వామన మహా పురాణము
బ్రహ్మతో కలి మొర
అటుపిమ్మట పులస్త్యుడు తరువాతి కథను కొనసాగించాడు - ఓ నారదా! అలా దేవతలంతా స్వర్గం వదలిపెట్టి బ్రహ్మ లోకానికి వెళ్లిన తర్వాత బలి రాజేంద్రుడు ముల్లోకాలను ధర్మం తప్పకుండా పరిపాలించాడు. జగత్తు అంతా కృతయుగంగా మారిపోవడం గమనించిన కలి భయంతో తన స్వభావానికి తగినట్టుగా సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ కాళ్లు పట్టుకున్నాడు. అక్కడ ఇంద్రాది దేవతలు, రాక్షసులతో కూడి ఉన్న బ్రహ్మ తన తేజస్సుతో, పరిసరాన్నంతా వెలిగింపజేస్తూ దర్శనమిచ్చాడు. బ్రహ్మ రెండు పాదాలు పట్టుకొని ఆ కలి, “ప్రభో! రక్షించండి. బలి నా స్వభావానే నాశనం చేశాడని గోలపెట్టాడు. అదివిని ఆ మహాయోగి విరించి “పిచ్చివాడా! నీవొక్కడి స్వభావాన్నే కాదు, ఆ బహాబలి మొత్తం లోక స్వభావాన్నే నశింపజేశాడు. చూడటం లేదా? ఇదుగో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, చివరకు సూర్యుడు కూడ ఎలా తేజస్సు కోల్పోయి కూర్చున్నారో! చూడు. ఈనాడు ఆ ఒక్క సహస్రశీర్షుడు సహస్రపాదుడు అగు శ్రీహరి దక్క ఆ బలి అభ్యుదయాన్ని నిరోధించగలవాడీ మూడు లోకాల్లో మరొకడులేడు. ఆ అవ్యయుడైన లక్ష్మీపతియే, ధర్మనిరతుడైన ఆ బలి చక్రవర్తి రాజ్యం - భూలోకం స్వర్గం - సంపద కీర్తి అన్నీ హరించగల సమర్ధుడని చెప్పగా విని ఆ కలి దీనవదనాలతో ఉన్న ఇంద్రాది దేవతలను చూచి చేయునది లేక విభీతక అరణ్యానికి వెళ్లాడు. నారదా! అలా కలి వినిర్గమించిన తర్వాత ముల్లోకాల్లో కృతయుగం వ్యాపించగా, చాతుర్వర్ణాల వారిలోనూ ధర్మం నాలుగు పాదాలా నిలచింది. అహింస, తపస్సు, సత్యం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దయ, దానం, అక్రౌర్యం, సేవ, త్యాగరూపాలైన యజ్ఞకర్మలు సర్వత్రా వెల్లి విరిశాయి. బలవంతుడైన బలి, కలినే కృత యుగంగా మార్చేశాడు! ద్విజులు స్వధర్మ నిరతులై తమ ఆశ్రమ ధర్మాల్లో స్థిరులైపోయారు. నరపతులు అప్రమత్తులై ప్రజాపాలనం చేయసాగారు. అలా ముల్లోకాలూ ధర్మంలో స్థిరపడి నిలవడంతో, వరధాత్రి అయిన త్రిలోకలక్ష్మి ఆ దానవేశ్వరుని కడకు వెళ్లింది. ఇంద్రుని వదలి తనవద్దకు వచ్చిన ఆలక్ష్మిని చూచి బలి - “అమ్మా నీ వెవరు? ఎందుకు వచ్చినావని ప్రశ్నించాడు.
ఆ బలి మాటలు విని కమలాలమాల ధరించిన ఆ లక్ష్మీదేవి యిలా అన్నది. ఓ బలీ! నే నెవరైనదీ, రాణినైన నేను విధిలేక నీవద్దకు ఎందుకువచ్చినదీ చెబుతున్నా వినుము. అప్రమేయ బలశాలి అయిన చక్రగదాధరుడు ఇంద్రుని వదలి వెళ్ళిపోవడంతో నేను నీ వద్దకు వచ్చాను. ఆ జనార్ధనుడు సౌందర్య వంతులైన నలుగురు యువతులను నిర్మించాడు. వారిలో ఒకతె తెల్లని రూపంతో తెల్లని వస్త్రాలు, తెల్లని మాలలు, పరిమళ ద్రవ్యాలు ధరించి సత్వ గుణ ప్రధానయై తెల్లని ఏనుగు మీద ఆసీనురాలై యుంటుంది. రెండవ యువతి రాజసగుణ ప్రధానయై ఎర్రని దేహకాంతితో, ఎర్రని వస్త్రాలు, పూలమాలలూ ఎర్రని చందన లేపనాలూ ధరించి ఎర్రని అశ్వాన్ని ఎక్కి ఉంటుంది. తామస గుణాశ్రయురాలైన మూడవ యామె పసుపు పచ్చని శరీర కాంతితో, పీతాంబరం, పీతమాల్యాలు, పీత గంధానులేపనం ధరించి బంగారు రథం మీద ఉంటుంది. నాలుగవ రమణి త్రిగుణాత్మకురాలై నీల వస్త్ర నీలమాల్య నీలగంధ లేపనం ధరించి నల్లని వృషభంమీద శోభిస్తూ ఉంటుంది. వీరిలో సత్వ గుణాత్మికయై శ్వేతవర్ణంలో శ్వేత గజారూఢయైయున్న సరస్వతి విరించి, చంద్రుడు, ఆయన అనుచరుల కడకు వెళ్లి చేరింది. రక్తవర్ణంతో రక్త వస్త్రాదులతో ఎర్రని గుర్రం మీద విరాజిల్లే రజో గుణాత్మికను దేవరాజైన ఇంద్రునకు మనువునకు ఆయన లాంటి వారలకు ప్రదానం చేశాడు (హరి). పీతాంబరాన్ని ధరించిన కనకస్యందనం మీద నుండే సుందరిని ప్రజాపతులకు శుక్రాచార్యునకు వైశ్యులకూ యిచ్చాడు. నల్లని తుమ్మెద కాంతితో నీల వస్త్రాదులు ధరించి నీల వృషభాన్నెక్కిన నాలుగవ యామెను దానవులు, నిరృతులు, విద్యాధరులు, శూద్రులూ గ్రహించారు. బ్రాహ్మణులు శ్వేత వర్ణాంగిని సరస్వతి అని పిలుస్తూ బ్రహ్మతో కలసి యజ్ఞయాగాల్లో మంత్రాలతో స్తోత్రం చేస్తారు. ఓ దైత్య శ్రేష్ఠా! రక్తాంబర ధారిణిని క్షత్రియులు జయలక్ష్మి అని పేర్కొని మనువు ఇంద్రుడాదిగా గలవారలా యశస్వినిని కొనియాడుతుంటారు. బంగారు కాంతిగల సుందరిని వైశ్యులు ప్రజాపతులు, శుక్రుడూ లక్ష్మి అనేపేరుతో ఆరాధిస్తారు. దైత్య, విద్యాధర, శూద్రాదులు నీల వర్ణాంగిని శ్రీదేవిఅంటూ భక్తితో స్తోత్రంచేస్తారు. ఈవిధంగా ఆశంఖ చక్ర గదాధరుడా నలుగు రనూ వేర్వేరుగా విభజించాడు.
“అక్షయాలైన నిధులు ఈ నలువురు నిన్నాశ్రయించి యున్నవి. ఆ ప్రకారం ఇతిహాస పురాణాలు, వేదాలు, వేదాంగాలు అరువది నాలుగు కళలు శ్వేతకు సంబంధించినవి. మహా పద్మనిధిగా రూపొందినవి. వెండి, బంగారాలు, ముత్యాలు, రథాశ్వ గజ భూషణాలు, శస్త్రా స్త్రాదికాలు, వస్త్రాలు “పద్మ” నిధి అనుపేర రక్తవర్ణాంగికి చెందినవి. గోమహిష సంతతులు, ఖర ఉష్ట్రాదులు, భూమి, ఓషధులు పశువులు “పీత”కు చెందిన మహానీల నిధిలోనివి. ఈ జాతులన్నింటికీ చెందినవి ఇంకా మిగిలి యున్నవీ అన్నీ కలిసి, నీలవర్ణాంగికి చెందినవై “శంఖ” నిధిగా పరిగణింపబడతాయి. ఓదానవ వీరా! ఈ నాలుగు శ్రేణులకు చెందిన మానవుల ప్రత్యేక లక్షణాలను ఇక తెలుసుకొనుము. చెబుతున్నాను. సత్య, శౌచ, నిరతులై, మఖ దానాది క్రియలలో వినోదించు నరులు మహాపద్మ నిధిని ఆశ్రయించువారు. దర్పం అభిమానాలతో యజ్ఞాలు చేస్తూ స్పురద్రూపులై ఉదారంగా దక్షిణ లొసగుచూ సర్వసామాన్య సుఖాలనుభవించువారు పద్మనిధికి చెందిన వారు. మహానీల నిధికి చెందిన నరులు సత్యాలు, అసత్యాలు పలుకుతూ, దానం చేయుట లోను, సంపాదనలోను ఆసక్తి కలవారై, న్యాయ, అన్యాయపరులై ఉంటారు. ఇక శంఖనిధికి సంబంధించినవారలు నాస్తికులు, శౌచహీనులు, కృపణులు (లోభులు) భోగవిముఖులై చౌర్య, అనృతాల పట్ల ఆసక్తి గలిగి ఉంటారు. ఓ బలీ! ఈ నిధులకు చెందిన మానవుల స్వరూప స్వభావాలు చెప్పాను. ఆ నలుగురు యువతులలో రజో ప్రాధాన్యం కలిగిన “జయశ్రీ” అనుదాననునేను. నిన్నాశ్రయించవచ్చితిని. సాధు జనులను మోహించిన నా ప్రతిజ్ఞ ప్రకారం నేను మహాశౌర్య నిధులగు వారినే తప్ప నపుంసకుల ఎడ కన్నెతిగూడాచూడను. శౌర్యంలో నీతోసమానుడుగానీ, నిన్నుమించినవాడుగానీ ముల్లోకాలలో ఎవడూ లేడు. నీ ఈ బలాధిక్యాన్ని చూచి మురిసిపోయి వచ్చాను. యుద్ధంలో విక్రమించి ఇంద్రుని సైన్యం నిర్జించిన మహావీరుడవు.
“ఏవంగుణ సంపన్నుడవైన నీ అపూర్వ సత్త్వం, సర్వాధిక మానిత్వ శౌండీర్య వీర్యాలు చూచి పరమ ప్రీతితో నీవద్దకు వచ్చాను. దైత్య శిరోమణీ! హిరణ్యకశిపుని వంగడంలో జన్మించిన నీ విలాంటి ఘనకార్యాలు చేయడంలో ఆశ్చర్యమేమాత్రమూలేదు. నీ ప్రపితామహుడైన దితిజుడు కూడ పరులపహరించిన త్రైలోక్య రాజ్యలక్ష్మిని, శత్రు నిర్మూలనం గావించి విక్రమించి వశపరచు కున్నాడు!” ఈ విధంగా దానవేంద్రుడగు బలికి తన విషయం వివరించి సర్వత్రా వెలుగు వెన్నెలలు వెదజల్లుతూ ఆచంద్రముఖియగు జయలక్ష్మి ఆ చక్రవర్తి ఇంట్లో ప్రవేశించి విభూతులు ప్రదర్శించింది. వెంటనే హ్రీ (లజ్జ) శ్రీ, ధీశక్తి, ధృతి (ధైర్యలక్ష్మి) కీర్తి, ప్రభ, (వెలుగు) మతి, క్షమా, ఐశ్వర్యం, విద్య, నీతి, దయ, శ్రుతి, స్మృతి, యశోమూర్తి, శాంతి, క్రియాశక్తి, పుష్టి, తుష్టి, రుచి, సత్వాశ్రయాలైన యితర మంగళకర సిద్ధులన్నీ బలి అండజేరి సుఖంగా విశ్రమించాయి. సద్బుద్ధీ సుబుద్ధీ అయిన ఆమహనీయుడగు బలి రాజేంద్రుడు అలా సకల విభూతులు తన్నాశ్రయించగా మృదుభాషి, మధురభాషి, సత్యభాషియై తపో యజ్ఞాలు చేస్తూ భూరి దానాలు చేస్తూ, తన వారలను రక్షించుకుంటూ, త్రిలోకపాలనం గావించాడు. మహర్షే! ఆ దానవేంద్రుని ఆదర్శ పరిపాలనలో ప్రజలు అకలి దప్పికలెరుగరు. దైన్య మాలిన్యాలంటూ ఎక్కడాలేవు. మానవ సమాజమంతా నియమ పాలనం చేస్తూ ధర్మ విహితంగా సుఖాలను అనుభవిస్తూ ద్విగుణీకృతమైన శోభతో విరాజిల్లింది.