వామన మహా పురాణము
అదితి చేసిన వాసుదేవ స్తుతి
అదితి ఇలా స్తోత్రం చేసింది - “దివ్య కమలాల గర్భస్థ శోభను పరిహసించు సౌందర్య నిధీ! నీకు జయమగుగాక! సంసార తరువును ఛేదించు కుఠారమా నీకు జయమగుగాక! పాపాలనే కట్టెల ప్రోవును భస్మం గావించు అగ్నిదేవా! నీకు జయమగుగాక! పాప సంఘాలను నిరోధించు ప్రభూ నీకు జయము జయము! దివ్య విగ్రహుడవగునో భాస్కరా! సూర్యమండలాంతర్వర్తి నారాయణా నీకు నమస్సులు! త్రిలోక ఐశ్వర్య నిధీ! నీకు ప్రణామం! ఈ చరాచర జగత్తు కంతకూ నీవే మూలం. సర్వేశ్వరుడవు. ఓ విశ్వమూర్తీ! నన్ను కాపాడుము. జగన్మయుడవూ, జగత్పతివీ అయిన నీవల్లనే ఇంద్రుడు సర్వస్వం కోలుపోయి శత్రువులచే పరాభవం పొందాడు. అందుచేత నేను నీ మరుగున చేరాను. నన్ను రక్షించుము. ఇలా స్తోత్రం చేసి ఆ దేవమాత శ్రీమన్నారాయణుని ప్రతిమను రక్త చందనములతో అలంకరించి కరవీరమాలతో పూజించి ధూపదీపాదులచే నర్చించి అజ్యసంమిశ్రితమైన శాల్యన్నం నైవేద్యం చేసింది. ఇంద్రుని క్షేమానికై ప్రభువును స్తుతిస్తూ ఆ దేవజనని నిర్జలోపవాసం గావించింది. రెండవ రోజు విధి విహితంగా స్నాన పూజాది కాలు నిర్వర్తించి బ్రాహ్మణులకు స్వర్ణం, తిలలు, అమృతం దానం చేసి ప్రణామం గావించింది. అంతట సంప్రీతుడై ఘృతార్చి అయిన ఆ సూర్యనారాయణుడు సూర్యమండలా న్నుంచి వెలువడి ఆ దక్షకుమారి ఎదుట నిలచి యిలా అన్నాడు - “ఓ దాక్షాయణి! నీవు గావించిన వ్రతానికి సంతోషించాను. నా ప్రసాదం వల్ల నీ కోరిక నెరవేరుతుంది. ఓ దేవజననీ! నీపుత్రులకు వారల రాజ్యం ఇచ్చెదను. సందేహించవద్దు. నీ కడుపున పుట్టి దైత్యులను నిర్మూలిస్తాను.” వాసుదేవుని మాటలకు గడగడవడకుచు ఆ అదితి, అ జగన్మూర్తితో ఇలా అన్నది: “ప్రభో! స్థావరజంగమ సృష్టిని ఉదరంలో పెట్టుకొని దుర్ధరుడవుగా నుండే నిన్ను నే నెలా కుక్షిలో ధరించగలను? తండ్రీ! జగన్నాథా! ముల్లోకాలూ ధరిస్తూ పర్వత సమూహ సహితమైన సాగర సప్తకాన్ని పొట్టలో నింపుకున్న నిన్నెవరు భరించగలరు? కాబట్టి ఓ జనార్దనా! నాకు కష్టం కలగని విధంగా ప్రయత్నించు. శక్రుని మరల నీ వన్నట్లు నేను దేవతలకూ అసురులకూ దుర్ధరుడనే అయినప్పటికీ నీ కడుపుననే పుడతానమ్మా! యోగబలంతో నన్నూ ఈ లోకాలనూ పర్వతాలనూ కశ్యపునితో సహా నిన్ను కూడా కలుపుకొని నీ కడుపులో నుండి జన్మిస్తాను. దిగులు పడవద్దు. నీకెలాటి కష్టమూ కలుగనీయనమ్మా! నేను నీగర్భాన జనించుటతోనే రాక్షసలోకం అంతా నిర్జీవమైపోతుంది. సందేహింపకుము. అనిచెప్పి ఆ విధంగా ఆ దేవమాతను ఊరడించి ఆశత్రుమర్దనుడామె గర్భంలోతన సమస్తతేజముయొక్క సూక్ష్మాంశంతో, ఇంద్రుని హితార్థమై ప్రవేశించాడు.