కుంజతీర్థం - ఇతర తీర్థాలు

ఋషులిలా అన్నారు. కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవింపబడే తారా గృహం ఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి. అందుకు లోమహర్షణుడిలా చెప్పసాగాడు. మునులారా! ఉత్తమమైన ఆ తీర్థమహిమనూ ఋషులు దివ్యగాథనూ వినండి. అందు వలన పాపముక్తి కలుగుతుంది. ఒక పర్యాయం సరస్వతీనదీ స్నానార్థం నైమిశారణ్య వాసులైన ఋషులు కురుక్షేత్రానికి వెళ్ళారు. కాని వారికక్కడ ప్రవేశం దొరకలేదు. అంత నాఋషులు యజ్ఞోపవీతికమనే తీర్థాన్ని నెలకొల్పారు. మిగిలిన ఋషులకు గూడ అందులోకి ప్రవేశం దొరకలేదు. రంతుకాశ్రమం నుంచి చక్రతీర్థ పర్యంతంగల ప్రదేశమంతా బ్రాహ్మణులతో నిండి యుండుట చూచి ఆ సరస్వతీనది మునుల వసతికొరకై ఎన్నో లతాగృహాలు నిర్మించి సర్వ ప్రాణుల కల్యాణార్థమై పశ్చిమాభిముఖంగా ప్రవహించసాగింది. తూర్పుప్రవాహంలో స్నానంచేస్తే గంగాస్నాన ఫలం కలుగుతుంది. దక్షిణదిక్కున పవిత్ర నర్మదాస్నానఫలం లభిస్తుంది. పడమర దిశలో యమునానదిగాను, ఉత్తర దిక్కున సింధునదిగాను ఆ నది రూపొందుతుంది. ఇలా ఆ పుణ్యాపగ నలుదిశలలో ప్రవహిస్తుంది. అట్టి సరస్వతిలో మునిగినవానికి సర్వతీర్థ స్నాన ఫలంలభిస్తుంది. అటనుండి విహారమనే పేరుతో త్రిలోకఖ్యాతి వహించిన మహాత్ముడగు మదనుని తీర్థానికి వెళ్ళాలి. అచట శివదర్శనార్థం దేవతలందరూ గుమిగూడగా వారలకు శివ పార్వతుల దర్శనం కాలేదు. అంతట అందరూ కలిసి మహాదేవుని నందీశ్వర గణేశ్వరులను స్తుతించారు. అంతట సంతోషించి నంది, శివుడు ఉమాదేవితో విహార తీర్థంలో విహరిస్తున్నాడని చెప్పాడు. అది విని దేవతలుగూడ తమతమ భార్యలను పిలిపించి వారలతో కలిసి విహరించారు. వారల క్రీడలకు సంతోషించి ఈ విహారతీర్థంలో స్నానం చేసినవారు ధనధాన్యములతోను, ప్రియురాండ్రతోను సుఖిస్తారని ఈశ్వరుడు వరమిచ్చాడు.

అనంతరం దుర్గాదేవికి ఆవాసమైన దుర్గాతీర్థానికి వెళ్ళాలి. అచట స్నానంచేసి పితృ పూజచేస్తే ఎలాటి దుర్గతులు కలుగవు. అక్కడే త్రిలోకవిశ్రుతమైన సరస్వతీ కూపంఉంది. దానిని దర్శించినంతనే పాపాలు నశించి విముక్తి కలుగుతుంది. అక్కడ శ్రద్ధాభక్తులతో దేవ పితృ తర్పణాలుచేస్తే అంతా అక్షయ ఫలప్రదం అవుతుంది. పితృతీర్థం చాలా విశిష్టమైనది. ప్రాచీ సరస్వతిలో స్నానంచేస్తే మాతాపితృ బ్రహ్మహత్య చేసినవాడు, గురుభార్యా సంగమంచేసిన వాడు సైతం పాపరహితులై శుద్ధులౌతారు. దేవమార్గాన (ఆకాశాన) ఉద్భవించి ఆకాశాన ప్రవహించిన ప్రాచీ సరస్వతి పరమదుర్మార్గులను సైతం పవిత్రులను గావిస్తుంది. ప్రాచీ సరస్వతీ తీరాన మూడురాత్రులు గడిపినవారి శారీరికాలయిన దుష్కర్మలు నిలువజాలవు. నరనారాయణులు బ్రహ్మరుద్రాదిత్యులు ఇంద్రాది దేవతలందరూ తూర్పుదిక్కును సేవిస్తూ ఉంటారు. అలాంటి ప్రాచీదిశ నాశ్రయించి శ్రాద్ధకర్మలొనర్చు మానవులకు ఇహపరాల్లో దుర్లభమైనదేదీ ఉండదు. కనుక మానవుడెల్లప్పుడూ, ముఖ్యంగా పంచమీతిథులతో తూర్పుదిక్కును ఆరాధించాలి. పంచమినాడు తూర్పుదిశ నారాధించినవాడు ఐశ్వర్యవంతుడౌతాడు. అక్కడ ముల్లోకాల్లో దుర్లభమైన ఉశనాతీర్థం ఉంది. అక్కడ ఉశనుడు (శుక్రాచార్యులు) పరమేశ్వరుని ఆరాధించి సిద్ధిపొంది గ్రహమండలంలో పూజ్యుడైనాడు. అలా శుక్రసేవితమైన ఆ ఉత్తమతీర్థాన్ని శ్రద్ధగా సేవిస్తే పరమగతి లభిస్తుంది. అక్కడ భక్తితో శ్రాద్ధంచేసినవాని పితరులు తరిస్తారు. సందేహము లేదు. చతుర్దశినా దుపవసించి విధ్యుక్తంగా చతుర్ముఖ బ్రహ్మతీర్థ సరస్సును సేవించినా, చైత్రకృష్ణ అష్టమినాడు దాని నారాధించినా, అట్టివారు ఓ విప్రోత్తములారా! పునరావృత్తిలేని పరమసూక్ష్మ పదమును పొందుతారు. అక్కడ నుండి సహస్రలింగ శోభితమైన స్థాణు తీర్థానికి వెళ్ళి స్థాణువటాన్ని దర్శిస్తే సకల కిల్బిషాలు తొలగిపోతాయి.