వివిధ తీర్థాల మహాత్మ్యం

అక్కడే సుప్రసిద్ధమైన గొప్పదైన విశ్వామిత్ర తీర్థం ఉంది. అక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఆ మహాముని తీర్థంలో స్నానంచేస్తే బ్రాహ్మణత్వం లభిస్తుంది. పరిశుద్ధాత్ము లయిన బ్రాహ్మణులు పరమపదం పొందుతారు. తప్పదు. అక్కణ్ణుంచి మితాహారియై నరుడు పృథూదక తీర్థాని కెళ్ళాలి. అక్కడ రుషంగుడనే బ్రహ్మర్షి సిద్ధి పొందాడు. పూర్వజన్మ స్మృతి గల్గిన రుషంగుడు మొదట గంగాద్వారంలో ఉండేవాడు. తనకు అంత్యకాలం రానున్నట్లు తెలిసికొని పుత్రులతో ఇలా అన్నాడు. ఇక్కడ నాకు శ్రేయస్సు కలుగదు. వెంటనే నన్ను పృథూదక క్షేత్రానికి తరలించండి. తండ్రి భావాన్ని గుర్తించిన కుమారులు ఆయనను వెంటనే పృథూదకానికి తీసికెళ్లారు. రుషంగుడు సరస్వతీ నదిలో స్నానంచేసి ఆ తీర్థమహిమను తలంచుకొని ఇలా అన్నాడు. సరస్వతి ఉత్తరపుటొడ్డున పృథూదక తీర్థంలో జపంచేస్తూ శరీరం చాలించిన వానికి తప్పక అమరత్వం లభిస్తుంది. అక్కడే బ్రహ్మ నిర్మితమైన బ్రహ్మయోని ఉంది. బ్రహ్మ సరస్వతి తటాన పృథూదకంలో నివసించి చతుర్వర్ణముల సృష్టించేందుకు తగిన ఆత్మజ్ఞానం పొందాడు. అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టించాలని సంకల్పించుకొనినంతనే అతని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఆ నాలుగు వర్ణాల వారిని ఆశ్రమ ధర్మాల్లో అన్నిచోట్ల స్థాపించాడు. ఆ కారణాన తీర్థం బ్రహ్మయోనిగా పిలవబడింది. ముముక్షువగు వాడు అక్కడ స్నానంచేస్తే మరల జన్మలంటూ పొందడు.

అక్కడనే ఆవకీర్ణమనే తీర్థం ఉంది. అక్కడే దాల్భ్యుడైన బకుడు అసహిష్ణుడైన ధృతరాష్ట్రుని అతని బోయీలతో కలిపి యజ్ఞంలో బలియివ్వ సిద్ధపడగా రాజుకు బుద్ధి వచ్చింది. అంతట ఋషులు, ఆ ఆవకీర్ణ తీర్థమెలా ఏర్పడ్డది? దానిని ధృతరాష్ట్రుడెందులకు సేవించాడని అడిగారు. అందుకు లోమహర్షణుడిలా చెప్పాడు. పూర్వం ఋషులు నైమిశారణ్యవాసులు, ధృతరాష్ట్రుని వద్దకు దక్షిణకైవెళ్లారు. వారలతరఫున దాల్భ్యుడైన బకుడు ఆనరపతిని యాచించాడు. ధృతరాష్ట్రుడు పలికిన నిందాగర్భితమైన అసత్యానికి మండిపడి దాల్భ్యుడైన బకుడు ఆభిచారిక హోమం ఒకటి పృథూదక క్షేత్రంలోని ఆవకీర్ణ తీర్థంవద్ద ప్రారంభించి అందులో ధృతరాష్ట్రుని రాజ్యంతో సహా వేల్చేందుకై తన తొడ మాంసాన్ని బయటకు తీసి హోమాగ్నిలో వేశాడు. అలా యజ్ఞం ప్రారంభంకావడంతో ఆ దుష్టుడైన నరపతి రాజ్యం క్షీణించిపోయింది. రాజ్యనాశనానికి చింతా కులితుడై వెనుక తాను ఋషుల నవమానించుట జ్ఞప్తికిరాగా భీతుడై తన పురోహితునితో బాటు రత్నరాసులు తీసికొని ఆవకీర్ణ తీర్థానికి వెళ్ళి దాల్భ్యునకవి సమర్పించి పాదాల మీదబడి శరణాగతు డయ్యాడు. అందులకు సంతోషించి ఆ మహర్షి ఇలా అన్నాడు. విజ్ఞానియైనవాడు బ్రాహ్మణులను ఎన్నడు నవమానించరాదు. బ్రాహ్మణులకు గావించిన అవమానం మూడు తరాల వారిని దహించివేస్తుంది సుమా. అలా హెచ్చరించి ధృతరాష్ట్రుని రాజ్యాన్నీ అతని కీర్తి ప్రతిష్ఠలనూ తిరిగి నిలబెట్టాడు. అలాంటి ఆవకీర్ణంలో విజితేంద్రియుడై శ్రద్ధాసక్తులతో స్నానంచేస్తే చింతిత ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. ఆ పైన ప్రసిద్ధి చెందిన యాయాత తీర్థం వస్తుంది. యయాతి చక్రవర్తి చేసిన యజ్ఞ ఫలంగా అచ్చట తేనెవాకలు ప్రవహించాయి. అచట భక్తితో స్నానం చేసి సర్వ కిల్బిషాలు పోగొట్టు కోవచ్చు. అశ్వమేధ ఫలం పొందవచ్చు. మధుస్రవమనే పవిత్ర తీర్థం అక్కడే ఉంది. అందులో మునిగి పితరులకు తేనెతో తర్పణాదులిచ్చి నరుడు తరించగలడు. అక్కడనే వాసిష్ఠోద్వాహమనే మహత్తరమైన తీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానంచేస్తే వసిష్ఠలోకం సంప్రాప్తిస్తుంది.