వామన మహా పురాణము
వామనుని జగన్మయ దివ్యరూపం
దానజలం చేతిలో పడగానే వామనుడు ముల్లోకాలు ఆక్ర మించేందుకు జగన్మయమైన బహు రూపాన్ని ధరించాడు. పాదాలతో, పిక్కలతో ఆకాశాన్నీ సత్య తపో లోకాలను మోకాళ్లతో, మేరు మందరాలను తొడలతో ఆ త్రిలోక ప్రణమ్యుడు కప్పివేశాడు. నడుములో విశ్వేదేవతలు, మరుత్తులు, వస్తి శిరోభాగాల యందు, లింగం (మేఢ్రం)లో మన్మథుడు, వృషణాలలో ప్రజాపతులు, కుక్షి (పై పొట్ట)లో సప్త సాగరాలు, జఠరం (క్రింది పొట్ట)లో యజ్ఞాలు భువనాలు ఇష్టాపూర్ణాలు మొదలగు వైదిక క్రియలన్నీ కడుపు మీది మూడు పొరలలో నదులు నిలిచాయి. వీపు భాగాన వసువులు, భుజాలలో రుద్రులు, బాహువులలో పది దిక్కులు, చేతులలో అష్ట వసువులు, హృదయంలో బ్రహ్మ, హృదయాస్థులలో వజ్రాయుధము, లక్ష్మి, సముద్రాలు, వక్షోజాల మధ్య భాగాన చంద్రుడు మనస్సులో, మెడలో దేవమాత అదితి, కంఠపు మూడు పొరలలో కనిపించాయి. ఆ ప్రభువు నోటిలో అగ్నుల తోటి విప్రులు, పెదవులలో సంస్కారాలు, లలాట దేశాన లక్ష్మితో కలిసి ధర్మార్థ కామ మోక్ష శౌచ సమన్వితాలయిన శాస్త్రాలు, చెవులలో అశ్వినీ దేవతలు, ఊర్వులలో మాతరిశ్వుడు, సర్వ సంధులలో మరుత్తులు, దంతములలో సకల సూక్తాలు, నాలుక మీద సరస్వతి, నేత్రాలలో చంద్ర సూర్యులు, కృత్తిక మొదలగు నక్షత్రాలు, కనురెప్పలలోను కనిపించాయి. ఆ దేవదేవుని శిఖా భాగాన ధ్రువుడు ఉపవిష్టుడయ్యాడు. రోమకూపాల్లో తారకలు రోమాల్లో మహర్షులు నిలిచారు. సర్వగుణమయుడు, సర్వభూతమయుడు నగు నా భగవంతుడు ఒకే అడుగులో చరాచర ప్రాణులతో నిండిన భూమినంతటినీ ఆక్రమించగా ఆవిశ్వరూపుని కుడిరొమ్ము చంద్రుడైనది. ఎడమ రొమ్ము సూర్యుడైనది. ఆ ప్రభువు పైకి పెరిగే కొలదీ సూర్యచంద్రు లాయన బొడ్డుకు ఎడమ కుడి భాగాల నిలచారు.
రెండవ పాదం మొదటి సగంతో స్వర్గ మహర్లోక జన తపో లోకాలను కప్పి, మిగిలిన సగంతో వైరాజాన్నీ, మిగిలిన మధ్య భాగంతో అంబరాన్ని ఆక్రమించి అనంతమైన అంతరాళాన్ని నింపి, బ్రహ్మాండ కటాహాన్ని (పైపెంకును) భేదించి నిరాలోకమైన (గాఢాంధకార పూరితమైన) లోకానికి ద్వితీయ చరణాన్ని సాచి, నిలిపాడా విరాట్పురుషుడు. రెండవ పదాంగుళుల తాకిడికి భిన్నమైన బ్రహ్మాండపు పై నుండి ఆ సాదం వెంట క్రిందికి జలజల గొప్ప ప్రవాహం నిర్గమించింది. వక్ర గతితో పారిన ఆ జలం కుటిల అయింది. అదే విష్ణుపదీ అనే పేరుతో (విష్ణు పాదోద్భవ) విఖ్యాతమైంది. నారదా! పవిత్రోదకాలనే సురనది (గంగ) అని భక్తితో తాపసులు సేవిస్తారు. మూడవ పాదానికి చోటులేకుండుట చూచి ఆ ప్రభువు పెదవులదురుచుండగా బలిని సమీపించి దైత్యేంద్రా! ఋణ శేషం బంధనకారి అవుతుంది. మూడవ చరణానికి భూమిని చూపించుము. లేదా బంధనమునకు సిద్ధపడుమని హెచ్చరించాడు. మురారి మాటలకు బలిపుత్రుడు బాణుడు నవ్వి హేతుబద్ధంగా ఆయనతో యిలా అన్నాడు. జగన్నాథా! ఈ భూమండలాన్ని మిగిలిన భువన షట్కాన్నీ నీ విరాడ్రూపంతో అల్పతరంగావించి నిశ్శేషమైన దాని నెట్లు కోరగలవయ్యా! నీవు సృష్టించినదంతయు అదియే గదా! (నీ సృష్టిలోపాన్ని గుర్తించక) ఇంకను భూమిని ఎక్కడ నుంచి తెచ్చి యివ్వమందువు? ప్రభూ! నీవు సృష్టించిన భూమండలం భువనాంతరాలతో సహా సర్వం నాతండ్రి నీకు ధారబోశాడు. నీ సృష్టిలో మిగిలిన దేదియు లేదే? ఇంకను కపట వచనాలు పలుకుతూ బంధిస్తానందువేల? నీవు సృష్టించినది లేనప్పుడూ నీకు సృష్టించుటకు శక్తిలేనప్పుడూ దైత్యేశ్వరు డేమి చేయగలడయ్యా! ఆయన ప్రస్తుతం చేయ గలిగినది ఆయనకు చేతనైనది ఒక్కటే. నిన్ను మనసార పూజించడమే. కనుక బంధన ప్రసక్తి వదలి, ఆయనను అనుగ్రహించి ప్రసన్నుడవుకమ్ము. దేశము కాలము పాత్ర నెరిగి గావించిన దానం అక్షయ మవుతుందని శ్రుతులలో నీవే చెప్పలేదా? ఓ చక్రధరా! మా తండ్రి చేసినది భూదానము, పాత్ర యాజితాత్మవూ, దేవదేవుడవైన నీవు. సమయమా, చంద్రజ్యేష్ఠా మూలా నక్షత్రాల పవిత్రయోగం! ఇకస్థానమా క్షత్రాలలో తలమానికం కుక్షేత్రం, సుప్రసిద్ధం! సర్వజ్ఞుడవైన నీకు బుద్ధి హీనులమైన మేము, మంచి చెడులను, విధి నిషేధాలను గురించి ఏమి చెప్పగలమయ్యా? వేదాలను మొదట సృజించినవాడవు. సదసద్విలసితమైన విశ్వంలో సర్వత్రా నిండి యున్న ప్రభువువు, నీకు తెలియని దేమి కలదు? మొదట్లో పొట్టి బొట్టెడివిగా వచ్చి మూడడుగులు యాచించావు. నిజంచెప్పు ప్రభో! లోకత్రయ పూజ్యమైన విశ్వరూపం దాల్చి మూడడుగులకు బదులు మూడులోకాలూ నీవు తీసుకోలేదటయ్యా? ఇంకా వంచనమాట లెందుకు? నీ మూడు అడుగులకూ మూడులోకాలు చాలక పోవడంలో ఆశ్చర్యంలేదు. ఒక్క చరణంతోటే ముల్లోకాలనూ లంఘించలేవా? లోకేశ్వరా! ఇదంతా నీ లీల మాత్రమే కాదా? ఈ భూమిని చిన్న దానిగా నీవే సృష్టించి తర్వాత ఇప్పుడు బలిని బంధిస్తావా? పద్మనాభా! మాధవా! ఇదెక్కడి ధర్మమయ్యా? అవును నిజమే. పెద్దలు తమకు నచ్చినది చేస్తారు. వారేమి చేసినా చెల్లుబడి అవుతుంది.