వామన మహా పురాణము
వామనుని ఉపనయనం
ఆ ప్రభువుకు యజ్ఞోపవీతం పులహుడొసంగగా నేను (పులస్త్యుడు) తెల్లని కట్టు వస్త్రం యిచ్చాను. అగస్త్యుడు కృష్ణాజినం, భరద్వాజుడు మేఖల (మొలత్రాడు) ఇచ్చారు. పాలాశ దండం బ్రహ్మపుత్రుడు మరీచి యివ్వగా, అక్షమాలను వసిష్ఠుడిచ్చాడు. అంగిరసుడు కౌశ్యం (దర్భ కూర్చ) ఇచ్చాడు. రఘు మహారాజు ఛత్రం సమర్పించగా నృగ మహారాజు పావుకోళ్లు నివేదించాడు. మహాతేజస్వియగు ఆ వటునకు బృహస్పతి కమండలం అర్పించాడు. ఇలా ఉపనయన కర్మ సంపన్నంగావించుకుని ఆ భూతభావనుడగు భగవంతుడు మహర్షులు స్తోత్రాలు చేస్తూండగా సాంగ వేదాధ్యయనం గావించాడు. అంగిరసుడైన భరద్వాజుని వద్ద మహాధ్వని యుక్తమూ మహదాఖ్యానాలతో కూడిన సామవేదం గంధరసహితంగా అభ్యసించాడు. ఓ నారదా! వేద శాస్త్ర సముద్రమైన ఆ భగవంతుడు లోకాచారాన్ని ఆచరణ ద్వారా ప్రవర్తింప జేయుటకు మాత్రమొక నెలరోజులలోనే శ్రుతి పాండిత్యాన్ని గడించాడు. అలా సర్వ శాస్త్ర నైపుణ్యాన్ని పొందిన అనంతర మా అవ్యయుడు అక్షరుడునగు కైతవ బ్రహ్మచారి బ్రాహ్మణ శ్రేష్ఠుడగు భరద్వాజునితో ఇలా అన్నాడు: బ్రహ్మన్! నా కనుజ్ఞ యిచ్చినచో మహా అభ్యుదయ ప్రదమైన కురుక్షేత్రానికి వెళ్లగలను. అక్కడ దైత్యేయుడగు బలి పుణ్యప్రదమైన అశ్వమేధ యాగం చేస్తున్నాడు. పుణ్యవర్ధకాలయిన నా తేజో అంశాల ప్రభావం వల్లనే వాటి సన్నిధానాన్ని పొంది అతడు భూలోకంలో ఆ యజ్ఞం చేయగలుగుచున్నాడు. వానినన్నింటినీ అచట చూడవచ్చు. నాతో రండు. అదివిని భరద్వాజుడుఇలా అన్నాడు. విష్ణో! నీకునేను ఆజ్ఞయిచ్చువాడను కాను. నీ యిష్టం వచ్చినట్టు ఉండవచ్చు, వెళ్లవచ్చు. మనమంతా బలి యజ్ఞానికి వెళ్లుదాము. చింత వలదు. అయితే నేను నిన్నొకటి అడుగుతాను. అది నాకెరిగింపుము. ఓ పురుషోత్తమా! ఇప్పుడు నీవు అన్నటువంటి తేజో అంశాలు విభూతులలో ఏఏ స్థానాల్లో ఉంటాయో, ఏఏ చోట సన్నిహితుడవై ఉంటావో వాటన్నింటి వివరాలు దయచేసినాకు చెప్పుము. వాటిస్థానం తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను!