వామన మహా పురాణము
ఆశ్రమ ధర్మాలు
తెలివిగల గృహమేధి పుత్రపౌత్రులు కలిగిన తర్వాత తన శరీరపాటవం తగ్గడం గమనించి వెంటనే అత్మశుద్ధికోసం వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. అరణ్యంలో దొరకే కంద మూలాదులు తింటూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని తపస్సు చేసుకోవాలి. భూమిమీద శయనిస్తూ బ్రహ్మచర్యం నెరపాలి. పితరులను దేవతలను ఉపాసిస్తూ అతిథి అభ్యాగతుల సేవ చేయాలి. హోమం త్రికాలస్నాన సంధ్యానుష్ఠానం జటావల్కల ధారణం వనాల్లో లభ్యమయ్యే తైలాదులుపయోగిస్తూ వానప్రస్థ జీవితం నెరపాలి. సర్వసంగ పరిత్యాగం, బ్రహ్మచర్యం, నిరహంభావం, ఇంద్రియ విజయం, ఒకేచోట దీర్ఘ కాలం నివసించకుండుట, లౌకిక కార్యాలకు దూరంగా ఉండటం, భిక్షాన్న గ్రహణం, చీటికిమాటికి కోపించకుండుట, ఆత్మ జ్ఞానాపేక్ష, ఆత్మను తెలుసుకోవడం, తెలియజెప్పడం ఇవి సన్యాశ్రమ ధర్మాలు.
నిశాచరా! ఇప్పుడు చతుర్వర్ణాల వారి విధులేమో చెప్పెదము. వినవలసినది; బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థాశ్రమ విధులు బ్రాహ్మణులతో బాటు క్షత్రియులు కూడ ఆచరించాలి. ఇక గార్హస్య వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు వైశ్యులు అనుష్టించాలి. కాగా శూద్రులకు గృహస్థాశ్రమ నిర్వహణమే ఉత్తమంగా చెప్పబడినది. ఈ విధంగా తమకు విధించబడిన ఆశ్రమ ధర్మాలను నాలుగు వర్ణాలవారూ వదలకుండా ఆచరించాలి. అలా కాక తమతమ ధర్మాలను త్యజించిన వారు ప్రత్యక్షదైవం సూర్యుని కోపానికి గురికాగలరు. సూర్యుడు కోపిస్తే మానవులు వ్యాధిపీడితులౌతారు. కులనాశనం సంభవిస్తుంది. కావున ఓ రాక్షస రాజా! తన క్షేమం, వంశ క్షేమంకోరిన మానవుడెట్టి పరిస్థితిలోను స్వధర్మాచరణం వదలకూడదు. వదలినచో భాస్కరుని కోపాగ్నికి ఆహుతి కాగలడు సుమా!” అని తెలిపాడు.