వామన మహా పురాణము
ఔశనశతీర్థం - రహోదరుని కథ
విప్రోత్తములారా! అచట నుండి ఔశనస తీర్థానికి శ్రద్ధాభక్తులతో వెళ్ళవలెను. అక్కడనే ఉశవసుడు (శుక్రుడు) సిద్ధిపొంది గ్రహత్వాన్ని సంపాదించాడు. అక్కడ స్నానంచేస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి నరుడు పునరావృత్తిలేని బ్రహ్మలోకానికి పోతాడు. భయంకరమైన శిరస్సుతో పీడింపబడిన రహోదరుడనే ముని అక్కడనే ఆ శిరస్సునుండి విముక్తుడైనాడు. అంతట ఋషులిలాఅడిగారు. రహోదరమునికి శిరోగ్రహణం ఎలా పట్టింది? అది ఆ తీర్థమహిమ వల్ల ఎలా తొలగిపోయింది. దయచేసి చెప్పండి. అందుకు లోమహర్షణుడిలా చెప్పసాగాడు. ఓ బ్రాహ్మణులారా! పూర్వం దండకారణ్యంలో ఉన్నప్పుడు మహాత్ముడగు శ్రీరాముడెందరో దుష్టరాక్షసులను సంహరించాడు. అప్పుడొక దుర్మార్గుడి తలను నిశితకరవాలంతో ఖండించగా అదిపోయి ఒక మహారణ్యంలో పడ్డది. అఅడవిలో తిరుగుతున్న రహోదరుని తొడకు ఆ రాక్షసుని తలతగిలి ఎముకను చీల్చుకొని లోపల ప్రవేశించింది. తొడ భిన్నమైనందున ఆ బ్రాహ్మణుడు సంకల్పించుకొన్న తీర్థాలకు వెళ్లలేక పోయాడు. అలా చీము కారుతున్నప్పటికీ ఆ బాధను సహిస్తూ ఆ బ్రాహ్మణుడు భువిలోగల సర్వ తీర్థాలనూ సేవించాడు. దారిలో తాను దర్శించిన ఋషులకు తనబాధ తెలుపుకోగా వారాతనిని ఔశనస తీర్థానికి వెళ్లమని సలహా ఇచ్చారు. అంత రహోదరు డక్కడకు వెళ్ళి జలస్పర్శ చేయగానే అ శిరస్సు అయన తొడ నుండి ఊడి నీళ్ళలో పడిపోయింది. అలా అతని బాధతొలగిపోయి పాపముక్తుడైనాడు. అలా పవిత్రుడై అశ్రమానికి తిరిగివెళ్ళి అ విషయం అందరకూ వివరంగా చెప్పాడు. అది వినిన ఋషులంతా ఆ తీర్థమహిమకు సంతసించి దానికి కపాల మోచనమని నామకరణం చేశారు.