వామన మహా పురాణము
దేవతలకు విష్ణువు వరమిచ్చుట
బ్రాహ్మణ శ్రేష్ఠుడు బ్రహ్మజ్ఞుడునై కశ్యపు డొనర్చిన ఆ ఉత్తమస్తోత్రాన్ని విని సంతోషించి నారాయణుడు స్పష్టంగా చక్కని మాటలలో ఓ దేవతలారా! మీకు కావలసిన వరమడుగుడు; యిచ్చెదను. మీకు కల్యాణమగుగాక అనెను. అప్పుడు కశ్యపుడు ఓ దేవశ్రేష్ఠా! మీరు మాయందు ప్రసన్నులగుట నిశ్చయము. దయచేసి ఇంద్రునకు తమ్ముడవుగా, అదితికి పుత్రుడవుగా, జ్ఞాతిలోకానికి ఆనందవర్ధనుడవుగా జన్మించుము. దేవమాత అదితి కూడ అదే సంకల్పంతో నా వరదేశ్వరుని తన గర్భమున జన్మించుమని యాచించినది. దేవతలందరు నా మహేశ్వరుని తమకు అధినాథుడుగా రక్షకుడుగా నుండ వలసినదని శరణువేడిరి. అని పలికెను అంతట విష్ణుడు కశ్యపునితో సమస్త దేవతలలో, మీ శత్రువులు నందరను ముహూర్త మాత్రాన సంహరించి యజ్ఞభాగభుక్కులైన దేవతలకు హవ్యాలు, పితృ దేవతలకు కవ్యాలు మరల యిప్పించగలను. మీరు మీమీ ప్రదేశాలకు మరలి వెళ్ళుడనెను.
ప్రభవిష్ణుడైన విష్ణుదేవుని మాటవిని సంతుష్టాంతరంగులై అదితి కశ్యపులతో కూడిన విశ్వేదేవతలందరు నా దేవదేవునికి పూజా నమస్కారాదులర్పించి త్వరగా తూర్పుదిశగా పయనించి విశాలమైన కశ్యపాశ్రమానికి వెళ్లారు. కురుక్షేత్రవనమైన ఆ అశ్రమానికి వెళ్లి దేవమాత అదితిని ప్రసన్నురాలిని గావించుకొని ఆమెను తపో దీక్షలో నిలిపిరి. అసాధ్వియు పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. సర్వ కోర్కెలు తీర్చే ఆ వనం ఆమె పేర ప్రసిద్ధి చెందింది. వాక్ నియమంతో వాయు భోజనం చేస్తూ తపించే ఆమె, రాక్షసులచే నోటువడిన తన పుత్రుల తలంచుకొని తన మాతృత్వము వ్యర్థమైనదని నిర్వేదం పొందినది. ఆమె ఆవేదనకు శ్రీహరి మీద ప్రేమతోడుకాగా పరమార్థ బోధకాలయిన శ్లేషవచనాలతో ఆమె సర్వ లోక శరణ్యుడు, భక్తవత్సలుడు, దేవదైత్యమయుడు ఆదిమధ్యాంతస్వరూపి అయిన మహావిష్ణువు నిట్లు స్తుతించెను.