బ్రహ్మకృత వామన స్తుతి

సర్వాధీశా! సర్వాజేయా నీకు జయమగుగాక, విశ్వగురు నీకు జయము. శ్రీహరీ, జన్మమృత్యుజరాతీతా, అచ్యుతా జయము జయము! అశేషా, అవ్యక్తరూపా, సర్వజ్ఞా, పరమార్థ రూపా, జ్ఞానజ్ఞేయసారరూపా, జగత్సాక్షీ, జగత్కారణా, జగద్గురో, జగత్ స్థితి పాలకా నీకు జయమగు గాక! సకల జీవహృదయ నివాసా, ఆదిమధ్యాంతమయా, జ్ఞానమయా! ముముక్షువులకు గూడ నిర్దేశించుటకు అలవిగానివాడా, నిత్యహృష్టా, దయాది సద్గుణభూషణా, అతిసూక్ష్మ, స్థూలా, దుర్జ్ఞేయా సర్వమయా జయము. ఇంద్రియ రూపా, ఇంద్రియరహితా, స్వమాయా యోగస్థితా, శేషశాయీ నీకు జయము జయము! నిజదంష్ట్రాగ్ర భాగాన వసుంధరను నిలిపిన ప్రభూ, నృకేసరీ, దేవశత్రు వక్షఃస్థల విదారణా ప్రస్తుతం కపటవామన రూపందాల్చిన విశ్వాత్మకా కేశవా నీకు జయము. స్వీయమాయా పరిచ్ఛిన్నా! జగద్ధారకా, జనార్దనా, అనేక స్వరూపాలలో వెలిగే ఏకైక తత్వమా, బహువిధ ప్రకృతి వికృతులు పెంపొందించువాడా నీకు జయము. నీవు వర్ధిల్లుము. జగదీశుడవగు నీవు ధర్మానికి మూలాధారుడవు. ఇలాంటి నిన్ను నేనుగాని ఈశుడుగాని ఇంద్రాది దేవతలు గానీ సనకాది మునులు యోగులుగాని తెలియజాలరు. నీవు స్వీయ మాయ అనే తెరమరు గున ఉంటావు. అలాంటి మాయాపతిని నిన్నెరుగగల వారెవ్వరు? నీ అనుగ్రహం కలిగిన వాడే నిన్నెరుగగలడు. నిన్నారాధించి నీ కృపకు పాత్రుడగువాడే నిన్ను గుర్తించును. ఓ ఈశాన, ఈశ్వరేశ్వర భూతభావనా వర్ధిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వాత్మా! విశ్వకల్యాణార్థం నీవు వర్ధిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వకల్యాణార్థం నీవు వర్ధిల్లుము. నీకు జయమగు గాక! అని ఈ విధంగా స్తోత్రం చేశాడు.

లోమహర్షణుడు అటు తరువాత మునులతో, బ్రహ్మ స్తోత్రం విని వామనాకృతి దాల్చిన ఆ హృషీకేశుడు చిరునవ్వునవ్వి భావగంభీరముగా “విరించీ! నీవు ఇంద్రాదులు కశ్యపుడు పూర్వం నన్ను స్తుతించగా యింద్రునకు ముల్లోకాలు యిస్తానని ప్రతిజ్ఞచేసి యున్నాను. తర్వాత అదితి స్తోత్రంవిని ఆమెకూ, శక్రునకు త్రిలోకాధిపత్యం యిస్తానని మాటయిచ్చి యున్నాను. ఇంద్రుని జగత్తుకు అధిపతినిచేసి ఆ మాట నిలబెట్టుకుంటాను. సహస్రాక్షుడు రాజగుట తథ్యము. అని వారికి చెప్పెను.

అంతట పొట్టివడుగునకు బ్రహ్మ కృష్ణాజినం, బృహస్పతి యజ్ఞోపవీతం, బ్రహ్మ తనయుడు మరీచి అషాఢదండాన్ని వసిష్ఠుడు కమండలం, అంగిరసులు పట్టుపుట్టము, పులహుడు ఆసనం, పులస్త్యుడు పీతాంబరం ఇచ్చారు. ప్రణవ ఓంకారం, స్వరాలచేత ముస్తాబై సకలవేదాలు, శాస్త్రాలు సాంఖ్యయోగ విద్యలు ఆ ప్రభువును ఆశ్రయించాయి. జడలు, దండ కమండలు ఛత్రాలు ధరించి సర్వదేవమయుడైన ఆ వామనుడు బలియజ్ఞ వాటికలో ప్రవేశించెను. అ పొట్టివాడు తన చిట్టి అడుగు పెట్టినచోటల్లా భూమి పీడితురాలై వివరం (రంధ్రం) ఇచ్చింది. అలామెల్లగా అడుగుపెడుతూ ఆ వామనుడు నడువగా సముద్ర పర్వత ద్వీపాదులతో కూడిన భూమి అంతా కంపించింది. బృహస్పతి మెల్లమెల్లగా శివంకరమైన చక్కని మార్గం చూపిస్తూ ఉండగా ఆ కుహనావటువు అటలలోవలె సరదాగా అతిమందగమనంతో పయనించాడు. అంతట పాతాళాన్నుంచి మహానాగం శేషుడు బయలుదేరివచ్చి దేవదేవుడైన ఆచక్రి తోడైనాడు. ఆ ఉత్తమమైన శేషబిలం ఈనాటికీ ప్రసిద్ధివహించియున్నది. దానిని చూచినవారలకు సర్పభయం ఉండదు.

పుణ్యాత్ములైన మహర్షులతో లోమహర్షణుడు, సమస్త పర్వతవనాలతోకూడిన భూమి అలా కంపించుట చూచి తన గురువు శుక్రాచార్యులకు ప్రణమిల్లి బలి యిట్లడిగెను. ఆచార్యదేవా! సముద్ర పర్వతాదులతోసహా ఈ భూమి కదలాడుతున్నది. అసురులిచ్చు హవిస్సులను అగ్నులు నిరాకరిస్తున్నవి. ఈ విపరీతానికి కారణమేమి? బలి అడిగిన ప్రశ్నకు మహామేధావియగు శుక్రాచార్యుడు చాలాసేపు ఆలోచించి ఆ దైత్యపతితో యిలా అన్నాడు. దానవశ్రేష్ఠా! జగత్కారణుడగు శ్రీహరి కశ్యపుని ఇంటిలో అవతరించాడు. వామన రూపుడగు ఆ సనాతన పరమాత్మ నీ యజ్ఞవాటికకు రానున్నాడు. ఆయన అడుగుల బరువునకు భూమి కంపిస్తున్నది. కొండలు సముద్రాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఆ భూతేశ్వరుని భారం భూమి మోయజాలకున్నది. దేవాసుర గంధర్వ యక్ష పన్నగ మానవాదులతోకూడిన పంచభూతాత్మకమైన విశ్వాన్నంతా ఆయన ధరించి యున్నాడు. అట్టి సర్వాధారుడగు కృష్ణుని అనిర్వచనీయమైన మాయవల్ల ధార్య ధారక సంబంధం ఏర్పడి జగత్తు పీడింపబడుతోంది. ఆయన సన్నిధాన ప్రభావాన సురద్వేషులయిన రాక్షసులు యజ్ఞార్హతను కోల్పోయినారు. అందుచేతనే అగ్నులు వారలర్పించు హవిస్సులను గ్రహించుటలేదు. అని తన గురువు చెప్పిన మాటలు విన్నంతనే బలిచక్రవర్తి సంతోషంతో పొంగిపోయాడు. ఆచార్యదేవా! ఆహా! ఏమి నా అదృష్టం, ఎంత ధన్యుడను నేను! సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన ఆ పరమాత్ముడే నా యజ్ఞవాటికకు రానున్నాడు! నాకన్న అధికుడెవ్వడు? ఏ పరమాత్ముని యోగిజనులెంతో శ్రమించి చూడవలెనని ఉబలాట పడతారో అట్టి దేవదేవుడు తనంతటతానే నా యజ్ఞానికి వస్తున్నాడు. ఆహా ఏమి నాభాగ్యము గురుదేవా! సంతోష సమయాన నేను ఏం చేయాలో దయతో ఆదేశించండి! అని అడుగగా బలిచక్రవర్తికి