బలి కేశవాలయ నిర్మాణం

నారదా! దైత్యేశ్వరుడగు బలికి ఈ విధంగా సత్య సంవలితాలయిన ఉత్తమ హిత వచనాలు పలుకగా ఆ విరోచన నందనుడు పితామహుని భక్తితో పూజించాడు. మనుమని పూజలందుకుని పూర్ణకాముడగు నా హరి భక్తుడు మోక్షగామి అయ్యాడు. అలా తృప్తితో పితామహుడు వెళ్లిపోయిన తర్వాత ఆ బలి గృహం చంద్రకాంతులతో తేజరిల్లింది. ఇంద్రుని శిల్పుల శ్రేష్ఠుడు ఆ బలి కొరకు వాసుదేవుని సుందర విగ్రహాన్నిచేసి ఇవ్వగా బలిదానిని ఆలయంలో ప్రతిష్టించి తాను తనభార్యతోకలసి ఆ ఆలయానికి వర్ణ విలేపనం, సమ్మార్జనం (ఊడ్చుట) మొదలయినవి స్వయంగా నిర్వహించాడు. యవలు, శర్కర మొదలయిన వస్తువులు కేశవార్పణం గావిస్తూ అప్రతిమానమైన సేవలతో నా మధు సూదనుని ఆరాధించాడు. బలి భార్య వింధ్యావళి స్వయంగా స్వామి ఆలయంలో దీపాలు వెలిగించగా ఆధీమంతుడు సమర్ధులగు పౌరాణికులచేత, విప్రులచేత ధర్మ ప్రవచనాలు, సంకీర్తనలు ఏర్పాటుచేయించాడు. ఆ విధంగా ఉత్తమమైన ధర్మమైన మార్గాన పయనించే దైత్యేశ్వరుడగు బలి రక్షణ బాధ్యతలు స్వయంగా జగన్నాధుడు దివ్య రూపి అయిన జనార్దనుడు తానే వహించి నిలచాడు. ఆ లోకేశ్వరుడు సుదృఢమైన ప్రాకారంతో రక్షతమైన బలి తల వాకిట చేతిలో వేయి సూర్యుల ప్రభతో వెలిగేగద పట్టుకొని శత్రు సమూహాలను సంహరిస్తూ లోనికెవ్వరనూ పోనీయక కాపుగా నిలచాడు! సకల కల్యాణ గుణాభి రాముడగు నారాయణుడు ద్వారపాలకుడుగా వాకిట నిలబడగా గృహాభ్యంతరంలో బలి రాజేంద్రుడా దేవర్షి సేవితుని వివిధోపచారాలతో భక్తియుక్తుడై ఆరాధించాడు.

అలా ప్రతిదినము శ్రీహరి పాదకమలాలను పూజిస్తూ ఆ బలి చక్రవర్తి ఆ ప్రభువు ఉపదేశ వాక్యాలను స్మరిస్తూ వినయ సుందరమైన ఆదర్శజీవితం గడిపాడు. ఆ దైత్యేశ్వరు డీ పవిత్ర వృత్తాన్ని స్మరిస్తూ మహేంద్రతుల్యుడైన పితామహుడు గావించిన ఇహపరతారకమైన హితవచనాలను సత్య వచనాలను నెమరువేసుకుంటూ కాలం వెళ్ల బుచ్చాడు. వెన్నలాంటి మృదుమానసం గల సజ్జనులు వృద్ధుల హితవచనాలను, వారలు మొదట కటువుగా భాషించినా, లెక్కచేయక ఆదరంతో స్వీకరిస్తారు. అందువలన వారలకు శ్రేయస్సు హర్షామోదాలే కలుగుతాయి. ఇందులో సందేహం లేదు. ఆపదలనే సర్పాలు కాటువేసినవారలకు మంత్రం తెలియని వారలకు వృద్ధుల వాక్యమే ఆ విషాన్ని దించగల పరమౌషధం. వృద్ధులు వచనాలనే అమృతం త్రాగి ఆ ప్రకారం నడచుకునే వారలకు కలిగే తృప్తి సోమపానంలో ఎక్కడ లభిస్తుంది? ఆపదలలో చిక్కుకొని దారిచూపే వృద్ధులు లభించనివారలు బ్రతికియుండియూ చచ్చినవారితో సమానులే. అట్టివారి దుర్దశకు బంధు జనం నిజంగా శోకించాలి. విపత్తు అనే మొసలిచేత జిక్కి దాని నుంచి విడిపింపగల వృద్ధులు, పండితులు లభించనివారలకు శాంతి అంటూ ఎన్నడూ ఉండదు. ఆపదల్లో మునిగి వ్యసనాల సుడిగుండంలో కొట్టుకొని పోయేవారికి వృద్ధాప దేశాలువినా మరేదీ గట్టుకు చేర్చజాలదు. కనుక వృద్ధులగు పెద్దల మాటలను విని ఆచరణలో పెట్టే అదృష్టవంతులకు అక్కడి కక్కడే సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు దృష్టాంతం విరోచన నందనుడైన బలి వృత్తాంతమే.