బ్రహ్మ సభావైభవం

అవ్యయుడు తపోరాశి అయిన బ్రహ్మను దర్శించే కుతూహలంతో సువిశాలమై సామగానంతో, భ్రమరఝంకారాలతో ప్రతిధ్వనిస్తూ, శ్రేయాలొనగూర్చి శత్రునాశనం చేయగల మనోహరమైన ఆ బ్రహ్మ సభను చూచి వారు పరమానందం పొందారు. బహ్వృచ ప్రముఖులచేత, క్రమపాదాక్షర సమన్వితంగా, ఆయా సంబద్ధ క్రతువులకు అనుగుణంగా చదువబడే ఋగ్వేద మంత్రములను ఆ విబుధవర్యులు ఆలకించిరి. యజ్ఞ విద్యా పారగులు పదక్రమ పారవిదులు, సస్వర మంత్రపాఠకులు సునాదాలతో ఆ సభ మారు మ్రోగు చుండినది. యజ్ఞ ప్రశంసతో బాటు శిక్షాశాస్త్రంలో పారీణులయిన ద్విజులయు, వేదార్థం తెలిసినవారు సర్వవిద్యాకోవిదులు లౌకిక విద్యల్లో గూడ ప్రవీణులగువారల ప్రవచనాలను ఆ పుణ్యవ్రతులయిన దేవతలు ఆయా ప్రదేశాలలో వినగలిగారు. జపహోమ నిరతు అయిన ఆ కశ్యపకుమారులు (దేవతలు) ఆ సభామధ్యంలో శ్రీమంతుడు సురాసుర గురుడు లోక పితామహుడునైన బ్రహ్మను చూచారు. ప్రజాపతులందరు ఆయనను ఉపాసిస్తున్నారు. దక్షుడు, ప్రచేతసులు, పులహ మరీచులు, భృగువు, అత్రి, వసిష్ఠుడు, గౌతమ, నారదులు మొదలయిన బ్రహ్మణ్యులు, విద్యలు, అంతరిక్షం, వాయువు, తేజం, నీరు, భూమి, శబ్ద, స్పర్శ రూపరసగంధాలు ప్రకృతి వికృతులు, మహత్తు, కారణం, సాంగోపాం గాంలయిన నాలుగు వేదాలు, లోకపతులు, నయ, క్రతు, సంకల్ప ప్రాణాలు అన్నీ దేహంధరించి ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారు. వీరేగాక ఇంకా ఎందరెందరో ఆ మహనీయుని ఆరాధిస్తున్నారు. అర్థ ధర్మ కామాలు, క్రోధ హర్షాలు, శుక్ర బృహస్పతి సంవర్త బుధశనైశ్చర రాహు మొదలయిన సర్వగ్రహాలు ఆయనను సేవిస్తున్నాయి. బ్రహ్మవిదులయిన మరుత్తులు విశ్వకర్మ వసువులు సూర్యచంద్రులు దివారాత్రులు పక్షాలు మాసాలు షడృతువులు సేవిస్తూ ఉండగా, సర్వకామ్యాలు సమకూర్చే ఆ దివ్యసభలోనికి కశ్యపుడు తన సుతులగు దేవతలందరతో కలిసి ప్రవేశించాడు. బ్రహ్మర్షి సమూహంతో సేవించబడుతూ, బ్రాహ్మీశ్రీ (లక్ష్మి)లు సంభావించగా మనస్సున కాహ్లాదం గొలిపే ఆ పేరోలగంలో (సభలో) ఉత్తమోత్తమమైన ఆసనం మీద సుఖముగా కూర్చున్న ఆ బ్రహ్మదేవునకు బ్రహ్మర్షులతో సహా అందరు తలలు వంచి ప్రణామాలు చేశారు. అలా ఆ పరమాత్మకు నమస్కరించి పాపరహితులు, కల్మష దూరులునైన ఆ సురలు స్వస్థచిత్తులై నిలువబడిరి. దేవ ప్రముఖుడైన కశ్యపునితో కూడి ఏతెంచిన ఆ దేవసమూహాన్ని చూచి దేవేశ్వరుడుగు విరించి (బ్రహ్మ) ఇలా అన్నాడు: