వామన మహా పురాణము
భోజ్యం - తాజ్యం
మహావీరా! ఎల్లపుడు ధర్మమునందు నిలకడ గల మానవుడు భుజింప దగినవేవో, వర్ణింప దగినవేవో చెప్పుచున్నాము వినుము. నూనె లేక నేతిలో బాగా వండబడిన అన్నము చాల కాలము క్రిందటి దైనను తినవచ్చును. నూనె, నేయి తగలకుండ వండ బడిన బియ్యపు అన్నము, పాయసాన్నము, కుందేలు, ఏదుపంది, మొసలి, ముళ్ళపంది, తాబేలు మాంసము, చేపలు పప్పులు కూరలు మొదలగు వానిని తినవచ్చునని మనువు ఆదేశము. మణిరత్న ప్రవాళాలు శిలా దారుమయాలు, తృణధాన్యాలు, గడ్డలు, జల్లెడ, జింక చర్మము, నూతన వస్త్రాలు, అన్నిరకముల నారగుడ్డలు (చెట్ల బెరడుతో చేసినవి) నీటితో కడిగి శుద్ధిచేయాలి. జిడ్డు తగిలిన వస్తువులన్నింటిని నువ్వుల నూనోతో కాచిన కషాయంలో శుభ్రం చేయాలి. నూలు ఉన్ని బట్టలను బూడిద కలిసిన నీటితో శుద్ధిచేయాలి. ఏనుగుదంతాలు, కొమ్ములు పరిశుద్ధములే. మట్టిపాత్రలకు అగ్ని సంస్కారం శుద్ధిసాధనం. భిక్షాటన వల్ల తెచ్చిన అన్నం, పనివాని (శిల్పి) చేయి, స్త్రీ ముఖము, బజారు నుండి కొనితెచ్చినవి, దాసదాసీలు తెచ్చినవి, ప్రశంసించబడిన వస్తువులు, చిరకాలంనుంచి ఉంచబడిన వస్తువులు, చాలచేతులు మారినవి, తేలిక వస్తువులు, బాలవృద్ధుల కృత్యాలు, బాలల ముఖాలు, ఇవి అన్నియు పరిశుద్ధాలే. ధాన్యపు కొట్లు, బొగ్గు నిల్వచేయుకొట్లు, బాలింత స్త్రీలు, పాలుత్రాగే శిశువులు, బ్రాహ్మణుల నోటినుండి వెలువడు మాటలు ఉష్ణోదకములు ఇవన్నియు పరిశుద్ధములే.
పారతో గడ్డిగాదం తొలగించిగాని, పైనున్న చెత్త కాల్చిగాని చీపురుతో చిమ్మిగాని, ఒకరాత్రి పగలు ఆవుల చేత త్రొక్కించిగాని, ఆవుపేడతో అలికించిగాని ఆవు పంచితం చల్లిగాని, భూమిశుద్ధి చేసుకోవచ్చు. ఇంటిని ఊడ్చిగాని, అందులో పూజచేసిగాని శుద్ధిచేసుకోవలె. వెంట్రుకలు పడినా మక్షికాది కీటకాలు వాలినా, ఆవులు వాసన చూచినా, అలాంటి అన్నం మీద మృత్తిక భస్మక్షారాలు కలిపిన జలం చిలికించి పవిత్రం చేసుకోవలెను. సత్తు గిన్నెలు సీసపు పాత్రలు క్షార జలంతోను రాగిపాత్రలను పులుసుతోను, కంచుపాత్రలను బూడిదకలిపిన నీటితోను శుద్ధిచేయవలె. మలస్పర్శ కలిగిన వస్తువులను దుర్వాసన వదిలే వరకు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవలెను. ఇతర వస్తువులను కూడా దుర్గంధం వదిలేవరకు అట్లే శుద్ధి చేసుకోవలెను. చనుబాలు త్రాగే శిశువు పవిత్రుడు. పక్షి (చిలుక) కొరికి పడవేసిన పండు, బరువు మోయుచున్న గాడిద, దారి, బురద, నీరు, పడవలు, దారిలో పెరిగిన గడ్డి, వీనిని గాలి శుభ్ర పరుచును. కాల్చిన ఇటుకలు గూడ అట్లే. అమేధ్యంలాంటి అపవిత్ర వస్తుస్పర్శ గలిగిన భోజనం (అన్నం), అడ్డెడు మానెడు వండినది, ఎక్కువ ప్రయాణంలో ఉన్నపుడు దానిపై పొరతీసి పారవైచి మిగిలిన దానిపై నీరు ప్రోక్షించి శుద్ధి చేసుకోవలెను. అశుద్ధాన్నం తెలియక తినినచో ఒకరాత్రిగాని, మూడు రాత్రులుగాని ఉపవాసం చేసి దోషం పోగొట్టుకోవచ్చు. తెలిసిగూడ దూషితాన్నం తింటే దానికి శుద్ధియే లేదు.
రజస్వల అయిన స్త్రీని, కుక్కను, దిగంబరుడిని, ప్రసూతయగు స్త్రీని, శవవాహకులను తాకినచో స్నానంతో శుద్ధియగును. మాంసంతో కూడిన ఎముకను తాకినచో సచేల స్నానం చేయాలి. ఎండిన ఎముక అయితే ఆచమనం చేసి గాని ఆవును తాకిగాని సూర్యుని చూచిగాని శుద్ధిచేసుకోవచ్చు. మలం, రక్తం. ఉమ్మి, నలుగుపెట్టి పారవేసిన పిండి వీనిని దాటకూడదు. ఎంగిలి, చెత్త చెదారం, పెద్దలకు పాద ప్రక్షాళనం చేసిన నీరు, మూత్రాదులు ఇంటికి దూరంగా పారవేయాలి. ఇతరులకు చెందిన జలాశయాల్లో స్నానం చేసేముందు అయిదు దోసిళ్ళ నీరు బయటకు చిమ్మవలెను. ప్రకృతి సిద్ధాలయిన చెరువుల్లో జలాశయాల్లో నదీనదాల్లోను స్నానం చేయాలి. అనుచిత సమయాల్లో ప్రాజ్ఞుడు ఉద్యానవనాలలో నిలవడు, జనవిద్వేషి అయిన వ్యక్తితో మాటాడడు, విధవలతో, వ్యర్థ స్త్రీలతో మాట్లాడడు. దేవపితృ నిందకులను వేదశాస్త్ర యజ్ఞాది దూషకులను తాకినను సంభాషించినను వెంటనే సూర్యుని చూచి పవిత్రులు కావచ్చును. సూతికులు, షండులు, మార్జార, మూషిక, శునక, కుక్కుట, పతితులు, అపవిద్ధులు, నగ్న చండాలాది హీనుల నుండి భోజనం గ్రహించరాదు అని ఆ ఋషులు వివరించగా సుకేశి ఈ విధంగా చెప్పాడు: మహనీయులారా! సూతికాదుల నుండి భోజనం గ్రహించకూడ దన్నారు. అలాంటి వారి లక్షణాలేవో వివరించండి అని ప్రశ్నించాడు. అందుకు