కఠోరమైన తపస్సుతో తమ శరీరాలు శుష్కింప జేసుకున్నారు. వేయి దివ్య సంవత్సరాలు ఆ విధంగా తపించినందున వారి దేహాల్లోని రక్తమాంసాదులు శుష్కించి కేవలం నాడులు, నరాలు మిగిలి పోయాయి. అలా ఆరాధించినా, శంకరుడు ప్రసన్నుడు కాలేదు.