అంధకకృత గౌరీ స్తుతి

ఓం! శత సహస్ర ప్రణామాలు. భవానీ మాతకు... భూత భవిష్యాలలో లోక ప్రియం గావించే లోక ధాత్రికి, జనయిత్రికి, స్కందమాతకు, మహాదేవ ప్రియురాలికి నమస్సులు! సకల ధారిణికి, క్షీర ప్రదాయినికి, చైతన్య రూపిణికి త్రిలోక జననికి వందనాలు! ఓ ధరిత్రీ, దేవమాతా, యజ్ఞరూపిణీ, వేదరూపిణీ, స్మృతి, దయా, లజ్జా, కాంతి రూపిణీ! క్రోధ అసూయా రూపిణీ! మతీ! సదాపావనీ! దైత్య సైన్యనాశినీ, మహామాయా, వైజయంతీ! సుశుభా! కాళరాత్రీ! గోవింద సోదరీ, హిమవన్నగపుత్రీ, సర్వదేవ పూజితే! సర్వభూత గణార్చితే! విద్యే! సర్వస్వతీ! త్రినేత్రజాయే! మృడానీ! సర్వశరణ్యే! నీకు శరణాగతుడను. నన్ను రక్షించుము! నీకు నమస్సులు!” అంధకుడిలా స్తోత్రం చేయగా సంతోషించి అ విభావరి, కాంతిమతి “పుత్రా! లేలెమ్ము! సంతోషించాను. కావలసిన వరం కోరుకొనుమన్నది. అందులకాభృంగి, “ఓ పార్వతి తల్లీ! త్రికరణాలానే చేసిన పాపాలు నశింప జేయుము. అంబికే! ఈశ్వర చరణాల పట్ల నాకు ఎల్లపుడు భక్తి స్థిరంగా ఉండునట్లు నుగ్రహించు”మని ప్రార్థించగా ఆమె తథాస్తని ఆ హిరణ్యాక్ష పుత్రుణ్ణి దీవించింది. వాడు హరుని ఆరాధించి గణాధిపతి అయ్యాడు. “ఓ నారదా! ప్రాచీన కాలంలో విరూ పాక్షుడైన పరమ శివుడు మహూగ్రమైన భైరవరూపం దాల్చి అంధక మహాదైత్యుడి మద మణచి, తన కత్యంత భక్తుడైన భృంగిగా మార్చిన ఈ అద్భుత గాధ నీకు వినిపించాను! ఇది పుణ్యప్రదమైనది; పవిత్రమైనది; కల్యాణములు వర్షించునది; శివభక్తిని వర్థిల్ల జేయునది; ఉత్తములగు బ్రాహ్మణులు, ధర్మము, ఆయురారోగ్య సంపత్తులు కాంక్షించు వారలు సదా కీర్తించదగినది అని పులస్త్యుడు ముగించాడు.