శంకరకృత సుప్రభాతం

పాపబంధ విముక్తికై పరమశివు డనుగ్రహించిన ఆ సుప్రభాత స్తోత్ర మెట్టిది? అని సుకేశి ప్రశ్నించాడు. అప్పుడు రాక్షస శ్రేష్ఠా! శంకరుడను గ్రహించిన సుప్రభాతం వినుము. దీనిని విన్నా, చదివినా అనుస్మరణం గావించినా సరే సర్వపాప విముక్తి కలుగుతుంది.

బ్రహ్మ, మురారి, త్రిపురాంతకుడు, సూర్య చంద్రులు, అంగారక బుధులు, గురు శుక్రులు, శనైశ్చరుడు వీరంతా నాకు సుప్రభాతం అనుగ్రహింతుగాక: భృగువు, వశిష్టుడు, క్రతువు, అంగిరసులు, మనువు, పులస్త్యుడు పులహ గౌతములు, రైభ్య మరీచులు, చ్యవన ఋభులు నాకు సుప్రభాత మొసగుదురుగాక! సనకసనందనసనత్కుమార సనాతనులు, ఆసురి పింగళులు, సప్తస్వరాలు, సప్తరసాతలాలు నాయీ ప్రభాతాన్ని కల్యాణమయం గావింతురు గాక! గంధ గుణంగల పృథ్వి రసాత్మకమగు జలములు, స్పర్శ గుణాత్మకమగు వాయువు, తేజో రూపము గల అగ్ని, శబ్ద గుణకమగు నాకాశము, మహత్తుతో కూడి ఈ ప్రొద్దు నాకు శుభములు చేకూర్చుగాక! సప్త భువనాలు వీరందరూ నాకు సుప్రభాత మనుగ్రహింతురు గాక! ఉదయం నిద్ర నుండి లేవగానే ఈ సుప్రభాత పఠనం శ్రవణం లేక స్మరణం చేసినచో అంతకుముందు రాత్రి సంభవించిన దుస్వప్న దోషాలు తొలగి భగవత్కృప వల్ల మానవుడు శుభాలు పొందుతాడు. ఇందులో సందేహము లేదు.