ఉత్పాత కారణాల గురించి బలి ప్రశ్న

పులస్త్యుని వచనము. నారదా! అలా భగవంతుడగు విష్ణుడు బయలుదేరగానే భూమి కంపించింది! పర్వతాలు కదలిపోయాయి, సముద్రాలు క్షోభించాయి! నక్షత్ర మండలమంతా తమ గతులు తప్పాయి. యజ్ఞం చాలా కలవరపడిపోయింది అయ్యో! మధుసూదనుడు నన్నేమి చేయనున్నాడో గదా! పూర్వం మహేశ్వరునకు వలె ఈ వాసుదేవుడు గూడ నన్ను దగ్ధం చేస్తాడా ఏమి! ఋక్సామ మంత్రాలతో బ్రాహ్మణులు చక్కగా సమర్పించినప్పటికీ ఆ ప్రభువునకు భయపడి యజ్ఞాగ్నులా హవిర్భాగాలను స్వీకరించలేదు. ఆ భయంకర ఉత్పాతాలను చూచి దైత్య నాయకుడగు బలి చేతులు జోడించుకొని శుక్రాచార్యులతో యిలా అన్నాడు: ఆచార్యవర్యా! గాలి తాకిడికి కదలిపోయే అరటి చెట్టు మాదిరి భూమి చలిస్తోంది. మన అసురులు సమర్పించే మంత్ర పూతాలయిన హవిస్సులను అగ్నులు స్వీకరించడం లేదు. అందువలన పర్వతాలు ఊగి పోతున్నాయి! సముద్రాలు క్షోభిస్తున్నాయి. ఆకాశాన ఎప్పటి వలె నక్షత్రాలు సంచరించడం లేదు. దిక్కులు తెలివి తప్పిపోతున్నాయి. ఎవరి దోషం వల్ల ఈ విపరీతాలు జరుగుతున్నాయో దయతో సెలవీయండి. బలి మాటలువిని ఆ శుక్రుడు అందులకు కారణాలు గ్రహించి శిష్యునితో యిలా హితం పలికాడు. దైత్యేశ్వరా! చక్కగా వ్రేల్చబడిననూ హవిర్భాగాలను అగ్నులు స్వీకరించక ఉన్నవనుచో యిచ్చటకు వాసుదేవుడు తప్పక వస్తూ ఉండాలి. ఆయన అడుగుల భారాన్ని వహించలేకనే పర్వతాలతో కూడిన భూమికంపిస్తోంది. ఓ రాజేంద్రా! ఆయన నడుస్తూ ఉంటే సముద్రాలన్నీ క్షోభించి తెలియకట్టలు దాటుతున్నాయి. శుక్రుని మాటలు విని బలి అ భార్గవునితో ఉత్సాహపూరితుడై సత్య ధర్మ సహితాలూ హితకరాలు అయిన మాటలన్నాడు భగవన్! వాసుదేవుడే వస్తున్నప్పుడు ధర్మార్ధ కామసమ్మితంగా నేనుచేయవలసిన కర్తవ్యమేదో సెలవు ఇవ్వ వలసినది. భూగజాశ్వమణి కనకాది సంపద ఏదో ఆప్రభువుతో ఏమి మాట్లాడనగునో, స్వలాభము, ఆయన లాభము, వీనిలో దేనిని అనుష్ఠించవలెనో, ఈ విషయాలన్నీ నాకు ప్రియకరంగా, హితకరంగా, సత్య విహితంగా సెలవివ్వండి. దైత్యనాధుని ఉత్తమ వచనం విని త్రికాల జ్ఞాని అయిన ఆ భార్గవుడు బాగా యోచించి ఇలా అన్నాడు: అసురేంద్రా! శ్రద్ధగా వినుము. వేదాలు అసురులకు యజ్ఞభాగ భోక్తృత్త్వాని నిషేధించినవి. శ్రుతి ప్రమాణంగా ఆ యజ్ఞ భాగార్హులయిన దేవతలు ఈ నీయజ్ఞంలో తిరస్కరింపబడినారు. వేదోక్తంగా దేవతలకు వారి భాగాలు యివ్వకపోవడం అందుకు వ్యతిరేకంగా దైత్యులకు హవిస్సులు యివ్వడం చూచి శ్రీహరి వచ్చుచున్నాడు. ఆయన యజ్ఞానికి వచ్చినపు డేమి చేయవలెనని నీవు నన్నడిగితివి. అందుకు నా సమాధానం విను ప్రభూ! ఆ విష్ణువుకు ఈ యజ్ఞంలో భూ కనకాదులననేల కడ కొక గడ్డి పరక కొన(తృణాగ్రం) కూడా నీవుయివ్వకూడదు. అయితే తియ్యగా వ్యర్థపు మాటలు సామ ధోరణిలో ఆయనతో ఇలా అనాలి. ఎవరి ఉదరంలో భూర్భువ స్వర్లోకాల పాలకులు, రసాతలాధీశులు ఎప్పుడూ నివసిస్తూఉంటారో, అటువంటి నీకు ఎవరుమాత్రం ఏమి ఇవ్వగలరు ప్రభూ! శుక్రుని హిత బోధవిని వదాన్యుడుగు బలి ఇలా అన్నాడు: ఓ భార్గవా! నేను ఇంతవరకు ఎలాంటి హీనశీలుడు వచ్చి చేయిచాచినా నా దగ్గర ఏమీ లేదు, నీకేమీ ఇవ్వదలచను పొమ్మని ఏనాడూ అనలేదు. అలాంటప్పుడు లోకేశ్వరుడగు జనార్దనుడే వచ్చి అర్థిస్తే ఎలా కాదనగలను ఆచార్యా! -