వామన మహా పురాణము
ప్రహ్లాదుడు విష్ణువు వద్దకు పోవుట
దానితో విసిగిపోయి ప్రహ్లాదుడు పీతవాసుడగు విష్ణుదేవుని సమీపించి యిట్లనెను- "ఓ దేవ దేవేశ్వరా! యింతకాలం యుద్ధ మొనరించినను, ఈ సాధ్యుడగు నారాయణుని జయింపలేకపోతిని. ఇందులకు కారణమేమి?”
అనగా విష్ణువు ఇట్లనెను, ప్రహ్లాదా! మహాబాహువగు నీ ధర్మపుత్రుని నీవు జయింప జాలవు. ధీమంతుడగు నీసాధ్య విప్రోత్తముని దేవతలు రాక్షసులు సైతము నిర్జింపలేరు సుమా! అని పలుకగా "ప్రభూ! ఆతడజేయుడగుచో నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరుటెట్లు? నా వంటివాడు హీన ప్రతిజ్ఞుడై ఎట్లు జీవింపగలడు? కాబట్టి ఓ విష్ణూ! నీ ఎదుటనే ఈ శరీర శోధనము కావించుకొందును.” అని ప్రహ్లాదుడు అనెను.
విష్ణునితో ఇట్లుపలికి ప్రహ్లాదుడు శిరస్నానము గావించి ఆసీనుడై బ్రహ్మాను సంధానమునకు ఉపక్రమించెను. అంతట నతనితో విష్ణుడిట్లనెను. “నీ వాయనను భక్తి ప్రపత్తులతోనే జయింపగలవు. యుద్ధమున ఎన్నటికీ జయింపజాలవు. అని ఆజ్ఞ ఇచ్చెను.
ఆ మాటలకు ప్రహ్లాదుడు, ఓ మహాదేవా! నీ దయవల్ల నేను ముల్లోకాలనూ జయించాను. ఇంద్రుని సైతం గెలిచాను. ఈ ఇర్వురు మూడు లోకాలకూ అజేయులగుచో, ఓ అభవా! నేనెట్లు జీవింతును? నాకు దారి ఏది? అని ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు పీతవాసుడిట్లనెను: ఓ దానవేశ్వరా! లోకకల్యాణ కాంక్షతో ధర్మ ప్రవర్తనార్థమై నేనే కఠోర తపశ్చర్యకు పూనుకొంటిని. కాబట్టి నీవు జయింపగోరుచో, వారల నారాధింపుము. వారిని భక్తితో జయింపుము. వెళ్లి ధర్మసుతునకు శుశ్రూషగావింపుము అని శ్రీ విష్ణుడిట్లు చెప్పగా దానవేంద్రుడు సంతోషించినవాడై అంధకుని బిలిచి “మహాబలశాలివైన అంధకా! దైత్యదానవులను నేటి నుండియు నీవు పరిపాలించుము. నేనీ రాజ్యము పరిత్యజిస్తున్నాను. దీనిని నీవు గైకొనుము” అని పలుకగా హిరణ్యాక్ష పుత్రుడైన అంధకుడు ప్రహ్లాదుని కోరిక ప్రకారము రాజ్యము తీసికొనగా ప్రహ్లాదుడచ్చట నుండి పవిత్రమైన బదరికావనమునకు బోయెను. అచట నరనారాయణులను చూచి నమస్కరించెను. అతనిని చూచి మహాతేజస్వి అయిన నారాయణు “అసురోత్తమా! ఇదేమి, మమ్ము జయింపక ఈ నమస్కరించుటేల?” అనెను.