మరికొన్ని తీర్థాల మహాత్మ్యాలు

ఇంకా సనత్కుమారుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు, అంతట దేవాది దేవుడైన శంకరుడు ఋషుల సమక్షంలో బ్రహ్మ పురోగాములైన దేవతలతో ఆ ఉత్తమ తీర్థ మహిమ వివరించాడు. ఈ సాన్నిహిత సరస్సు సకల తీర్థాలలో ఉత్తమోత్తమమైనది. ఇది నాకు నివాసం కావడం వల్ల ముక్తి ప్రదాయకమైనది. ఇక్కడి నా లింగ దర్శనం చేసినంతమాత్రాన్నే అందరకు పరమపదం లభిస్తుంది. మధ్యాహ్న సమయాన, ప్రతిరోజూ, సముద్ర నదీ సరోవరాల సమస్త తీర్థాలు ఇక్కడ ఈ స్థాణుతీర్థంలోచేరి కలుస్తాయి. ఈ స్తోత్రం ఎవరు శ్రద్ధాభక్తులతో ఇక్కడ చదివి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటారో వారలకు నేనెల్లప్పుడు అందుబాటులో ఉంటాను. సందేహం లేదు. ఆవిధంగా సెలవిచ్చి భగవానుడగు రుద్రుడంతర్ధాన మొందాడు. దేవతలంతా తమతమ నెలవులకు వెళ్ళారు. ఆ స్థాణు లింగ మహిమవల్ల ఆ లింగదర్శనం చేసిన మానవులందరకూ స్వర్గప్రాప్తి కలిగి స్వర్గలోకం మనుష్యులతో నిండిపోయింది. దానితో భయమందిన దేవతలు ఆ మానవుల ఉపద్రవాన్నుంచి తమ్ము రక్షింపమని బ్రహ్మకడకు పోయి మొరబెట్టుకున్నారు. ఆ త్రిదశాధిపతి అయిన బ్రహ్మ, అలాగైతే ఆలస్యముచేయక వెంటనే సరోవరాన్ని మట్టితో పూడ్చి ఇంద్రునకు ఊరట కలిగించండని దేవతలతో చెప్పాడు. అంతట ఇంద్రుడు వారం రోజులపాటు ధూళివర్షం కురిపించి ఆ సరస్సును పూడ్చినాడు. అది చూచి మహేశ్వరుడా లింగాన్ని వటవృక్షాన్ని చేతితో ఎత్తి పట్టుకున్నాడు. అందుచేత ఆద్యతీర్థంలోని నీరు పుణ్యతమమైనది. అచట స్నానం చేస్తే సర్వతీర్థస్నాన ఫలం లభిస్తుంది. ఆ వటలింగేశ్వర సమీపంలో శ్రాద్ధం చేసినవాని పితరులు సంతోషించి దుర్లభమైన ఫలం ఇస్తారు. పూడిపోయిన సరోవరాన్ని చూచి ఋషులక్కడి ధూళిని శ్రద్ధాభక్తులతో తమ శరీరాలకు పూసుకునేవారు. అందువల్ల ఆమునులుకూడా పాపముక్తులై దేవతలకు సైతం పూజ్యులై బ్రహ్మపదానికి వెళ్తారు. సిద్ధమహాత్ము లెవరో ఆ లింగాన్ని ప్రతిష్ఠించిదానిమీద శిలా లింగాన్ని పెట్టారు. తర్వాత చాలాకాలానికి ఆద్యలింగ ప్రభావ స్పర్శతో శిలాలింగం కూడ తనను ముట్టుకున్న వారలకు పరమపద ప్రాప్తి కలిగించింది. ఓ విప్రోత్తములారా! శైలలింగము యొక్క స్పర్శమాత్రాన్నే మానవులు పరమపదం పొందడం చూచి దేవతలు బ్రహ్మతో ఆ విషయం చెప్పుకున్నారు. అది విని విరించి దేవతలకు మేలు చేయుటకై ఆ శిలాలింగం మీద ఒక దానిపై నొకటిగా ఏడు లింగాలు స్థాపించాడు. అప్పటినుంచి శమదమ పరాయణులయిన ముముక్షువులు అక్కడి ధూళిసేవనం వల్లనే పరమపదాన్ని పొందుతున్నారు. కురుక్షేత్రంలో గాలిలో ఎగిరే ధూళి కణాలుకూడ తమస్పర్శతో మహాపాపులను గూడ పవిత్రులను పరమపద సంపాదకులను చేయజాలియున్నవి. ఆ స్థాణుతీర్థంలో ప్రవేశించిన స్త్రీ పురుషాదులకు, వారు తెలిసి ప్రవేశించినా తెలియక ప్రవేశించినా సరే, సర్వ దుష్కృతనాశం కలుగుతుంది. లింగదర్శనంవల్ల వటవృక్ష స్పర్శవల్ల ముక్తి కలుగుతుంది. అచట సన్నిధి జలాల్లో స్నానమాడినవారి కోరికలు సిద్ధిస్తాయి. అక్కడ పితృదేవతలకు వదలెడి తర్పణోదకాల బిందుబిందువూ అనంత ఫలం ఇస్తుంది. లింగానికి పడమర భాగాన నల్ల నువ్వులతో శ్రాద్ధాతర్ఫణాలు ఇచ్చిన వారు మూడు యుగాల పర్యంతం సుఖిస్తారు. మన్వంతర కాలంవరకూ లింగం అక్కడ నిలచియున్నంత కాలం ఆలాంటి వారల పితరులు ఉత్తమోదకాలు పానం చేస్తుంటారు. కృతయుగంలో దానికి సాంనిహిత్య తీర్థమనీ, త్రేతాయుగంలో వాయు తీర్థమనీ ద్వాపర కలియుగాల మధ్య రుద్ర హ్రదమనీ పేర్లు. చైత్రకృష్ణ చతుర్దశినాడు రుద్రహ్రదంలో స్నానం చేసిన వారలకు పరమపద ప్రాప్తి కలుగుతుంది. అచటి వటమూలానకూర్చుని పరమశివుని ధ్యానించిన వారలకు ఆస్థాణువట మహిమవల్ల చింతితమనో రథాలు నెరవేరుతాయి.

సనత్కుమారుని వచనము: స్థాణువటానికి ఉత్తరంగా శుక్రతీర్థం ఉంది. స్థాణువటానికి తూర్పున సోమతీర్థం దక్షిణాన దక్షతీర్థం పడమరగా స్కంద తీర్థం ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాల నడుమనున్నది స్థాణువు. దాని దర్శనమాత్రాన్నే పరమపదం లభిస్తుంది. అష్టమీ చతుర్దశీ తిథులలో వానికి ప్రదక్షిణం చేస్తే అడుగడుగుకూ యజ్ఞఫలం లభిస్తుంది. సందేహం లేదు. ఈ తీర్థాలను మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు, మరుత్తులు అగ్నులు మొదలగు వారందరూ శ్రద్ధగా సేవించారు. ఈ స్థాణు క్షేత్ర రాజ్యాన్ని దర్శించిన ఇతర ప్రాణులందరూ సర్వపాపాలు తొలగి పరమపదం పొందుతారు. దాని సన్నిధిన మహాదేవుడగు శూలపాణి లింగం దానికి ప్రక్కనే ఎప్పుడూ విడవకుండ లింగరూపంలో ఉమాదేవి ఉన్నారు. వానిని చూచి నంతనే మానవుడు సిద్ధి పొందుతాడు. వటవృక్షానికి ఉత్తరంగా మహాత్ముడగు తక్షకుడు ప్రతిష్ఠించిన సర్వకోర్కెలు వర్షించే మహాలింగం ఉంది. వటానికి తూర్పుదిశగా విశ్వకర్మ నిలిపిన గొప్ప లింగాన్ని చూస్తే సిద్ధి లభిస్తుంది. అక్కడే లింగ రూపంలో సరస్వతీ దేవి ఉన్నది. ఆమెకు భక్తితో నమస్కరిస్తే బుద్ధి మేధాశక్తులు లభిస్తాయి. వటానికి ప్రక్కగా బ్రహ్మ ప్రతిష్ఠితమైన వటేశ్వర లింగ దర్శనం పరమపదం ప్రసాదిస్తుంది. అంతట స్థాణువటాన్ని దర్శించి ప్రదక్షిణం చేస్తే సప్తద్వీపా వసుంధరను ప్రదక్షిణించిన ఫలం లభిస్తుంది. స్థాణువునకు పడమర దిశగా నకులీశ గణం ఉన్నారు. దానిని చక్కగా అర్చిస్తే సర్వపాపాలు పోతాయి.

అచటకు దక్షిణంగా రుద్రకర తీర్థముంది. దానిలో స్నానంచేస్తే అన్ని తీర్థాల్లో స్నానంచేసిన ఫలం కలుగుతుంది. దానికి తూర్పున మహాత్ముడైన రావణుడు ప్రతిష్ఠించిన గోకర్ణేశ్వర మహాలింగం ఉంది. ఆషాఢకృష్ణచతుర్దశినాడు ఆ గోకర్ణ స్వామిని అర్చిస్తే కలిగే పుణ్యం ఎట్టిదో వినండి. ఆ లింగార్చనవల్ల తెలిసీ తెలియకచేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ హరుని శుచియై అష్టమినాడు పూజిస్తే బ్రహ్మచర్యవ్రతం చక్కగా పాలించిన ఫలమంతా కలుగుతుంది. కుమారేశ్వరుని మహిమవల్ల కోరిన రూపసౌందర్యం సౌభాగ్యం ధనసంపదలన్నీ నిస్సంశయంగా నెరవేరుతాయి. దానికి ఉత్తరంగా ఉన్న లింగాన్ని పూజించి విభీషణుడు జరామరణాదుల జయించాడు. ఆషాఢ శుక్ల అష్టమినాడు ఉపవసించి ఆ లింగ పూజచేసినచో అమరత్వం లభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా! అక్కడ ఖరుడు (దానవుడు) పూజించిన లింగాన్ని యత్న పూర్వకంగా అర్చిస్తే సకలకోర్కెలు ఫలిస్తాయి. అక్కడే మహేశ్వరారాధన గావించి దూషణుడు త్రిశిరుడుకూడ కోరుకొన్న ఫలాలుపొంది సంతోషించారు. చైత్రశుద్ధ పక్షంలో ఆ రెండు లింగాలను అర్చించిన వారలకు ఆదేవతలు కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారు. స్థాణువటానికి తూర్పుగా హస్తి పాదేశ్వర లింగం ఉంది. దాన్ని దర్శిస్తే జన్మాంతరార్జిత పాపాలన్నీ తొలగిపోతాయి. దానికి దక్షిణదిక్కుగా హారీతముని ప్రతిష్ఠించిన లింగానికి భక్తితో ప్రణమిల్లిన వానికి సిద్ధులు లభిస్తాయి. దానికి దక్షిణంగా మహాత్ముడగు వాసీతుడు ప్రతిష్ఠించిన, ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందిన, సర్వపాపహర లింగంఉంది. ఇక అస్థిపంజరంలో రుద్రునిచేత ప్రతిష్ఠితమైన మహాలింగ రూపం సర్వపాపాలు హరించి భుక్తి ముక్తులు ప్రసాదిస్తుంది. దాని దర్శనమాత్రాన్నే అగ్నిష్టోమ యాగఫలం లభిస్తుంది.

దానికి పడమరగా సిద్ధులచే ప్రతిష్ఠింపబడి సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధేశ్వర లింగమనే ప్రసిద్ధమైన లింగంఉంది. దానికి దక్షిణంగా మహాత్ముడగు మృకండునిచేత ప్రతిష్ఠితమై దర్శన మాత్రాన్నే సకలసిద్ధులు ఇచ్చే శివలింగముంది. దానికి తూర్పున మహాత్ముడగు ఆదిత్యుడు నెలకొల్పిన సర్వకిల్బిషాలు నశింపజేసే శ్రేష్ఠలింగం ఉన్నది. చిత్రాంగదుడనే గంధర్వుడూ అప్సరోమణి రంభ పరస్పరానురాగ బద్ధులై స్థాణుమహాదేవుని దర్శించుటకు వెళ్ళి ఆ మహాదేవుని పూజించి తమ అనురాగానికి ప్రతీకలుగా ఆ వరదుడగు మహేశ్వరుని లింగాలు రెండు ప్రతిష్ఠించారు. ఓ ద్విజులారా! చిత్రాంగదేశ్వర రంభేశ్వరులనే ఆ లింగాలను దర్శించినవారు సుందర సుభగాకారాలతో సత్కులంలో జన్మిస్తారు. దానికి దక్షిణంగా ఇంద్రుడు పూర్వం స్థాపించిన లింగం అనుగ్రహంవల్ల చింతితఫలాలు సిద్ధిస్తాయి. అలాగే పరాశరముని కూడ ఆ స్వామిని ఆరాధించి దర్శించి ఉత్తమకవిత్వ శక్తి సంపాదించాడు. వేదవ్యాసమునికూడ ఆ పరమేశ్వరు నారాధించి సర్వజ్ఞత్వం బ్రహ్మజ్ఞానం పొందాడు. అ స్థాణులింగానికి పడమరదిశన జగత్ర్పాణుడు వాయు దేవుడు నెలకొల్పిన మహాలింగం దర్శనమాత్రాన్నే పాపాలు పోద్రోలుతుంది. దానికి దక్షిణంగా ఉన్న హిమవతేశ్వరలింగం దర్శించిన పుణ్యాత్ములకు సిద్ధులు ప్రసాదిస్తుంది. దానికిగూడ దక్షిణంగా కార్తవీర్య స్థాపితమైన పాపనాశక లింగం చూచినంతనే పుణ్యాలు ప్రసాదిస్తుంది. దానికి ఉత్తరంగా సుపార్శ్వుడు స్థాపించిన లింగాన్ని ఆరాధించి హనుమంతుడు సిద్ధులు గడించాడు. దానికి తూర్పున ఉన్న మహాదేవుని అర్చించి ప్రభవిష్ణువైన విష్ణువు సుదర్శన చక్రాన్ని సంపాదించాడు. దానికి తూర్పున మిత్రావరుణులు సర్వకామ్యాలు తీర్చే రెండు లింగాలు ప్రతిష్ఠించారు. మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు అందరు వీనిని శ్రద్ధాభక్తులతో సేవించి సర్వపాప విముక్తులయ్యారు. స్వర్ణలింగానికి వెనుకభాగాన తత్త్వద్రష్టలయిన ఋష్యాదులు స్థాపించిన లింగాలు లెక్కకుమించినవి. అలాగే దానికి ఉత్తరాన ఓఘవతీనది వరకుగల భూభాగంలో స్వామికి పశ్చిమాన ఒకవేయి లింగాలు స్థాపింపబడినవి. దానికి తూర్పు దిశగా సన్నిహిత సరస్సు వరకుగల భూమిలో మహాత్ములగు వాలఖిల్యములు ఒకకోటి లింగాలు ప్రతిష్ఠించారు. స్వామికి దక్షిణంగా గంధర్వ యక్షకిన్నరులు ప్రతిష్ఠించిన లింగాలు అసంఖ్యాకాలు. వాయువు చెప్పినట్లుగా మూడున్నర కోట్ల లింగాలు ఆ పుణ్యభూమిలో వెలసినవి. ఇకపోతే ఆ స్థాణ్వీశ్వరుని ఆశ్రయించి అచటఉన్న వేలాది రుద్రుల సంఖ్య ఇందులో చేరదు. ఈ విషయాలన్నింటినీ గ్రహించి ఆ స్థాణ్వీశ్వర మహాలింగాన్ని శ్రద్ధాభక్తులతో ఆశ్రయించిన వారల కోరికలన్నీ సిద్ధిస్తాయి. సందేహం లేదు. సకామంగాగానీ లేక నిష్కామంగా కానీ ఆ స్థాణువు ఆలయాన ప్రవేశించిన ప్రతిమానవుడూ ఘోర పాపాలనుంచి ముక్తుడై పరమపదం పొందుతాడు. చైత్రత్రయోదశి నాడు దివ్యనక్షత్రాలు శుక్ర సూర్యచంద్ర గ్రహాలతో కలిసి పరమ పుణ్య దినాన ఆ స్థాణులింగాన్ని సాక్షాత్తు విరించి బ్రహ్మ ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా దానిని ఋషి ముని దేవతాసంఘాలు సేవిస్తూ ఉన్నాయి. ఆ పవిత్ర దినాన ఉపవసించి శ్రద్ధాభక్తులతో ఆ పరమ శివునారాధించిన నరులు పరమపదాన్ని పొందుతారు. అచ్చట ఆ పరమేశ్వరుని సన్నిధానాన్ని భావించుకొని ఆ ప్రదేశానికి ప్రదక్షిణం చేసినచో సప్త ద్వీపాలతోకూడిన ఈ భూమండలాన్నంతా చుట్టివచ్చిన పుణ్యఫలం లభిస్తుంది.