కురుక్షేత్రానికి బలిరాక

అని రెండవ పాపశమన స్తోత్రమాహాత్మ్యమును వినిపించి పులస్త్యుడు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను - దానవేశ్వరుడగు ప్రహ్లాదుడు (బలికి హితోపదేశం చేసి) తీర్థ యాత్రలకు వెళ్లిన వెంటనే ఆవిరోచన తనయుడు యజ్ఞం చేయుటకై కురుక్షేత్రానికి వచ్చిచేరాడు. ఆ మహా ధర్మక్షేత్రంలో బ్రాహ్మణ పుంగవుడగు శుక్రాచార్యుడు తమ భృగు వంశీయులగు ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాడు. భార్గవులను యజ్ఞానికై పిలిచిన విషయం వినగానే అందున్న ఆత్రేయ గౌతమ గోత్రీయులూ, కౌశిక అంగిరసులగు బ్రాహ్మణులు, ఆకురుజాంగలాన్ని వదలి ఉత్తరంగా శతద్రూనదీ దిశగా వెళ్లి పోయారు. శతద్రునదిలో స్నానంచేసి విపాశానదికి వెళ్లారు. అక్కడ కూడ తృప్తిలభించకపోగా ఆనదిలోమునిగి పితరులనర్చించి అటనుండి సూర్య కిరణాల నుండి స్రవించిన పుణ్యనది. కిరణానదిచేరి అక్కడ స్నానమాడి, ఆ మహర్షులందరు పుణ్యజలయగు ఐరావతిలో మునిగి ఈశ్వరీ నదికి వెళ్లారు. ఓ నారదా! ఆత్రేయాదులగు నా మహర్షులందరు దేవికా నదిలో స్నానాలుచేసి, సయోష్ణీ నది మంగళ జలాలలో మునుగుటకై నదిలోనికి దిగారు. నీళ్లలో మునిగినంతనే వారందరు ఆ జలాల్లో తమ ప్రతి బింబాలను చూచి అబ్బురపడిపోయారు. మునిగి లేచి బయటకువచ్చిన తర్వాతగూడ తమప్రతిబింబాలను ఆనీళ్లలోచూచి మరల పరమాశ్చర్యంలో మునిగిపోయారు. స్నానానంతరం తీరానికి చేరి ఆశ్చర్యకర దృశ్యాన్ని గురించి పరస్పరం మాట్లాడుకుంటూ, ఆ అద్భుతమేమా అని ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లుతూ ఉండగా అల్లంత దూరాన పక్షుల కలకల ధ్వనులతో నిండి హరుని కంఠ సీమవలె నల్లగా ఒక విశాలమైన వృక్షముల గుంపు కనిపించింది. ఆ చెట్ల పొదలు ఆకాశాన్నీ పర్వతాన్ని కప్పివేసి సుదీర్ఘ లయిన ఊడలు శాఖలతో భూమిని తాకుతున్నాయి. నాలుగయిదు రంగుల పూల గుత్తులతో సర్వత్రానిండి శోభలు వెదజల్లుతున్న ఆఅరణ్యం నక్షత్రాల గుంపులతో నిండిన ఆకాశ వీధిలాగా హాయిగొలుపుతూ నయనోత్సవం కావిస్తోంది, ఆ ప్రదేశాన రకరకాల కమలాలతో - రాజీవాలు కోకనదాలు, పుండరీకాలతో చిత్రాలకు ఆహ్లాదాలు కలిగించే పద్మవనం కనిపించింది. ఆశోభకు పులకించిన హృదయాలతో ఆతాపసులందరు కమలాకరంలోనికి దిగే హంసలకు వలె ఆనందపరవశులై ఆ వనంలోకి నడచారు.