వామన మహా పురాణము
కుమారస్వామి జన్మ వృత్తాంతం
నారదుడు ప్రశ్నించాడు, ఓ మహాద్యుతీ! మహిషంతో గూడ క్రౌంచగిరిని స్కందుడు ఎలా చీల్చాడో విపులంగా నా కెరిగించండి. అందుకు పులస్త్యుడు చెప్పసాగాడు. నారదా! ఇది చాలా పురాతనకాలపు కథ. పవిత్రమైనది. కార్తికేయుని యశోభివృద్ధిని వివరించే విషయం చెపుతున్నాను వినుము. ఆ విధంగా శివుని వీర్యాన్ని మ్రింగిన అగ్నిదేవుడా తేజస్సును భరించలేక తన తేజస్సును కోల్పోయాడు. అంత నాతడు దేవతలతో చెప్పుకోగా వారంతా కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. మార్గమధ్యంలో అగ్ని కుటిలాదేవిని చూచి ఆమెతో అమ్మా! ఈ శివతేజాన్ని భరింపలేకున్నాను. ఇది ముల్లోకాలను దహిస్తోంది. అంచేత దీనిని నీవు ధరిస్తే నీకు చక్కని పుత్రుడు కలిగి ధన్యత చెందుతావని చెప్పాడు. అంతట కుటిల తన వెనుకటి ఉదంతాన్ని జ్ఞప్తికితెచ్చుకొని నదీరూపంధరించి ఆ శివవీర్యాన్ని తన నీళ్ళలోకి వదలమని అగ్నితో చెప్పింది. ఆ కుటిలాదేవి శివవీర్యాన్ని ధరించి పోషించింది. అగ్ని కూడ తన బాధ వదిలించుకొని స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. అగ్ని అయిదు వేలేండ్లు ఆ అద్భుతతేజాన్ని ధరించినందువల్ల దాని ప్రభావాన అతని రక్తమాంసాస్థి మేదోంత్ర రేతస్సులు చర్మంతోసహా అన్నీ బంగారుమయమయ్యాయి. ఆకారణాన హుతాశను డీనాటికీ “హిరణ్యరేత” అని కొనియాడబడుతున్నాడు. కుటిలకూడ ఆదివ్యవీర్యాన్ని అయిదు వేలేండ్లు గర్భంలో ధరించి ఆ వేడిని భరింపలేక బ్రహ్మ వద్దకు వెళ్ళింది. ఆ మహానది అలా శివవీర్య జ్వాలల్లో దగ్ధంకావడం చూచి బ్రహ్మ, ఆశుక్లం నీగర్భంలో ఎవరుఉంచారని ప్రశ్నించాడు. అందుల కామె ఓ మహానుభావా! శివశుక్లాన్ని తాగిన అగ్ని దానిని భరించలేక నాలో ఉంచితే ప్రస్తుతం నేనది భరిస్తున్నానని చెప్పింది. అయిదువేలేండ్ల నుంచి నేను ధరిస్తున్నా ఇంకా అది పక్వదశకువచ్చి బయటపడలేదని తనగోడు చెప్పుకుంది. అంతట ఆ బ్రహ్మ ఆమెతో నిట్లా అన్నాడు. “నీవు వెంటనే ఉదయాద్రికి వెళ్లిపో. అక్కడ నూరుయోజనాల భయంకరమైన రెల్లువనం ఉంది. ఓ సుందరీ! ఆ రెల్లు దుబ్బులు విస్తరించిన పర్వత సానువులలో వీర్యాన్ని వదులుము. పదివేలేండ్ల తర్వాత బాలకుడు జన్మిస్తాడు.” అలాబ్రహ్మ చెప్పిన మాటలవిని ఆ సుందరి ఉదయగిరికి వెళ్ళి గర్భ పిండాన్ని అక్కడ వమనంగావించి మరల బ్రహ్మ వద్దకు వెళ్లి మంత్రశక్తివల్ల నదిగా మారిపోయింది. అంతట పదివేలేండ్లు గడచిన వెనుక ఉదయభానుని కాంతితో కమల రేకుల్లాంటి నేత్రాలతో చక్కని బాలుడు ఉద్భవించి, ఆ రెల్లువనంలో వెల్లకిలాపండుకొని బొటనవ్రేలు నోటిలో పెట్టుకొని మేఘ గంభీరస్వనంతో ఏడువసాగాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ఆరుగురు కృత్తికా సుందరీమణులు రెల్లుపొదలో పరుండిన బాలకుని చూచారు. అంతట జాలిగొని ఆ స్కందుడు (శిశువు)న్న చోట వెళ్ళి ఆ బిడ్డకు స్తన్యం ఇచ్చేందుకు పోటీపడ్డారు. వారలు తగవుచూచి ఆ బాలుడు ఆరు ముఖాలవాడయ్యాడు. అంతట ఆఆరుగురు కృత్తికలు వాత్సల్యంలో ఆ బిడ్డకు ఒకేసారి పాలు త్రాగించారు. అలాకృత్తికల స్తన్యపానంచేసి ఆబాలకుడు దినదిన ప్రవర్ధ మానుడయ్యాడు. బలవంతులలో శ్రేష్ఠుడయిన ఆ శిశువు కార్తికేయుడుగా ప్రసిద్ధి వహించాడు. ఈ లోపల బ్రహ్మ అగ్నిదేవుని, నీ కుమారుడు గుహుడు ఎంతవాడయ్యాడని అడిగాడు. శివవీర్యంచాలక రూపం ధరించడం తెలియక పాపకుడు నా పుత్రుడెవడో గుహుడెవడో నాకు తెలియదన్నాడు. “అది కాదోయీ! నీవు పూర్వం మ్రింగి కుటలానదీ జలాల్లో వదలిన శివవీర్యం శరవణ వనంలో బాలకుడుగా జన్మించాడ” ని వివరంగా చెప్పాడు విరించి. అది వింటూనే మహావేగంగా పరుగెత్తే మేక మీద కూర్చొని అగ్ని శరవణవనానికి వెళ్లడంచూచిన కుటిల, “ఓ అగ్నీ! ఇంత హడావిడిగా ఎక్కడకు వెళుతున్నావని అడిగింది. “అక్కడ శరవణవనంలో జన్మించిన నా పుత్రుడికోసం వెళ్తున్నా” నని అగ్ని చెప్పగా ఆమె ఆబిడ్డడు నాకుమారుడని నిలదీసింది. అలా అగ్నీ కుటిలాదేవి నాబిడ్డ డంటే నా బిడ్డడని కీచులాడు కొనుచుండగా అచటకు నారాయణుడు వచ్చి మీ వివాదానికి కారణమేమని అడిగాడు. శివశుక్లం వల్ల కలిగిన బాలకుడికోసం మా తగవు అని వారలు చెప్పగా నా విష్ణువు, ఈ విషయం తేల్చ వలసినది ఆ త్రిపురాంతకుడే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేయుడ”ని సలహా ఇచ్చాడు.
వాసుదేవుడు చెప్పినట్లుగా కుటిలా అగ్నీ శివునివద్దకు వెళ్ళి ఆయనను ఆ బిడ్డ ఎవరి కుమారుడో నిజం చెప్పమని అర్థించారు. వారల మాటలు విని శంకరుడు అనందంపట్టలేక “ఆహా! అహా! ఎంతమంచిమాట!” అని పార్వతితో అన్నాడు. అది విని పార్వతి భర్తతో, “నాధా! మన మా బాలకుని వద్దకు వెళ్ళాము. అతడు మనలో ఎవరివద్దకు వస్తాడో ఆ వ్యక్తికే తనయుడు కాగలడని అన్నది. మంచిదంటూ శివుడులేచి, ఉమ, కుటిల, అగ్ని వెంటరాగా శరవణ వనానికి వెళ్ళాడు. అక్కడ వారు నలుగురూ, అ బిడ్డను కృత్తికల ఒడిలో చూచారు. యోగి అయిన నా బాలకుడు పరిస్థితిని బాగా ఆలోచించి నాలుగు రూపాలు ధరించాడు. వారిలో కుమారుడు శంకరుని సమీపిస్తే విశాఖుడు గౌరి ఒడిలోకి వెళ్ళాడు. శాఖుడు కుటిల నాశ్రయించగా మహాసేను డగ్ని చేతుల్లోకి వెళ్ళాడు. అదిచూచి హరుడు, ఉమ, కుటిల, అగ్ని నలుగురు ఎంతో సంతోషించారు. అప్పుడా కృత్తికలు ఈ షణ్ముఖ బాలకుడు శివుని కుమారుడా? అని అడిగారు. అంతట హరుడు అందరకూ సంతోషం కలుగునట్లుగా ఒక నిర్ణయం వినిపించాడు. “ఈ బాలకుడు కార్తికేయుడుగా మీ కుమారుడు. కుమారుడుగా కుటిలకు పుత్రుడు. ఈ అవ్యయుడు స్కందుడుగా ఉమాతనయుడుగా ప్రఖ్యాతుడౌతాడు. ఇక గుహుడను పేరుతో నాకు ఔరసుడు. మహాసేనుడుగా ఈ మహాయోగి హుతాశనుని పుత్రుడు. ఈశరవణ వనంలో పుట్టినందున శారద్వతుడుగా ప్రసిద్ధుడౌతాడు. ఆరు తలలు కలిగినందుకు ఈ మహావీరుడు షణ్ముఖుడుగా కీర్తింపబడతాడు.” ఈ విధంగా అందరనూ తృప్తిపరచి ఆ శూలపాణి బ్రహ్మాది దేవతలందరనూ స్మరించాడు. తత్ క్షణం వారందరూ వచ్చి శివపార్వతులకు వందనాలు చేసి అగ్ని, కుటిల, కృత్తికలను ప్రీతితో సంభావించి, తన శరీరకాంతితో దేవతల కండ్లకు మిరుమిట్లు గొలుపుచూ సూర్యుని వలె ఉగ్రమైన తేజస్సుతో వెలిగిపోతున్న నా షడాననుణ్ణి చూచి మహదానంద భరితులై “హరా! దేవా మీరూ అంబికా, అగ్నిదేవుడు ఈ విధంగా దేవకార్యాన్ని సంపన్నం గావించారు. “వెంటనే లేవండి మనమందర మీక్షణమే మహాశక్తి వంతమూ అవ్యయమూ అయిన కురుక్షేత్ర తీర్థానికి వెళ్లి ఈ అద్భుత బాలకుణ్ణి పవిత్ర సరస్వతీ జలాలతో అభిషిక్తుని గావించుదాము” అన్నారు.
దేవగంధర్వకిన్నర సేనల కితడు నాయకుడౌతాడు. భయంకరులైన మహిషాసుర తారకాసులను వధించ గలడు”. అది విని హరుడు మంచిదంటూ లేచాడు. దేవతలు కూడ ఆయన వెంట కుమారునితో కలసి మహాఫలదాయియగు కురుక్షేత్రానికి చేరుకున్నారు. హరిహరబ్రహ్మలు ఇంద్రాదిదేవతలు మునులూ అంతా కలిసి అభిషేక ప్రయత్నాలు చేశారు. అంతట అచ్యుతాలు, మహాఫలదాయకాలయిన నదీజలాలు సప్తసముద్రోదకాలు, శ్రేష్ఠమైన ఓషధులు వేయింటిని కలిపి, ఆ గుహునకు మంగళాభిషేక స్నానం చేయించారు. సమస్తదేవసేనల నాయకుడుగా కుమారుని అభిషేకించు సమయాన గంధర్వులు గానంచేశారు. అప్సరసలు నాట్యాలు గావించారు. అలా అభిషేకించబడిన ముద్దుబిడ్డను చూచి ముప్పిరిగొన్న వాత్సల్యంతో ఒడిలోకి తీసుకొని ఉమ ముద్దులతో ముంచెత్తింది. కార్తికేయుని అభిషేకంతో తడిగా ఉన్న ముఖాన్ని మాటిమాటికీ గుండెలకు హత్తుకొని ముద్దాడింది. ఆ సమయాన ఆ గిరినందిని, ఇంద్రుని ఒడిలో నుంచుకొని తేజరిల్లిన దేవమాత అదితిని మరపించింది. అలా అభిషేకించబడిన తనయుని చూచి శివుడు ఆనందభరితుడైనాడు. అగ్ని కృత్తికలు కుటిల కూడ ఎంతో ఆనందించారు. దేవసేనాపతిగా పట్టాభిషిక్తుడైన గుహునకు హరుడు, ఇంద్రతుల్య పరాక్రమ వంతులైన ఘంటాకర్ణ లోహితాక్ష నందిసేన కుముదమాలీలను నలుగురు ప్రసిద్ధులైన ప్రమథులను కాన్కగా యిచ్చాడు. నారదా! అలా శివుడు తన గణముఖ్యులను స్కందునకు యివ్వడం చూచి బ్రహ్మాది దేవతలందరూ తమతమ ప్రమథులను సమర్పించారు. బ్రహ్మ స్థాణుగణాన్ని యిస్తే విష్ణువు సంక్రమ, విక్రమ పరాక్రములనే ముగ్గుర్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఉత్కేశ, పంకజులను, రవిరండక, పింగళులను సమర్పించారు. చంద్రుడు మణి, వసుమణులనూ, అశ్వనీదేవతలు వత్సుడు, నంది అను వారిని ఇచ్చారు. అగ్నిజ్యోతి, జ్వలజ్జిహ్వులనూ, ధాతకంద, ముకుంద, కుసుములనే ముగ్గురు అనుచరులను యిచ్చారు. త్వష్ట చక్రానుచక్రులు నిద్దరను, వేద అతిస్థిర, సుస్థిరులను ఇచ్చారు. పూషుడు పాణిపత్యజకాలకులనే యిద్దరు బలశాలురను యిస్తే, హిమవంతుడు స్వర్ణమాలుడు ఘనాహ్వుడనే ఉత్తమ ప్రమథులనిచ్చాడు. వింధ్యుడు తన ఔన్నత్యానికి తగినట్టుగా అతిశృంగుడు పార్షదుల నిచ్చాడు. వరుణుడు సువర్చస అతి వర్చసులను, సముద్రుడు సంగ్రహ విగ్రహులను, నాగులు జయమహాజయులను వారిని, అంబిక ఉన్మాదుడు, శంకుకర్ణ, పుష్పదంతులను, వాయుదేవుడు ఘన, అతి ఘనులను, అంశుమంతుడు పరిఘ, గటక, భీమ, దహాతిదహనులకు ఆ షణ్ముఖునకిచ్చారు. యముడు ప్రమాథ, ఉన్మాథ, కాలసేన, మహాముఖ, తాళపత్ర, నాడీజంఘులను అనుచరులను ఆరుగురను, ధాత సుప్రభ సుకర్ములను గణద్వయాన్నీ ఆ మహాసేనున కర్పించారు.
ఓ మునిసత్తమా! ఆ స్కందునకు మిత్రుడు సువ్రతసత్యసంధులను యక్షులు అనంత, శంకుపీఠ నికుంభ కుముద అంబుజ, ఏకాక్ష కునటి చక్షు, కిరీటి, కలశోదర, సూచీవక్త్ర కోకనద ప్రహాసప్రియక, అచ్యుతులనే పదిహేను గురుగణాలను అర్పించారు. కాళిందీనది కాలకందునీ, నర్మద రణోత్కటుని, గోదావరి సిద్ధయాత్రుని, తమసానది అద్రికంపకుని, సీత సహస్రవాహుని వంజల స్మితోదరుని, మందాకిని నందునీ, విపాశ ప్రియంకరుని, ఇరావతి చతుర్దంష్ట్రుని వితస్త షోడశాక్షుని, కౌశికి మార్జారుని, గౌతమి కథ క్రౌంచులను, బాహుద శతశీర్షుని, వాహానది గోనంద నందికులను, భీమరథి భీముని సరము వేగారిని, కాశీ అష్ట బాహుని, గండకి సుబాహుని, మహానది కువలయుని, మధూదక మధువర్ణుని, ధూతపాప జంబనాకుని, వేణా శ్వేతాననుడిని, వర్ణాస శ్రుతవర్ణుని, దేవసాగర వేగిని, ప్రభావనది అర్థుని, సహుని, కాంచన కనకేక్షకుని విమల గృధ్రపత్రుని, మనోహర చారు వక్త్రుని, ధూత పాప మహారావుని, కర్ణానది ద్రుమ సన్నిభుని, సువేణు సుప్రసాదుని, ఓఘవతి జిష్ణుడిని, విశాల యజ్ఞ బాహువును, ఆ స్కందునకు ఇచ్చాయి. ఈ విధంగా నదులన్నీ కార్తికేయుని కార్యానికి తోడ్పడినాయి. తన ప్రియ పుత్రునికి కుటిల, దేవేంద్రునితో సమాన బలులైన కరాళ, సితకేశ, కృష్ణకేశ, జటాధర, మేఘనాద, చతుర్ధంష్ట్ర, విద్యుజ్జిహ్వ, దశానన, సోమాప్యాయన, దేవయాజి అనే పదిమంది గణప్రముఖులను ఇచ్చింది. కృత్తికలందరు ఆ షణ్ముఖునకు హంసాస్య కుండజఠర, బహుగ్రీవ, హయానన, కూర్మ గ్రీవులనే గణపంచకాన్ని పుత్రవాత్సల్యంతో ఇచ్చారు. ఋషులంతా కలిసి స్థాణుజంఘ, కుంభవక్త్ర లోహజంఘ మహానన పిండకారులనే అయిదుగురను స్కందునకు ఆశీస్సులతో ఇచ్చారు.
ఆ స్కందదేవునకు పృథూదక తీర్థం నాగజిహ్వ, చంద్రభాస, పాణికూర్మ, శశీక్షక, చాషవక్త్ర, జంబూక గణాలను ఇచ్చింది. చక్రతీర్థం సుచక్రాక్షుని, గయాశిరతీర్థం మకరాక్షుని, కనఖలతీర్థం పంచశిఖ అనే స్వంతగణాన్ని కుమారున కిచ్చాయి. బంధుదత్తుని వాజిశిరం, బాహుశాలుని పుష్కరం, మానసతీర్థం సరౌజిన మాహిషకపింగళులను ఇచ్చాయి. ఔశనస తీర్థం వసుదాముని, ప్రభాసంనందినిని, ఇంద్రతీర్థం విశోకుని, ఉదపానం ఘనస్వననూ, సప్త సారస్వత తీర్థంఅద్భుతం గొలిపే నలుగురు మాతృకలు గీతప్రియ, మాధవి తీర్ధనేమి స్మితాననలను ఇచ్చాయి. నాగతీర్థం ఏకచూడను, కురుక్షేత్రం పలాసదను, బ్రహ్మయోని చండశిలను, త్రివిష్టపం భద్రకాళిని, చరణపావన తీర్థం చౌండి, భైండి యోగభైండిలను గణాలను ఇచ్చాయి. మహీసో పానీయను, మానససరోవరం శాలికను, బదరికాశ్రమం శతానంద, శాతఘంట ఉలూఖల మేఖలలను, పద్మావతి మాధవీ గణాలను ఇచ్చాయి. కేదారక్షేత్రం సుషమ, ఏకచూడ, దేవి, ధమధమా, ఉత్ర్కాథని వేదమిత్రులనే మాతృగణాల నిచ్చింది. రౌద్రమహాలయం సునక్షత్రాన్ని, కద్రూల, సుప్రభాత, సుమంగళ, దేవమిత్ర చిత్రసేనలను ఇస్తే ప్రయాగ కోటర, ఊర్ధ్వవేణి శ్రీమతి బహుపుత్రిక పతిత, కమలాక్షీలనే మాతృగణాన్ని ఇచ్చింది. సర్వపాపవిమోచన క్షేత్రం సూపల, మధుకుంభ, ఖ్యాతిదహదహ పరా, ఖటకటా సంతాని కవికవికలనుయిచ్చింది. క్రమతీర్థం చత్వరవాసిని, జలేశ్వరి, కుక్కుటిక, సుదామా లోహమేఖలా గణాలను ఇవ్వగా శ్వేతతీర్థం వపుష్మతి, ఉలూకాక్షి, కోకనామ మహాశనీ రౌద్రాకర్కటిక తుండగణాలను కార్తికేయున కిచ్చింది. ఇందరు భూతాలు గణాలు మాతృకలు ఆ స్కందుని సేవించడం చూచి మహాత్ముడగు వైనతేయుడు పరమ వేగశాలిఐన తన కుమారుడు మయూరు (నెమలి)ని, అరుణుడు తన పుత్రుడు తామ్రచూడు (కోడి)ని ఆయనకు సమర్పించారు. అగ్నిదేవుడు శక్తిని, పార్వతి వస్త్రాన్ని, బృహస్పతి దండాన్ని, కుటిల కమండలాన్ని, విష్ణువు పుష్పమాలను, శంకరుడు ధ్వజాన్ని, ఇంద్రుడు తన మెడలోని స్వర్ణహారాన్ని విశాఖునకు ఇచ్చారు. భూతగణాలందరు తన్ను పరివేష్టించి కొలువగా మాతృగణాలు వెంటరాగా దేవసేనాధిపత్యం వహించిన ఆహారాత్మజుడు మయూరం మీదనెక్కి భాస్కర ప్రభతో వెలిగిపోయాడు.
పులస్త్యుడిట్లనెను, దేవతలు తనను దేవసేనల కధిపతిగా అభిషేకించిన తర్వాత నా కుమారుడు భక్తితో శివునకు పార్వతికి, అగ్నికి, ఆరుగురు కృత్తికలకు కుటిలకు బ్రహ్మకు తలవంచి ప్రణామాలుచేసి ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీకు నమస్సులు. ఓ తపోధనులారా! మీకు ప్రణామాలు. మీ అందరి అనుగ్రహ ప్రసాదాలతో నేనా శత్రువులను మహిష తారకులను జయించెదను. శిశువునగుటచే మీతో మాటాడుట నాకు తెలియదు. విరించితో కలిసి మీరందరూ నాకనుజ్ఞ నొసగుడు. అలా మాటాడిన కుమారుని వచనాలు విని దేవతలంతా భయంవీడి ఒకరినొకరు చూచుకున్నారు. శివుడు కూడ పుత్రవాత్సల్యంతో లేచి విరించి చేయి పట్టుకొని స్కందుని వద్దకు తీసుకువెళ్ళాడు. అంతట ఉమాదేవి కుమారునితో “నాయనా! పుత్రా రమ్మురమ్ము! ఓ శత్రుసంహారకా! సర్వజన వంద్యుడైన అచ్యుతుని దివ్య చరణాలకు నమస్కరించుము అని అన్నది. అందుల కాతడు నవ్వి, “అమ్మా! నాలాంటివాడు గౌరవంతో నమస్కరించదగిన ఆయన ఎవరమ్మా? అని అడిగెను. అందులకా అంబిక, “నీవు మొదట ఆయనకు నమస్కరించుము. తర్వాత ఆయనను గురించి బ్రహ్మ నీకు చెప్పగలడు. ఆయన్ను మించిన దైవం మరొకరెవ్వరూ మాతోసహాలేరని మీతండ్రి నాకు చెప్పినాడు. కనుక నా గరుడ ధ్వజునకు నమస్కరించుమనెను. పార్వతి చెప్పిన ప్రకార మాస్కందుడు జనార్దనునకు మ్రొక్కి చేతులు జోడించుకొని నిలబడగా ఆ విష్ణువు స్వస్తివాచనం గావించి అనుజ్ఞ నొసగెను.