సప్త భైరవోత్పత్తి

దక్షిణం వైపు కారిన రక్తధార నుండి నల్లని కాటుక కాంతితో ప్రేతాలను అలంకరించుకొని కాలరాజనే భైరవుడు ఉద్భవించాడు. పశ్చిమాన ప్రవహించిన ధార నుండి దిరిసెన పువ్వు కాంతితో ఆకులతో అలంకరించుకొని కామరాజు అనే భైరవుడు వచ్చాడు. మరొక భైరవుడు సోమరాజును వాడు ఉత్తర దిక్కు ధార నుంచి శూలం చక్రం మాలను ధరించి బయలుదేరాడు. రక్తసిక్తమైన గాయంనుండి ఇంద్రధనుస్సు కాంతితో శూలం పట్టుకొని స్వచ్ఛంద రాజనే భైరవుడు రాగా భూమి మీద పడిన రక్తం నుంచి సౌభాంజన కాంతితో శూలపాణియై లలిత రాజను భైరవుడు నిర్గమించాడు. వీరు సప్తభైరవ మూర్తులు కాగా ఓ నారదా! విఘ్నరాజు అష్టమ భైరవుడుగా ఎన్నబడుతున్నాడు వీరలను భైరవాష్టకంగా స్మరిస్తారు. వీరులు పరివేష్టించి ఉండగా ఆ ప్రధాన భైరవమూర్తి త్రిశూలి, ఆ అంధకుడి దేహాన్ని శూలాగ్రాన గ్రుచ్చి ఎత్తి ఛత్రంలాగా ధరించాడు! ఓ బ్రహ్మర్షీ! ఆ అంధకుడి శరీరం నుండి ధారాపాతంగా రక్తం ప్రవహించి, శూలపాణి అయిన ఆ సప్త భైరవమూర్తి మహాదేవుణ్ణి కంఠం వరకు ముంచివేసింది. అప్పుడు విపరీతమైన అలసట వల్ల శంకరుని ఫాలభాగం నుంచి చెమట బిందువులు జారగా వానినుండి రక్తసిక్తమైన దేహంతో నొక బాలిక ఉద్భవించింది. శివుని ముఖాన్నించి కారిన స్వేదబిందువులు భూమి మీద పడగా అందులో నుంచి ఎర్రటి నిప్పు కణాల్లాంటి బాలకుడు పుట్టాడు. గొంతు ఎండిపోతున్న ఆ బాలకుడా అంధకుని రక్తాన్ని గటగటా త్రాగేశాడు. ఆ కన్యకూడ అద్భుతం గొల్పుతూ ఆ రక్తాన్ని నాలుకతో లపలపమంటూ నాకివేసింది. నారదా! అప్పుడు ఆ భైరవమూర్తి శంకరుడు బాలసూర్యుని కాంతితో ఉన్న ఆ బాలికను చూచి లోకహిత కాంక్షతో యిలా అన్నాడు. ఓ కల్యాణీ; నిన్నికమీద దేవ, పితృ, ఋషి, ఉరగ, యక్ష విద్యాధర, మనుష్యా దులంతా భక్తితో పూజిస్తారు. ఎల్లప్పుడు నీకు బలులు పుష్పాంజలులు అర్పించి స్తోత్ర పాఠాలు చేస్తారు. రక్తలేపనంగల దానవగుటచే నిన్ను చర్చిక అనే చక్కని పేరుతో పిలుస్తారు. “ఈ విధంగా వరదాయకుడైన ఆ పరమేశ్వరునిచే అనుజ్ఞాతయై ఆ భూతాల చెల్లెలు చర్చిక, సింహపు చర్మంధరించి, భూమి నలువైపులా సంచరించి ఉత్తమమైన హైంగు లతాద్రికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తరువాత నా వరదేశ్వరుడు భూమినుంచి పుట్టిన బాలకుడు కుజునకు సర్వోత్తమమైన వరం ఇస్తూ, ఓ మహాత్మా! నీకీ నాటినుండి శుభా శుభకరమైన గ్రహాదిపత్యం ఇస్తున్నా. దీనితో జగత్తు మీద ఆధిపత్యం కలిగి ఉంటావ”ని అభినందించాడు. అనంతరం వేయిదివ్య సంవత్సరాల వరకు సూర్యాగ్ని మయాలైన తన నేత్రజ్వాలలతో భగవంతుడైన నా భైరవుడా అంధకుని శరీరంలోని రక్తమాంసాదులను శుష్కింపజేశాడు! వాడిలో చర్మం ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. పరమశివుని నేత్రాగ్నిలో అంధకుడు తన పాపాలన్నీ భస్మం గావించుకొని పరిశుద్ధుడయ్యాడు. సర్వేశ్వరుడు సర్వరూపి, అవ్యయుడు, త్రిలోకపతి, వరదాయకుడు, సర్వ దేవతలకు ఆరాధ్యుడునైన ఆ మహాదేవుని నిజతత్వం వానికి అవతరమైంది. అంతట చేతులు జోడించుకొని, ఆ ఆదిదేవుణ్ణి, శరణ్యుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు.