సుకేశి కథ

ఈ యుద్ధవృత్తాంతాన్ని అంతటిని విన్న నారదుడు, మహాత్మా! నీవింతకుముందు సుకేశి నగరాన్ని సూర్యుడు క్రిందకు త్రోసివైచెనంటివి. అది ఎప్పుడు ఎక్కడ జరిగినది? ఆ సుకేశి ఎవడు? అతనికా నగరం ఎవరిచ్చారు? ఆకాశాన్నుంచి దానిని సూర్యుడెందుకు భూమి మీదకు పడవేశాడు? అని పులస్త్యుని ప్రశ్నించగా

పులస్త్యుడనెను అనఘా, ఇది చాలా పురాతన గాథ; శ్రద్ధగా విను. బ్రహ్మ నాకు వినిపించిన ఈ వృత్తాంతం సాకల్యంగా చెబుతున్నాను. ఒకప్పుడు విద్యుత్కేశి అనే రాక్షస రాజుండేవాడు. అతనికి సద్గుణవంతుడైన సుకేశియనువాడు కుమారుడు. అతని వల్ల సంతుష్టుడై పరమ శివుడు ఆకాశగమనం కలిగిన ఒక నగరాన్నీ, అజేయత్వాన్నీ, శత్రువులచేత అవధ్యత్వాన్నీ వరాలుగా ఇచ్చాడు. ఆ విధంగా అకాశనగరాన్ని సంపాదించి ఆ అసురుడు తనవారలతో కలిసి ధర్మం తప్పకుండా, సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. ఆ రాక్షస రాజొక పర్యాయం మగధ దేశంలో అడవికి వెళ్ళి, అక్కడ మహర్షుల ఆశ్రమాలను దర్శించాడు. ఆ మహనీయులకు పాదాభి వందనం చేసి, వారిచేత గౌరవింపబడి వారితో సుకేశి, నా మనస్సులో ఒక సందేహం కలిగింది. దయచేసి దానిని తొలగించండి. ఇది మీకు నా ఆజ్ఞకాదు. విన్నపము. మహనీయులారా! ఇహలోకంలోనూ పరలోకంలోనూ శ్రేయస్సు కలిగించేది ఏమిటి? దేనివల్ల సజ్జనులలో గౌరవం లభిస్తుంది? మానవుడు సుఖంగా ఉండ కలుగుతాడు? అని ప్రశ్నించాడు. సుకేశి మాటలు విని అ మహర్షులు చక్కగా వితర్కించుకొని ఇహపర శ్రేయస్కరమైన ఉపాయాన్ని వివరించారు. అని పులస్త్యుడు అనగా

ఋషులు: రాక్షసోత్తమా! ఇహ పరలోకాల్లో శ్రేయస్కరమైన విషయమేదో చెప్పెదము. శ్రద్ధగా వినుము. నిశాచరా! ధర్మాచరణ మొక్కటే ఇహపరాల్లో సుఖం కలిగిస్తుంది. దాని ననుష్ఠించిన వారిని సజ్జనులు గౌరవించి పూజిస్తారు అని అన్నారు.