బ్రహ్మకృత వామన స్తోత్రం

సత్యమూర్తివగు మాధవా! నీకు నమస్సులు. ఓ శాశ్వతా! విశ్వరూపా! నీకు ప్రణామాంజలులు. శాత్రవారణ్యాలను, మహాపాప కాననాలను భస్మం చేసే దావానల స్వరూపా! నీకు కైమోడ్పులు! పుండరీకాక్షా! విశ్వభావనా! జగదాధారా! పురుషోత్తమా! నీకు నమస్కారములు. నారాయణా! జగన్మూర్తీ! జగత్పతీ! గధాధరా! పీతాంబరధరా! శ్రియఃపతీ! జనార్దనా! మీకు ప్రణతులు. ప్రభూ! నీవు మా యోగక్షేమాలు రక్షించేవాడవు, విశ్వాత్మవు, అవ్యయుడవు, సర్వ వ్యాప్తివి, సర్వం ధరించేవాడవు, ధరణీ ధరుడవు, అన్ని రూపాలు నీవే. అట్టి నీకు జోహారులు! ముల్లోకాలను వర్ధింపజేయు ప్రభూ! వర్ధిల్లుము! దేవపూజితా! దేవేశ్వరా! దేవరాజు యింద్రునికి అశ్రుమోచనం కావింపుము! నీవు ధాతువు, విధాతవు; సంహర్తవు, మహేశ్వరుడవు. మహాలయ రూపివి. మహాయోగివి, యోగశాయివి. నీకు మాటి మాటికి నమస్సులు! ఇలా స్తోత్రం చేసిన తర్వాత ఆ జగన్నాథుడగు శ్రీహరి భగవాన్! నాకు ఉపనయనం చేయుమని అర్థించినంతనే బృహస్పతి గోత్రుడు మహాతేజస్వి అయిన భరద్వాజ మహర్షి ఆ భగవంతునకు జాత కర్మాది సంస్కారాలు జరిపి అ ఈశ్వరునకు బ్రహ్మచర్య వ్రతదీక్ష యిచ్చాడు. ఆ సర్వ శాస్త్రవేది ఉపనయన కాండ పూర్తి చేయగానే అక్కడసమావేశమైన వారందరూ అద్భుతవటువునకు కానుక అందజేశారు.