వశిష్ఠకృత సరస్వతీ నదీ స్తుతి

అలా నదీప్రవాహంలో కొట్టుకొనిపోతూ ఆ వసిష్ఠముని సరస్వతీనదిని స్తుతించాడు. “బ్రహ్మ సరస్సునుంచి ఉద్భవించిన పావనసరస్వతీ! నీ పవిత్రజలాలతో జగత్తును అంతను ముంచితివి. నీవే ఆకాశాన ప్రవహించి మేఘాలకు నీరు ప్రసాదిస్తున్నావు. జలములన్నియు నీరూపమే. పుష్టి, కీర్తి, సిద్ధులు, కాంతి, క్షమాగుణం, స్వాహా, స్వధా, వాణి మొదలైన వానితో కూడిన ఈ జగత్తంతటికీ నీవే ఆధారము. అన్ని జీవరాసుల్లోనూ వాక్ రూపంలో నీవే నెలకొని ఉన్నావు. నీకు నమస్సులు. “వసిష్ఠుని స్తోత్రానికి సంతసించి సరస్వతీనది ఆయనను సుఖంగా తన ప్రవాహంతో విశ్వామిత్రుని కడకు కొనిపోయి ఖిన్నురాలై ఆ విషయం విశ్వామిత్రున కెరిగించినది. అలా వచ్చిన వసిష్ఠునిచూచి కోపంతో, ఆయనను సంహరించుటకు విశ్వామిత్రుడు ఆయుధము తీసికొనిరాగా తన ప్రవాహం మధ్యభాగాన ముంచివేసింది. ఆ విధంగా ఇద్దరి ఆదేశాలను గౌరవించింది. ప్రవాహ మధ్యంలో ముంచబడిన వసిష్ఠుని కానక విశ్వామిత్రుడు సరస్వతి చేసిన మోసానికి కోపించి, ఓ ఉత్తమ స్రోతస్వినీ! కల్యాణీ! నన్నీవిధంగా వంచించి నందుకు ప్రతిఫలంగా నీవు నీళ్ళకు బదులుగా రక్తం ప్రవహిస్తూ రాక్షసులకు నిలయమై ఉండి పోగలవని శపించెను. ఆ శాపఫలంగా ఆ సరస్వతీ నది ఒక సంవత్సరకాలం రక్తం ప్రవహింప జేస్తూ ఉండినది. అలా రక్తజలాలతో నిండిన సరస్వతిని చూచి దేవగంధర్వాప్సరసలు ఎంతో దుఃఖించారు. రక్తంతో నిండిన అనది చుట్టూ భూత పిశాచ రాక్షసులు మూగికొని మహా సంతోషంతో ఆరక్తం త్రాగుతూ తృప్తిగా ఎలాటి విచారంలేకుండా వికటాట్టహాసాలు చేస్తూ స్వర్గాన్ని జయించినట్లుగా ఆనందించసాగారు. ఆమీద కొన్నాళ్ళకు కొందరు ఋషులూ తపోధనులూ యాత్రార్థంగా బయలుదేరి సరస్వతీనదిని సమీపించారు. రక్తమై రాక్షసులతో నిండిన ఆ పుణ్యనదిని చూచి ఆమెను రక్షించాలని సంకల్పించుకొని ఆ మహానదిని పిలిచి ఆ తపోధను లిలా అన్నారు. ఓ నదీశ్రేష్టమా! ఇలా రక్తజలాలతో నిండియుండుటకు కారణమేమి? మాకంతయు చెప్పవలసినది. అందులకు సరస్వతి విశ్వామిత్రుడి ఆగడాన్ని వివరించి చెప్పింది. అంతట నామునులందరు సంతోషించి సమస్త పాపాలను పోగొట్టే అరుణానదీ పవిత్ర జలాలను తెచ్చి సరస్వతిలో కలిపారు. ఆమెను పవిత్రను గావించారు.

ఆ పవిత్రాలైన సరస్వతీ నదీజలాలను చూచి దుఃఖితులై దీనదీనంగా ఆ రాక్షసులు మునులతో యిలా విన్నపం చేసుకున్నారు. “మేము శాశ్వతంగా ధర్మదూరులమై ఆకలితో అల్లాడుతున్నాము. మేము స్వయంగా ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. మేముచేసిన పాప కర్మలూ మీ అనుగ్రహం లభించకపోవడం అనే ఈ కారణాలవల్ల మాజాతి పెరిగిపోతూ మేము బ్రహ్మ రాక్షసులమయ్యాము. బ్రాహ్మణులను ద్వేషించిన వైశ్య శూద్ర క్షత్రియు లందరూ బ్రహ్మరాక్షసు లౌతారు. పాపిష్టి స్త్రీలతో సంగమం చేయడంవల్ల మాసంతతి పెరిగిపోతున్నది. ఇది ఎప్పటినుంచో వస్తూన్న కర్మ. తమరో మహాతపోధనులు! సమస్త లోకాలను తరింపచేయ సమర్థులు! ఆ రాక్షసుల దీనాలాపాలు విని ఆ దయామయులగు మునులు తమలోతాము సంప్రదించుకున్నారు. ఎంగిలి, కీటకాదులు వాలినది, వెండ్రుకలు పడినందున, గాలివల్ల నోటిశ్వాసవల్ల కలుషితమైన భోజనం రాక్షసభోజ్యం. ఆసంగతి గుర్తించి విజ్ఞులయినవారలట్టి ఆహారాన్ని వర్ణించాలి. అలాటి తిండితిన్న వాడు రాక్షస భోజనంచేసినట్లే. అలా ఆలోచించుకొని ఆ మహర్షులాతీర్థాన్ని పవిత్రం గావించి రాక్షసులను ఉద్ధరించుటకై అక్కడ అరుణా సరస్వతీనదుల పవిత్ర సంగమాన్ని కల్పించారు. లోకప్రసిద్ధమైన ఆ నదీసంగమంవద్ద మూడు రాత్రు లుపవసించి స్నానంచేస్తే సర్వ కిల్బిషాలు తొలగిపోతాయి. ఘోరకలికాలంలో ధర్మంఅడుగంటి నరుడు అరుణా సంగమంలో స్నానంచేసి మానవులు ముక్తులు కాగలరు. అంతట ఆ రాక్షసు లందరు ఆసంగమ తీరాల్లో మునిగి పాపముక్తులై దివ్య మాల్యాంబరాలు ధరించి స్వర్గలోకాలకు చేరుకున్నారు.