నముచి వధ

పులస్త్య వచనము: నారదా! కశ్యప మహర్షి భార్య దనువు. ఆమెకు ఇంద్రునికన్న బలవంతులగు మువ్వురు కుమారులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు శుంభుడు, రెండవవాడు నిశుంభుడు మూడవవాడు మహాబలినముచి. ఇంద్రుడు వజ్రాయుధంతో నమునిచి చంపుటకు ఉద్యమించగా అతడు సూర్యుని రథంలో ప్రవేశించాడు. అంచేత అతడిని చంపనలవిగాక వాడితో ఇంద్రుడు సంధిచేసుకొని వాడికి అస్త్రశస్త్రాలతో చావులేకుండునట్లు వరమిచ్చాడు. ఆ విధంగా అతడు అవధ్యుడైనాడు. సూర్యరథం వదలి పాతాళానికి చేరు కున్నాడు. నీళ్ళలో మునిగిన వానికి సముద్రపు నురుగు (ఫేనం) కనిపించగా ఇంద్రుడు చెప్పినట్లు జరుగుగాక అని సంకల్పించి ఆ నురుగునుచేతులో పట్టుకొని నోటిని ముక్కును చెవులను కన్నులను దానితో గట్టిగా రుద్దుకున్నాడు. ఆ నురుగులో ఇంద్రుడు రహస్యంగా తన వజ్రాయుధం సృష్టించాడు. అంచేత వాడి ముక్కులు చెవులు కండ్లు భిన్నాలైపోయి మరణించాడు. నియమ విరుద్ధంగా జరిగిన ఆ దనుజవధవల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య చుట్టుకోగా తన తీర్థంలో మునిగి ఆ పాపం పోగొట్టు కున్నాడు. ఆ సంగతి తెలిసిన ఆ నముచిసోదరులు శుంభ నిశుంభులు కోపాతి రేకంతో గొప్ప సన్నాహాలు చేసి దేవతలను బాధించసాగారు. దేవతలు ఇంద్రుని నాయకత్వంలో వారలతో పోరి ఓడి పోయారు. ఆ దానవులు ఇంద్రుని ఐరావతాన్ని యముని మహిషాన్ని వరుణుడి ఛత్రాన్ని మరుత్తుల గదను కుబేరుడి శంఖపద్మాది నిధులనూ బల ప్రదర్శనంచేసి అపహరించారు. ఆ విధంగా ముల్లోకాలు వశంచేసుకొని ఆ రాక్షస వీరులు భూలోకానికి వచ్చి అక్కడ మహా అసురుడు రక్తబీజుని చూచి నీ వెవ్వడవని ప్రశ్నించారు. అందుకు వాడు నేను రక్తబీజునిగా పేరొందిన మహాబలుడను, మహిషాసురుని సచివుడను. మా ప్రభువు మంత్రులు చండముండులనే వీరులు దేవికి భయపడి ఈసముద్ర జలాల్లో దాగుకున్నారు. కాగా మా ప్రభువైన మహిషుడు దేవిచేత వింధ్యశైలం మీద వధింపబడినాడు అని తన కథచెప్పి మీరెవరు, ఎవరి కుమారులు, మీ పేర్లు బలపౌరుషాలు తెలుపమని అర్థించాడు.

శుంభనిశుంభులన్నారు: నేను దనువు ఔరసపుత్రుడను, పేరు శుంభుడు. ఇతడు నా అనుజుడు నిశుంభుడనువాడు. ఇంద్ర రుద్ర దివాకరాది దేవత లెందరినో ఇతడు జయించాడు. సరే ఇక చెప్పుము. మహిషాసురుని వధించిన దెవరు? ఈ క్షణాన్నే సైన్యంతో వెళ్ళి వధించి వస్తాను అనగా, వారిద్దరూ నర్మదతీరాన అలా మాటాడుకుంటూండగానే చండ ముండులనే రాక్షసులు జలావాసం వదలి అక్కడకువచ్చి రక్తబీజుని ఆశ్రయించి, మృదువైన భాషలో నీవెవరితో మాటాడుతున్నావని అడిగారు. అందుకతడు వీరిద్దరు శుంభ నిశుంభులను దైత్యులు మహాబలశాలురు. వీరిద్దరి సాయంతో మహిషుని చంపిన ఆ దుష్టురాలిని జయించి, ఆ మహిళారత్నాన్ని వివాహమాడతానన్నాడు. అందుకు చంద్రుడు ఇలా అన్నాడు. “అలా అనకుము. ఆ త్రిలోక రత్నం ప్రభువైన శుంభునకే తగి ఉంటుంది.

ఆమెను శుంభునకు రూపశాలిని అయిన కౌశికిని నిశుంభునకు ఏర్పాటు చేద్ధాము.” అన్నాడు. అంతట శుంభుడు సుగ్రీవుడను దూతను వింధ్యవాసిని యొద్దకు పంపించాడు. ఆతడు వెళ్ళి దేవితో మాటాడి కోపంతో తిరిగివచ్చి శుంభ నిశుంభులతో ఇలాఅన్నాడు. “ప్రభూ! మీతరఫున నేనువెళ్ళి అదేవితో రాక్షసలోకంలో సర్వోన్నతుడూ మహా పరాక్రమవంతుడునగు శుంభుడు ముల్లోకాలకూ అధినేత. ఆ మహారాజు ఇంట్లో ప్రపంచంలో గల రత్నాలన్నీ ఉన్నాయి. ఆయన చండముండులవలన నీవు స్త్రీ రత్నానివని విన్నాడు. నిన్ను తననుగాని తన తమ్ముడు నిశుంభుని గాని పెండ్లాడవలసినదిగా నాద్వారా సందేశం పంపాడని చెప్పాడు. ఆ మాటల కామె పకపక నవ్వి ఇలా అన్నది. సుగ్రీవా! నీవు చెప్పింది నిజమే. త్రిలోకాధిపతి శుంభుడు రత్నాలు ఉంచుకో తగినవాడే. అయితే నేను నీతులు గాలికి వదిలేసి నన్ను యుద్ధంలో జయించినవానినే పెండ్లాడటానికి నిశ్చయించుకున్నాను అని చెప్పింది. అందుకు నేను త్రిలోకాలు జయించినవాడు నిన్ను జయించలేడా? వేరుమాటాడక రావలసిన దనగా అందుకామె నేనేమి చేయగలను? అనాలోచితంగా ఒక నిర్ణయం తీసికున్నాను. ఆ మనోరథం మార్చుకోను. నీవు వెళ్ళి శుంభుడితో చెప్పమని త్రిప్పి పంపించినది స్వామీ. ఆమె మాటలు మీకు చెప్పేందుకు తిరిగివచ్చాను. ఒక్క విషయం. ఆమెకోటి అగ్నులతో సమానంగా వెలిగిపోతోంది. ఇది మనస్సులో పెట్టుకొని తర్వాత ప్రయత్నాలు చేయండి.

పులస్త్యుడిలా అన్నాడు: సుగ్రీవుని మాటలు విని ఆ మహారాక్షసుడు దూరంగా కూర్చొని ఉన్న ధూమ్రాక్షుడనే రాక్షస వీరునిచూచి, “ధూమ్రాక్షా! ఈ క్షణమే వెళ్ళి అ దుష్టురాల్ని నేరస్థురాలిని, బానిసను మాదిరి జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిరా, పో! దాని పక్షాన ఎవరైనా, పితామహుడైనా సరే నిలబడ్డాడంటే నిర్దాక్షిణ్యంగా వధించి, ఆమెను లాగుకొని రా! అని ఆజ్ఞాపించాడు. శుంభుని ఆదేశం వింటూనే ధూమ్రాక్షుడు ఆరు వందల అక్షౌహిణుల రాక్షస బలంతో వింధ్యాద్రికి పరుగు తీశాడు. అక్కడ దుర్గాదేవిని చూడగానే దిగ్ర్భమ కలిగింది. వెంటనే ఆమెను చూచి - ఓ మూర్ఖా! కౌశికీ! వచ్చి శుంభుణ్ణి వరించలేకపోతే నిన్ను బలవంతంగా జుట్టుపట్టి లాగుకొని పోతానని గర్జించాడు. అబలనైన నేనేం చేయగలను? నీయిష్ట ప్రకారమే చెయ్యమన్నది. అంతట ధూమ్రలోచనుడు గద నెత్తుకొని దేవిమీదికి లంఘించాడు. తన మీదకు దూకుతున్న ఆ దుష్టుని చూచి అంబిక హుంకారం గావించింది. దానితో తనసైన్యంతో సహా వాడు అగ్నిలో బడిన సమిధల్లాగా మాడి బూడిదై పోయారు. దానితో చరాచర జగత్తంతా హాహాకారాలతో దద్దరిల్లింది. ఆ భీషణరవాన్ని శుంభుడు కూడా విని మహాబలవంతులైన నిశుంభుని రురుదైత్యుణ్ని యుద్ధానికి పంపాడు. వారంతా గజాశ్వ రథ పదాతులతో కూడిన ఆ సంఖ్య సేనతో ఆ కౌశికి ఉన్నచోటికి వెళ్ళారు. వందల కోట్ల సంఖ్యలో వస్తూన్న ఆ రాక్షస సేనను చూడటంతోటే కౌశికి వాహనం సింహం జూలు ఝళిపించి పంజాచాపి గర్జిస్తూ దానవమూక మీదపడి సంహార కాండ సాగించింది. కొందరను పంజా దెబ్బలతో, కొందరను కోరలతో చీలిస్తే మరికొందరను గోళ్ళతో పరిమార్చింది. అలా సింహంచేతనూ గిరికందరాల్లో ఉండే భూతగణాలూ తదితర దేవి అనుచరులచేత వధింపబడి చావుదెబ్బలు తింటూ అదానవులు తమ నాయకులు చండముండుల వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఆర్తనాదాలు చేస్తున్న తమ బలగాలనుచూచి ఆమహాసురులు మండిపడి అగ్నిమీద దూకే శలభాల్లాగా దేవిమీదకు దుమికారు. ఆ క్రోధోన్మత్తులను చూడగానే, కోపంతో దేవి భ్రుకుటి ముడిబడింది. అంతట ఆమె పాలభాగాన్నుంచే కరాళాకృతితో కళ్యాణి అయిన కాళి ఊడిపడి ఖట్వాంగం కరవాలం ధరించి మాంసశుష్కమై రక్తసిక్తమైన శరీరంతో నరముండమాల మెడలో వ్రేలాడుతూంటే శత్రు మూకలను సంహరింపసాగింది. కొంద రను కత్తితో నరుకగా కొందరు తలలను ఖట్వాంగంతో నుగ్గుచేసింది. ఎందరినో రథ గజాశ్వాలతో సహా యమసదనాని కంపింది. అంత ఆయంబిక కాళిక నోటిలోకి ఎందరెందరో శత్రువీరులను చర్మాంకుశ ముద్గరఘంటా గజ యంత్రాలతో సహా విసిరివేయగా ఆచండి తన విశాలమైన కోరలమధ్య వారందరను నమిలి పొడిపొడి గావించింది. ఒకడిని జుట్టుపట్టుకొని, మరొకడిని మెడపట్టుకొని నేలపై పడగొట్టి కాళ్ళతో మర్దించి మృత్యువు కప్పగించింది. ఆ విధంగా దేవి సైన్యాధిపతితోసహా శత్రుబలాలన్నింటినీ భక్షించడం చూచి రురుధ కాలికి బుద్ధి చెప్పసాగాడు. అది చూచిన దుర్గ ఖట్వాంగంతో తల మీద ప్రహరించగా వాడు నరుకబడి మహా వృక్షంలాగా నేలకొరిగాడు.

అలా వాడు పడిపోవడంచూచి ఆ దుర్గ చెవి నుంచి చరణాల వరకు గల తన కోశాన్ని (కవచం) కోసి దానితో జడనల్లింది. అందులో ఒకటి ఉపయోగించకపోగా దాన్నినేలకు విసిరి కొట్టింది. అందులో నుంచి నూనెకారుతున్న జుట్టుతో, సగం నలుపూ, సగం తెలుపూ అయిన దేహంతో ఒక రౌద్రాకృతి బయలుదేరి, “నేను కనీసం ఒకమహాదైత్యుడి నైనా సంహరిస్తాన”ని బొబ్బ పెట్టింది. అంచేత ఆమెకు చండమారి అనేపేరు వచ్చింది. ఆమెను చూచి దేవి, “కళ్యాణీ! నీవువెళ్ళి చండముండుల కట్టి తీసుకొనిరమ్ము. నేను స్వయంగావారలను వధిస్తా”నని ఆజ్ఞాపించింది. అంతట ఆదేవి చండముండులను వెంబడించగా వారు దక్షిణ దిక్కుగా గుడ్డలూడిపోగా పరుగిడసాగారు. అంత నాదేవి గరుడుని లాంటి వేగంగల గాడిదమీద నెక్కి వారలవెంటబడినది. అప్పుడు ఆమెకు యముని మహిషం పౌండ్రం కనిపించగా, కాలసర్పం లాంటి దాని కొమ్ము పెకలించి పట్టుకొని త్వరగా రాక్షసులు ననుగమించింది. ఆ దైత్యులు భూమి వదలి గగనమార్గానికి పోగా దేవికూడ గాడిదమీద వారలవెంటనే విజృంభించింది. దారిలో నొక చోట కర్కోటక మహాసర్పాన్ని తినబోతున్న గరుడపక్షి కనిపించింది. దేవిని చూడడంతో ఆ పక్షి భయంతో కంపించి మాంసం ముద్దగా అయిపోయింది. దానివంటి మీది రెక్కలన్నీ ఊడిపడ్డాయి. అంతట ఆ చండమారి ఆరెక్కలనూ కర్కోటక నాగాన్ని చేజిక్కించుకొని రాక్షసులను వెంబడించి భయంతో గడగడ వణికిపోతున్న ఆచండముండులను పట్టుకున్నది. వారలను ఆకర్కోటక నాగంతో బంధించి వింద్యకు కొనితెచ్చింది.

అంతటా ఆ భయంకరమైన కోశా (కవచా)న్ని దేవికి సమర్పించి, గరుడుని ఈకలతో అలంకరించబడిన ఆ రాక్షసుల తలలను తులలేని మాలగా చండికకు యిచ్చింది. వానితోబాటు సింహం చర్మంతో చేసిన వడ్డ్యాణాన్ని గూడ సమర్పించుకొని కడుపార రాక్షస రుధిరం త్రాగింది. ఆ చండమారి సమర్పించిన ఆ చండముండుల శిరస్సులను ఆ దుర్గాదేవి మహా క్రోధంతో ఖండించింది. అంతట శుష్కరేవతీదేవి వారల సర్పాలతో ఒక శిరోవేష్టనం తయారుచేసి చండ మారితో కౌశికివద్దకు వెళ్ళి “భగవతీ! దైత్యుల శిరస్సులను నాగరాజుతో గూర్చి చేసిన ఈ ఉత్తమ శిరోవేష్టనాన్ని స్వీకరించు”మనెను. దేవిదానిని తీసికొని చండమారి శిరస్సున అలంకరించి “నీవు భయంకరమైన కార్యం సాధించావు. ఈ చండముండుల శిరోమాలను ధరించి నేటి నుండీ “చాముండ” అనే శుభనామంతో ఖ్యాతిని గాంచగలననెను. ఈ మాటలు చెప్పి ఆ త్ర్యంబకేశ్వరి చండ ముండుల శిరోమాల ధరించి దిగంబరంగా ఉన్న ఆ చాముండతో ఇకవెళ్ళి మిగిలిన శత్రువుల నందరను మట్టుపెట్టుమని ఆదేశించింది. అట్లేయని ఆ రాసభవాహిని దున్నపోతు కొమ్ముతో విజృంభించి శత్రుసైన్యాన్ని సంహరించింది. మిగిలిన వారలందరను మ్రింగివేసింది. ఆ విధంగా ఆదనుపుంగవులంతా అంబిక, చర్మముండ, సింహం భూతగణాల చేతుల్లో నిశ్శేషంగా వధించబడి శంభులోకానికి చేరారు.