రాక్షసుడు పట్టుకొన్న బ్రహ్మచారి

ఆరు పూటల కొక పర్యాయం మాత్ర మేదో ఒక జంతువును చంపి తినసాగాడు. ఒక పరి ఆకలితో నకనకలాడుతూ తిరుగుతూన్న ఆ రాక్షసుడికి అరణ్యంలో పండ్ల కోసం వచ్చిన ఒక బ్రహ్మచారి కంటబడ్డాడు. వెంటనే అతనిని గట్టిగా పట్టుకోగా ఆ బ్రాహ్మణ బాలుడు చావు నిశ్చయమని తలచి మృదువుగా సామవచనాలతో వాని కిట్లా చెప్పాడు: సౌమ్యుడా! నీకు మేలగు గాక. నీవు నన్నేల పట్టుకొంటివో చెప్పుము. నేనేమి చేయవలయునో ఆదేశించుము. అందులకు ఆ రక్కసుడు ఆరు పూటలు ఆహారం లేకుండా ఉన్న నాకు నీవు దొరికావు. నేను నికృష్టుడను. క్రూరుణ్ణి. బ్రాహ్మణ ద్రోహిని, మహాపాపిని, ఆకలి నన్ను దహిస్తున్నదన్నాడు. అందుకా ముని కుమారుడిలా అన్నాడు. నీవు తప్పనిసరిగా నన్ను తిననెంచినచో నేనిప్పుడే ఈ ఫలాలు మా గురుదేవునకు అర్పించి వస్తాను. గురువు గారి కోసమే నేను అడవికి వచ్చాను. ఆయన కొరకై ఏరిన ఫలాలు ఆయన కర్పించుట నాధర్మము. వ్రతము. అది నెరవేర్చి క్షణంలో తిరిగి వస్తాను. కొంచెమాగుము. ద్విజ పుత్రుని మాటలకు ఆ నిశాచరుడు, ఆరు పూటల తర్వాత లభించిన జంతువు ఏదైనా సరే దేవుడైనా సరే నేను తినకుండా వదలను. ఇది నా పాపిష్టి జీవిత చర్య. ఒకవేళ నీవు అంతగా తప్పించుకోదలచితే ఒకే మార్గం ఉంది. అది నీవు చేస్తే తప్పకుండా నిన్ను వదిలేస్తాను అన్నాడు. దానికి బ్రాహ్మణ బాలుడు గురువుకు ధర్మానికి నా వ్రతానికి భంగం కలుగని పని ఏదైనాసరే చేస్తాననగా ఆ దుష్టుడిలా అన్నాడు: ఓ విప్రకుమారా! రాక్షస జాతిలో పుట్టిన నేను ప్రకృతి సిద్ధంగానే కౄరుడను, వివేక హీనుడిని, పాపకర్ముడను. బాల్యంనుండీ పాపాలంటేనేమక్కువ. ధర్మంమీదికి నాబుద్ధి వెళ్లేదికాదు. అలానే నేను మూటకట్టుకున్న పాపాల నుంచి నాకు విముక్తి కలిగే విధానము చెప్పుము. నాపాపాలు నిశ్శేషంగా నశించే ఉపాయం చెప్పావంటే ఎంతటి ఆకలికైనా ఓర్చుకుని నిన్ను వదలుతాను లేదో ఈ ఆరవపూట పాపాచారుడనైన నేను విధిగా నిన్ను భక్షించి ఈ ఆకలి బాధ తీర్చుకుంటాను. నరభక్షకుడనైన నాకు దయ అంటూ లేదు.

ఆ క్రూర రాక్షసునకు కావలసిన తరణోపాయం చెప్పుటకు ఏమీ తోచక ఆ బ్రహ్మచారి గొప్ప విషాదానికి లోనై నాడు. చాలా సేపు విచారించి చేయునది లేక జాతవేదుని (అగ్నిదేవుని)కి శరణాగతుడై తగిన జ్ఞానమొసగుమని అర్ధించాడు. గురు శుశ్రూష తర్వాత శ్రద్ధతో అగ్నిని సేవించిన వాడనగుచో ఆపావకుడు నన్ను రక్షించును గాక! బ్రహ్మ చర్యవ్రతం చక్కగా నిర్వర్తించిన వాడనైతే తల్లిదండ్రులను, గురువును గౌరవించువాడను అయితే గనుక నన్ను అగ్ని రక్షించుగాక. మనోవాక్కాయకర్మలలో గురువుపట్ల అనాదరం లేనివాడనైతే నన్నుజాతవేదుడు కాపాడుగాక! నేను చెప్పినవన్నీ నిజాలైతే ఆ సత్యబలం వల్ల పావకుడు నన్ను కాపాడుగాక! ఇలా మనస్సులోనే శపథాలు గావించుకునినంతనే అగ్నిదేవుని ఆదేశాన్ననుసరించి వెంటనే సరస్వతి అతని ఎదుట గోచరించి ఓ బ్రాహ్మణ బాలకా! భయపడకుము. నిన్నీ ఆపద నుంచి తప్పించుటకు వచ్చాను. నేను నీ నాలుక మీద నిలచి ఈ రాక్షసునకు కావలసిన శ్రేయోపాయాన్ని ఉపదేశించి నిన్ను విడిపించెదను అని అలా చెప్పి అలాగే ఆ రాక్షసునకు కనుపించకుండా బాలకుని నాలుకపై నిలచి ఇలా చెప్పసాగింది: ఓనిశాచరా! నీకు నీలాంటి పాపులకు శ్రేయస్సు కలుగజేసే విధానము చెబుతున్నా వినుము. సమస్త పాపాలు పోగొట్టి పుణ్యం కలుగజేసే ఈస్తవం ప్రతిదినమూ ప్రాతః కాలాన మధ్యాహ్న దినాంతము లందు జపించ వలయును. ఎల్లవేళలందు జపిస్తే శాంతిని పుష్టినీ కలిగిస్తుంది ఇందుకు సందేహం లేదు.