వామన మహా పురాణము
అఖండ వ్రతం
బ్రహ్మర్షీ! ఆశ్వయుజ మాసంలో జగన్నాధుని నాభి నుండి పద్మం పుట్టంగానే యితర దేవతల నుంచి కూడా ఆయా పుష్పాదులు ఉద్భవించాయి. కామదేవుని కరాగ్రాన్నుంచి సుందరమైన కదంబం పుట్టింది. ఆయనకు ఆపుష్పమంటే ఎంతో ప్రీతి. యక్షేశ్వరుడైన మణిభద్రు నుంచి వటవృక్షం పుట్టింది; ఆయనకా వృక్షమంటే ఎంతో ప్రేమ. పరమ శివుడు తన హృదయా న్నుంచి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు. బ్రహ్మ శరీర మధ్యభాగాన్నుంచి అవతరించిన మరకతవర్ణపు ఖదిరవృక్షాన్ని విశ్వకర్మ నుంచి పుట్టిన కంటకీవృక్షాన్ని అయాదేవతలు ప్రేమిస్తారు. పార్వతి అరచేతి నుంచి కుంద (మల్లె) పొద, గణాధిపుని చెంపల నుండి సింధువారకం, యముని దక్షిణ పార్శ్వం నుండి పాలాశం, దక్షిణోత్తరాల నుండి నల్లమేడి, రుద్రుని దేహం నుండి క్షోభం కలిగించే వృషవిటపం, కుమారస్వామి నుండి బంధుజీవనం, సూర్యుని నుండి అశ్వత్థ (రావి) చెట్టు, కాత్యాయని వల్ల జమ్మిచెట్టు, మహాలక్ష్మి చేతినుండి బిల్వ (మారేడు) వృక్షం ఉద్భవించాయి. నాగుల అధిపతినుంచి రెల్లుదుబ్బు, వాసుకి విశాలమైన తోకనుండి వీపునుండి తెల్ల, నల్లగరిక (దూర్వా), సాధ్యుల హృదయాల నుండి హరిచందన వృక్షములు ఉద్భవించాయి. తమ నుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయినాయి.
అలాంటి రమణీయమైన శుభ సమయాన, శుక్ల పక్ష ఏకాదశినాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజింపవలె. శరదృతువు ప్రవేశించే వరకు పుష్పపత్రఫల, గంధాదులతోను, వర్ణరస ముఖ్య ఓషధులతోను శ్రియఃపతిని చక్కగా పూజించాలి. నేయి తిలలు బియ్యం యవలు, బంగారం, వెండి మొదలయినవి, మణులు, ముత్యాలు పగడాలు, వివిధ వస్త్రాలు, తీపి పులుపు మొదలయిన షడ్రసోపేతాలయిన వస్తువులను అఖండాలుగా (తుంచకుండా) సేకరించి మహాత్ముడగు కేశవునకు నివేదనం చేయాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తి అయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్ధులు వర్షిస్తాయి. నారదా! ఉపవాసంచేసి ఆ మరునాడుదయం జితేంద్రియుడై సంవత్సరకాలం నిర్విఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చేయాలి. సువాసనగల తెల్ల ఆవాలుగాని నువ్వులుగాని పిండిచేసి దేహానికి నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. విష్ణుదేవుని నేతితో అభిషేకించాలి. నేతితోనే హోమంచేసి తన శక్తిననుసరించి మృతదానం చేయాలి. తదనంతరం పద్మనాభుని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి. రకరకాలయిన పరిమళ ధూపాలు వేయాలి. ఆ విధంగా ఆ సంవత్సరం పరమపవిత్ర మౌతుంది. అనంతరమా జగన్నాథుని స్వర్ణరత్నాలతోను దీని చీనాంబరాలతో నలంకరించి మృష్టాన్నం రుచ్యములైన చోష్యహవిష్యాదులు నైవేద్యం చేయాలి. మునిశ్రేష్ఠా! ఇలా సమర్పించిన తర్వాత ఆ జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి.