నందీశ్వర రణ విహారం

పులస్త్యుడు చెప్ప ప్రారంభించాడు! ప్రమథుల చేతిలో హతమైన తన సైన్యాన్ని చూచి ఆ అంధకుడు రాక్షసగురువైన శుక్రుని సమీపించి ఇలా అన్నాడు. “భగవన్! తమ అండ చూచుకొని మేము దేవకిన్నర గంధర్వాదులను సంహరిస్తున్నాము. బ్రహ్మర్షీ! ఇటు చూడుడు. నాచే రక్షితమైన సేన అంతయు ప్రమథులచేత పరాభవింపబడి అనాథవలె పారిపోయి వచ్చినది. నా సోదరులయిన కుజంభాదులు చనిపోయారు. ఓభార్గవా! ఇక ప్రమథులో, కురుక్షేత్రఫలం లాగా అక్షయంగా ఉన్నారు. కాబట్టి మేము శత్రువులచేతిలో పరాజయం పొందకుండా తగిన ఉపాయం చేయండి. అంధకుని మాటలు విని, దేవర్షీ! ఆ బ్రహ్మర్షి దానవేశ్వరునితో అద్భుత వచనాలు పలికాడు. అంధకా ఊరడిల్లుము. నీమేలుకోసం యత్నిస్తాను. నీకు ప్రియం కలిగిస్తాను అని అలా ఓదార్చి ఆకవి, శుచియై సంజీవని విద్యను విధివిధానంగా వినియోగించగా అంతకుముందు యుద్ధంలో చనిపోయిన దైత్యదానవ శ్రేష్ఠులంతా లేచి కూర్చున్నారు. కుజంభాది దైత్యులు మరణించి మరల లేవడం యుద్ధానికి రావడం చూచి నందీశ్వరుడు శంకరునితో ఇలా అన్నాడు. మహాదేవా! ఈ అద్భుతాన్ని ఆలకించండి. అనూహ్యంగా అసంభవమైనది. చచ్చిన వారలు మరల బ్రదుకుట సంభవించినది. ప్రమథులు శక్తిశౌర్యాల వల్ల యుద్ధంలో మరణించిన దైత్యుల నందరనూ భార్గవుడు తన విద్యచేత బ్రతికించాడు. ఆవిధంగా మేముగావించిన మహత్ సంగ్రామ మంతా వ్యర్థంగావించబడింది. నందిమాటలు విని శివుడు స్వకార్య సిద్ధికై అతనితో నీవు వెళ్ళి ఆ శుక్రుని నా ఎదుట గొనిరమ్ము. నేను సమయోచితంగా మాటలాడి అతనిని నిరోధించెదనని వానిని పంపాడు. అలా శంకరునిచే ఆదేశింపబడి ఆ గణాధిపతి అయిన నంది, శుక్రుని పట్టుకొనుటకై రాక్షస సైన్యం వద్దకు వెళ్ళాడు.

అలా వస్తూన్న నందిని చూచి రాక్షసవీరుడైన హయకంధరుడు ఆయనను అడ్డగించాడు. అడవిలో సింహాన్నెదిరించిన లేడిలాగ తనకెదురైన ఆ దైత్యునిమీదకు లంఘించి నంది, నూరు అంచులుగల తన వజ్రాయుధంతో మోది మూర్ఛ బడగొట్టాడు. వానిని తప్పించుకొని వస్తూన్న నందిని, కుజంభ, జంభ, బలి, వృత్ర, అయఃశిరులను అయిదుగురు దైత్య శార్దూలాలు చుట్టు ముట్టారు. మయుడు హ్లాదుడాదిగా గల యితర దానవవీరులు గూడ అనేక ఆయుధాలు చేపట్టి నందిమీద దాడిచేశారు. అలా ఆ రాక్షసవీరులచే దెబ్బలు తింటూన్న ఆ గణాధిపతిని ఆకాశంలో నిలబడి బ్రహ్మ మొదలయిన దేవతలు చూచారు. ఆ పరిస్థితి గమనించిన బ్రహ్మ యింద్రునితో వెళ్లండి మీరంతా వెళ్ళి ఈ అదనున శంకరునకు సహాయపడండని పంపాడు. దానితో ఇంద్రాదులంతా వాయువేగంతో శివ సైన్యానికి బాసటగా ఆకాశాన్నుంచి ఊడిపడి నిలచారు. మహానదులంతా త్వరత్వరగా మహాసముద్రంలోపడి కలిసినట్లా దేవతలు శివసైన్యంలో పడి కలిసిపోవడంతో భయంకరమైన ఘోషతో ఇరువర్గాలు తలపడ్డాయి. అ గందరగోళంలో తప్పించుకుని ఆ నందీశ్వరుడు వెళ్ళి రథంమీద నుంచి సింహం కుందేలును లాగినట్లు శుక్రుణ్ణి ఒడిసి పట్టుకొని, ఆయన రక్షణ కోసం వచ్చిన వారందరినీ నేలబడగొట్టి శివుని ముందుతెచ్చి పడవేశాడు. ఆ శుక్రుని అమాంతంగా శివుడు తన నోటిలో వేసికొని మింగివేశాడు. అలా శివుని ఉదరంలో బంధింపబడి ఆ భార్గవుడు భక్త్యాదరాలతో నా మహాదేవుని ఇలా స్తుతించాడు. “హరా! వరదా! గుణశాలీ నీకు నమస్కారము. శంకరా, త్ర్యంబకా మహేశా నీకు నమస్సులు, జీవనా! లోకేశ్వరా! వృషాకపీ! మదనాంతకా! కాలనాశనా! వామదేవా నీకు అంజలులు! స్థాణూ, విశ్వరూపా, సదాగతీ, వామనా, మహాదేవా శర్వా! ఈశ్వరా నమోవాకములు. త్రినేత్రా హరా, భవా శంకరా ఉమాధవా జీమూతకేతూ గుహావాసీ, శ్మశాన ప్రియా, భస్మధరా, శూలధరా పశుపతి గోపతీ తత్పురుషోత్తమా! నీకు మాటిమాటికీ నమస్సులు. ఇలా స్తోత్రం చేసిన శుక్రుని పట్ల ప్రీతుడై శంకరుడు వరము కోరుకోమనగా నతడు నీ ఉదరం నుండి బయటపడునట్లను గ్రహించమని వేడుకొన్నాడు. అంతట హరుడు తన నేత్రాలు మూసికొని, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! నా కడుపులో నుండి బయటకు వెళ్ళుమని ఆదేశించాడు. అలా శివుని ఉదరంలో నుంచి బయటకు వచ్చుటకు ప్రయత్నిస్తూ అందులో పాతాళాది భువనాలు సాగరాలను సచరాచర జీవులను ఆదిత్య రుద్ర వసు విశ్వదేవాదులను యక్షకిన్నర గంధర్వాప్సరస సమూహాలను, మునులను, మనుష్యులను చూచి పరిభ్రమింపసాగాడు.

శివుని ఉదరంలో తిరుగుతూ ఆ భార్గవుడు పశుకీటపిపీలికాలను వృక్షగుల్మలతాదులను ఫలమూలాలను ఓషధులను స్థల జలచరాలను అనిమిషులు నిమేషులను, చతుష్పాదులను, ద్విపాదులను, వ్యక్తావ్యక్త సగుణ నిర్గుణ ప్రాణులను చూస్తూ అత్యంత కౌతుకంతో ఒక దివ్య సంవత్సరకాలం తిరుగాడుతూ గడపినా బయటపడే దారి కనుగొన లేకపోయాడు. ఓ నారదా! అలా తిరిగి తిరిగి అలసిపోయి కర్తవ్యం తోచక భక్తితో ఆ పరమశివునకు శరణాగతుడై ఇలా ప్రార్థించాడు. “ఓ మహారూపా! అక్ష సూత్రాలను ధరించిన విశ్వమూర్తీ సహస్రాక్షా మహాదేవ ప్రభో! నీకు శరణాగతుడనయ్యాను. ఓ శంకరా శర్వా శంభో సహస్ర నేత్ర చరణ ధరా భుజగభూషణా! నీ విశాల హృదయంలో సకల భువనాలను దర్శించి అలసిపోయి నీ పాదాలకడ ఆత్మ సమర్పణం చేస్తున్నాను. నన్ను కరుణించుము.” శుక్రుని దీన పరిదేవనం విని మహాత్ముడగు శంభుడు నవ్వి ఇలా అన్నాడు. “భార్గవా! నీవునాకు పుత్రుడవైనావు. నా శిశ్నం ద్వారా బయటకు రమ్ము. ఇతర విచారాలన్నీ మానుము. నేటి నుంచి నీవు ‘శుక్రు’ డనే పేరుతో చరాచర జీవులందరకు స్తవనీయుడవు అవుతావు.” అలా చెప్పి శంకరుడా భార్గవుని శిశ్న మార్గాన బయటకు వదిలాడు. అలా శిశ్న ద్వారా వెలువడిన భార్గవుడు శుక్ర మహానుభావుడుగా ఖ్యాతుడయ్యాడు. అంతట శర్వునకు ప్రణమిల్లి త్వరగా రాక్షస సేనలోకి వెళ్ళి చేరాడు. తమ గురువు తిరిగి వచ్చినందులకా దానవులంతా సంతోషించి గణాధిపతులతో మరల యుద్ధానికి సన్నద్ధులయ్యారు. శివగణాధిపతులు గూడ దేవగణాలతో కలిసి ఆ దానవులతో విజయ కాంక్షతో సంకుల సమరం గావించారు. “ఓ తపోధనా! పరస్పర జయకాంక్షతో తలపడిన వారల పోరు భయంకరమైన ద్వంద్వ యుద్ధాలలో మరింత ఘోరమైంది. అంధకుడు నందితో, ఆయః శిరుడు శంకరునితో, బలి కుంభ ధ్వజునితో, విరోచనుడు నందిషేణునితో, అశ్వగ్రీవుడు విశాఖునితో, వృత్రుడు శాఖునితో, బాణుడు నైగమేయుడగు బలునితో తలపడ్డారు. వినాయకుడు గండ్రగొడ్డలి ధరించి రాక్షస శ్రేష్ఠుడు తుహుండునితో ఢీకొనగా దుర్యోధనుడు మహాబలి ఘంటాకర్ణునితో పెనగులాడటం మొదలుపెట్టాడు.

హస్తి కుండోదరునితో, హ్లాదుడు వీరుడైన ఘటోదరునితో, ఇలా ఆ పరాక్రమవంతులైన రాక్షసులు ప్రమథులు పరస్పరం ఓ దేవర్షీ! ఆరు వందల దివ్య సంవత్సరాలు యుద్ధం చేశారు. అంతవరకు ప్రక్కన నిలబడియున్న ఇంద్రుడు వజ్రాయుధంతో యుద్ధానికి రాగా జంభుడను మహాదైత్యు డాయనను అడ్డగించాడు. శంభుడను దైత్యుడు బ్రహ్మతో, కుజంభుడను వీరుడు, రాక్షసాంతకుడూ మహౌజసుడునగు విష్ణువుతో, శాల్వుడు వివస్వంతునితో త్రిశిరుడు వరుణునితో, ద్వైమూర్ఖుడు వాయువుతో, రాహువు చంద్రునితో విరూపధృక్ మిత్రునితో పోరు సాగించారు. ధరుడు మొదలుగాగల వసువు లెనమండు గురూ, శరభ, శలభ, పాక, పృథు, విపృథు, వాతాపి ఇల్వలులను ఎనిమిదిమంది మహాదైత్యులతో సంగ్రామం సాగించారు. విష్వక్సేనుడాదిగా గల విశ్వ దేవగణాల వారినందరనూ అసహాయ శూరుడైన కాలనేమి అనే రాక్షసుడొక్కడే ఎదుర్కొన్నాడు. విద్యున్మాలి అనే మహాదైత్యుడొక్కడే రణకుతూహలంతో ఏకాదశ రుద్రులమీద విరుచుక పడ్డాడు. వరకుడు అశ్వినులతో, ద్వాదశాదిత్యులతో శంబరుడు, నివాతకవచు లిర్వురు, మిగిలిన సాధ్యులతో మరుత్తులతో తలపడి పోరుసాగించారు. ఈవిధంగా ప్రమథులు, దేవతలు దానవ వీరులతో వేలాది జంటలుగా ఏర్పడి అరువది దివ్య సంవత్సరాల కాలం ఘోరంగా పోరాడారు. అయినా ఆ ప్రమథామరులను, రాక్షసులు నిర్జింప జాలక తమ మాయను గప్పి వారందరనూ మ్రింగివేశారు. అలా ప్రమథులను దేవతలను రాక్షసులు మ్రింగివేయగా నామందంగిరి శిఖరం నల్లని వర్షాకాలపు మేఘాలతో కప్పబడిన కొండకొమ్ములాగా కనిపించింది. రాక్షసుల మాయను గ్రహించిన మహేశ్వరుడు ఉగ్రుడై ఒక్క పర్యాయం గట్టిగా ఆవులించాడు. ఆయన ఆవులింత గాలి సోకినంతనే ఆ మహాదానవులంతా ఆలస్యం (సోమరితనం)తో స్ఫూర్తిని కోల్పోయి మెల్లగా గొణుగుకుంటూ వికారంగా తమ నోళ్ళను తెరచి, చేతుల్లోని ఆయుధాలు జారవిడిచి, ఆవలించసాగారు. అలా ఆ దైత్యులంతా నోళ్లు తెరవగానే వారలు మ్రింగిన ప్రమథులు దేవతలూ అందరూ, ఆకులతో వాళ్ళ శరీరాల్లో నుంచి బయటపడ్డారు. కారు మేఘాల్లాంటి రాక్షసుల నోళ్ళ నుంచి దేవతలు ప్రమథులు తమ సహజ నేత్ర కాంతులతో బయట పడటంతో, మెరుపు తీగలతో నిండిన మేఘాల్లాగ ఆదృశ్యం శోభించింది. ఓ తపోధనా! అలా బయటపడిన దేవతలు ప్రమథులు ఇనుమడించిన క్రోధంతో మరల దానవులతో యుద్ధం చేయసాగారు.