వామన మహా పురాణము
తెలుగులో వామన పురాణాలు
వామన పురాణాన్ని మొదటిసారిగా క్రీ.శ. 1540 ప్రాంతాలలో జీవించిన పొన్న తోట ఔబళకవి అనువదించాడు. తరువాత దాదాపు అదే కాలంలో జీవించిన లింగమ కుంట రామ కవి కూడా వామనపురాణాన్ని తెలుగుచేశాడు. కొద్ది కాలం తరువాత క్రీ.శ. 1600 ప్రాంతాలలో ఉన్న ఎలకూచి బాలసరస్వతి దీనిని తెలిగించాడు. కాలం ఇత మిత్థంగా తెలియని నంది సింగన బహుశః నంది తిమ్మన తండ్రి కావచ్చును దీనిని ఆంధ్రీకరించాడు. అయితే ఇవి అన్నీ కాలగర్భంలో కలసి పోయి నష్టమైనాయి.
1928లో నడకుదుటి వీరరాజు పంతులుగారు గ్రాంథిక వచనానువాదం చేసిన గ్రంథం ఉన్నది. ఆ తరువాత కొద్ది కాలానికే రామావఝల కొండయ్య శాస్త్రి అనే రాయలసీమకు చెందిన కవి పద్య కావ్యంగా ఈ వామన పురాణాన్ని అనువదించాడు. ప్రసుత్తం గ్రంథాలయాలలో మాత్రమే లభ్యం అవుతున్న వామనపురాణ పద్యకృతి ఇది ఒక్కటే. ఈ మధ్యన 1984లో ప్రతిశ్లోక తాత్పర్యానువాదంతో విపులపీఠిక, అనుబంధాలతో ఏలూరిపాటి అనంతరామయ్యగారు వామన పురాణాన్ని వచనంగా అనువదించి తిరుమల తిరుపతి దేవస్థానాలవారి తరఫున రెండుసంపుటాలుగా ముద్రింపచేశారు.
అలాగే 1989లో శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టువారు వామన పురాణాన్ని తెలుగులిపిలో సంస్కృత శ్లోకం, తెలుగు తాత్పర్యంతో ప్రచురించారు. అనువాదకులు డా. వారణాసి రామమూర్తి ‘రేణు’ గారు. ఇవి ఇప్పటికి ప్రస్తుత వామన పురాణం వచనానికి ముందు వెలువడిన గ్రంథాలు. ఈ అనువాదంలో పై గ్రంథాలను సహాయకారులుగా తీసుకొనడం జరిగింది. అందుకు ఆయా గ్రంథకర్తలకు నమోవాకాలు.
ఇలాంటి పురాణాల్ని తేటతెలుగులో సంక్షిప్తంగా ముఖ్య విషయాలను వేటినీ వదలకుండా వచనంలో అందిస్తున్నాం. ఈ రకమైన శైలిలో ఈ పురాణాలు రావటం ఇదే ప్రథమం. ప్రాచీన భారతీయ సంప్రదాయ సాహిత్యం మీద ఆసక్తి కలవారు దీనిని సమగ్రంగా చదవాలని మా కోరిక. ఈ విధమైన ముద్రణకు కారణభూతులైన ఇమ్మడిశెట్టి అక్కేశ్వరరావు ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఇమ్మడిశెట్టి రామకుమార్ గారికి వామనరూపధారి శ్రీమహావిష్ణువు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఈ పురాణభారతి కార్యక్రమాన్ని వారిచేత జయప్రదంగా పూర్తి చేయించాలని ప్రార్థన.
యే పఠంతి చ శృణ్వత్తి తేఽపియాతి పరాంగతిమ్
ఈ వామన మహాపురాణాన్ని వినేవారు, పఠించేవారు ఉత్తమగతిని పొందగలరు.
విజయవాడ, ఇట్లు
30.06.2006. ఆవంచ సత్యనారాయణ
ఓం గణేశాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ