వామన మహా పురాణము
సతీదేవి శరీర పరిత్యాగం
అని నారదునికి పులస్త్యుడు వివరించి, దేవర్షీ! ఈ విధంగా భగవంతుడగు హరుడు కపాలియయ్యెను. అది కారణంగా దక్షుడాయనను ఆహ్వానించడాయెను. యజ్ఞంలో పాల్గొనుట కర్హురాలైనను కపాలి భార్యయగుటచే తన కుమార్తె సతిని గూడ ఆహ్వానించలేదు. ఈ లోపుగా గౌతముని కుమార్తె జయ, అందమైన గుహలతో కూడిన మందర పర్వతమునకు వెళ్ళి సతీదేవిని దర్శించెను. ఒంటరిగా వచ్చిన జయను చూచి దాక్షాయణి, విజయ, జయంతీ, అపరాజితలేరీ? నీ వొక్కతెవే ఏలవచ్చితివనెను. పరమేశ్వరితో జయ, "వారందరు మన మాతామహుడొనరించుచున్న యజ్ఞమునకు అహ్వానితులై వెళ్ళిరి. మా తల్లిదండ్రులు అహల్యా గౌతములతో కలిసి వెళ్ళుచూ నేను నిన్ను చూడవలెనని దారిలో ఇటు వచ్చితిని. నీవు మహేశ్వరునితో కలిసి వచ్చుట లేదా? లేక తరువాత వచ్చెదవా? ఋషులు వారి భార్యలు, దేవతలు, సపత్నీకుడై చంద్రుడు, పదునాలుగు భువనాల్లోగల చరాచర ప్రాణులందరూ ఆహ్వానితులై యజ్ఞానికి వెళ్ళగా నీ వేల బయలుదేరకుంటివి పిన్నీ? నిన్ను మీ తండ్రి పిలువ లేదా?" అనెను.
పిడుగుపాటు లాంటి ఆ మాటలు వినిన తోడనే సతీదేవి క్రోధాతిరేకంతో అక్కడ కక్కడనే ప్రాణములు వదలెను. చనిపోయిన సతీదేవిని చూచి జయ దుఃఖాతి రేకంతో కన్నీరు కార్చుచు విలపింపసాగెను. ఆరోదన ధ్వనివిని పరమేశ్వరుడదరిపడి, "ఏమి జరిగిన" దనుచూ జయను సమీపించెను. పరశుఘాతానికి తెగిపడిన తీగవలె నేల కొరగిపడియున్న సతిని జూచి, “నరుకబడిన తీగివలె ఈమె ఏలపడియున్న”దని జయ నడిగెను. అప్పుడు జయ ప్రభూ! తన తోబుట్టువు లెల్లరూ భర్తలతోనాహ్వానింపబడి దక్ష యజ్ఞమునకు వెళ్ళిన సంగతియూ, ఇంద్రాది సకల దేవతలు వెళ్ళిన విషయం విని, ఈ నాపినతల్లి అంతర్దుఃఖాగ్నిలో మ్రగ్గి ఈ దశకు ప్రాప్తించిన" దనెను.