వామన మహా పురాణము
నరనారాయణుల వృత్తాంతము
అటు పిమ్మట పులస్త్యుడు, మునివరా! బ్రహ్మమానస పుత్రుడు దివ్యశరీరి యగు ధర్ముడు. దాక్షాయణి ఆయన భార్య. ఆ దంపతులకు హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడను నలుగురు కుమారులు. వారిలో హరి, కృష్ణులు యోగాభ్యాస నిరతులైనారు.
కాగా పురాణ ఋషిసత్తములయిన నరనారాయణులు లోకకళ్యాణార్థం హిమాలయాలలో బదరికాశ్రమాన గంగా తీరాన పరబ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశారు. వారలు గావించిన ఘోరతపస్సుకు చరాచర జగత్తంతా తల్లడిల్లినది. అది చూచి ఇంద్రుడు కలవర పాటొందెను. వారల తపస్సు భంగపరచుటకై దేవరాజు రంభాది అప్సరో కామినులను వారికడకు పంపెను. వారితో బాటు ఆమ్రపల్లవాద్యాయుధాలు ధరించి, సహచరుడైన వసంతునితో కలిసి మన్మథుడు కూడ వారల ఆశ్రమానికి వెళ్ళెను. వారందరు బదరికా శ్రమము ప్రవేశించి ఇష్టము వచ్చినట్టుగా విహరించసాగిరి. వసంతాగమనంతో ఆకులూడ్చుకొని పుష్పించిన మోదుగుచెట్లు అగ్ని శిఖల్లాగ భూమికి అలంకారంగా వెలుగొందినవి.
ఓ నారదా! వసంతలక్ష్మి రక్తాశోక హస్తాలతో, అరుణ కింశుక చరణాలతో, నీలాశోక కచభారంతో, వికసిత పద్మముఖంతో, సకల జన మనోభిరామమైన సౌందర్యాన్ని పుణికి పుచ్చుకుని బదరికాశ్రమంలో ప్రవేశించింది. తమ ఆశ్రమాన్ని ఆవరించిన ఆ అనవద్య శోభను తిలకిస్తూ నారాయణ ఋషి అచట అనంగుని చూచెను. అని చెప్పగా
నారదుడు: బ్రహ్మర్షే! అవ్యయుడు జగన్నాథుడునగు నారాయణర్షి దర్శించిన ఆ మన్మథు (అనంగు) డెవ్వరు? అని అడిగెను.